పుత్తడి దిగుమతులు 500 టన్నులే!
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పుత్తడి దిగుమతులు 40 శాతం తగ్గి 500 టన్నులకు చేరే అవకాశాలున్నాయి. రూపాయి స్థిరత్వం కోసం, కరెంట్ అకౌంట్ లోటు(క్యాడ్) కట్డడి కోసం ప్రయత్నాలు చేస్తున్న ప్రభుత్వానికి ఇది ఊరటనిచ్చే అంశం. బంగారం డిమాండ్ తగ్గించడానికి ప్రభుత్వం, ఆర్‌బీఐ తీసుకుంటున్న పలు చర్యలు సత్ఫలితాలిచ్చాయని నిపుణులంటున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అక్టోబర్ వరకూ బంగారం దిగుమతులు 400 టన్నులకు చేరడమే దీనికి నిదర్శనమని వారంటున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే మిగిలిన ఐదు నెలలకు మరో 100 టన్నుల బంగారం మాత్రమే దిగుమతి అవుతుందని రెవెన్యూ ఉన్నతాధికారొకరు చెప్పారు.
గత ఆర్థిక సంవత్సరంలో పుత్తడి దిగుమతులు 835 టన్నులుగా అంచనా. దీంతో కరెంట్ అకౌంట్ లోటు(క్యాడ్) రికార్డ్ స్థాయికి(జీడీపీలో 4.8%)కు ఎగసింది. కాగా, ఈ ఏడాది ఏప్రిల్‌లో 142 టన్నులు, మే(162), జూలై(47.75), ఆగస్టు(3.38), సెప్టెంబర్(11.6), అక్టోబర్(23.5) టన్నుల చొప్పున పసిడి దిగుమతులు జరిగాయి.