కుప్పకూలిన బంగారు గని; కార్మికుల దుర్మరణం
దార్ ఏ సలామ్: బంగారు గని కుప్పకూలడంతో నలుగురు కార్మికులు దుర్మరణంపాలైన ఘటన తూర్పు ఆఫ్రికా దేశం టాంజానియాలో చోటుచేసుకుంది. గెటా ప్రాంతంలోని ఓ గనిలో గురువారం ఈ దుర్ఘటన జరిగింది. ఏడుగురు కార్మికుల బృందం.. పది అడుగుల లోతులో పనిచేస్తుండగా వారిపై మట్టిపెళ్లలు విరిగిపడ్డాయని, నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో ముగ్గురికి గాయాలయ్యాయని గెటా రీజనల్ పోలీస్ కమాండర్ మ్వాబులాంబో తెలిపారు.
ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మంచినీటి సరస్సుగా ఖ్యాతికెక్కిన విక్టోరియా సరస్సు, దాని తీరంలో భారీగా ఉన్న బంగారం నిక్షేపాలు గెటా ప్రాంతానికి ప్రకృతి ప్రసాదించిన వరం. అయితే గనుల తవ్వకాలు ఎక్కువ శాతం చిన్న, మధ్యతరహా సంస్థలే చేపడుతుండటం, సరైన భద్రతాప్రమాణాలు పాటించకపోవడం వల్ల గెటాలో తరచూ ప్రమాదాలు సంభవిస్తున్నాయి. జనవరిలో చోటుచేసుకున్న ప్రమాదంలో ఒక చైనీయుడు సహా 14 మంది మరణించిన సంగతి తెలిసిందే.