బంగారం కొనుగోళ్లపై అరుణ్ జైట్లీ స్పష్టత
నోట్ల రద్దు అనంతరం కేంద్రం దృష్టి బంగారంపై పడినట్టు పలు వార్తలు ప్రచారం అవుతున్న నేపథ్యంలో ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ బంగారం కొనుగోళ్లపై స్పష్టతనిచ్చారు. వెల్లడించిన డబ్బుతో బంగారం కొంటే ఎలాంటి సమస్య ఉండదని వెల్లడించారు. దాంతో పాటు పన్ను మినహాయింపు ఉన్న డబ్బుతో, ఇంట్లో దాచుకున్న నగదుతో బంగారం కొన్నా ఎలాంటి ఇబ్బంది ఉండదని పేర్కొన్నారు. ఇలా కొనుగోలు చేసిన బంగారంపై, నగలపై ఎలాంటి పన్నును ప్రభుత్వం విధించదని జైట్లీ క్లారిటీ ఇచ్చారు. బంగారంపై నడుస్తున్న ప్రచారం అవాస్తవమని జైట్లీ వెల్లడించారు. అంతేకాక వారసత్వంగా వచ్చిన బంగారంపైనా పన్ను ఉండదని తెలిపారు. వివాహమైన మహిళ వద్ద అరకేజీ బంగారం ఉంటే ప్రభుత్వం సీజ్ చేయదు, అదేవిధంగా పెళ్లి కాని మహిళ వద్ద 250 గ్రాముల బంగారం ఉన్నా ఎలాంటి స్వాధీనం ఉండదని అరుణ్ జైట్లీ వివరించారు. పురుషుల వద్ద కూడా 100 గ్రాముల మేర బంగారం ఉండొచ్చని, దీనిపై కూడా ప్రభుత్వం ఎలాంటి అభ్యంతరం చెప్పదని చెప్పారు.
పెద్ద నోట్ల రద్దు అనంతరం నల్లకుబేరులు ఇబ్బడిమొబ్బడిగా బంగారం కొనుగోళ్లు చేపట్టిన సంగతి తెలిసిందే. నల్లకుబేరులు బంగారం కొనుగోళ్లు ఎక్కువగా చేపడుతున్నారని, వారికి ఆభరణ దుకాణదారులు సహకరిస్తున్నారని తెలుసుకున్న కేంద్రం వారికి సీరియస్ వార్నింగ్ కూడా ఇచ్చింది. కొనుగోలుదారులు వద్ద పాన్ కార్డు తీసుకోకుండా ఎలాంటి బంగారం విక్రయాలు చేపట్టవద్దని హెచ్చరించింది. అంతేకాక పలు ప్రాంతాల్లోని బంగారం దుకాణాల్లో ఆదాయపు పన్ను శాఖ రైడ్స్ కూడా నిర్వహించింది. దీంతో ఇటు కొనుగోలుదారుల్లోనూ, అటు బంగార దుకాణాల్లోనూ భయాందోళనలు నెలకొన్నాయి. ప్రస్తుతం బులియన్ మార్కెట్లో బంగారం ధరలు ఆరు నెలల కనిష్ట స్థాయికి పడిపోయాయి. 10 గ్రాముల బంగారం ధర 28,120 వద్ద ట్రేడ్ అవుతోంది.