పుస్తెలకూ బంగారం దొరకట్లేదు! | finance minister jaitley and aibjsf stick on thier stands | Sakshi
Sakshi News home page

పుస్తెలకూ బంగారం దొరకట్లేదు!

Published Mon, Mar 28 2016 10:52 AM | Last Updated on Mon, Aug 20 2018 5:17 PM

పుస్తెలకూ బంగారం దొరకట్లేదు! - Sakshi

పుస్తెలకూ బంగారం దొరకట్లేదు!

న్యూఢిల్లీ: బంగారు, వజ్రాల ఆభరణాలపై కేంద్రం విధించిన 1 శాతం ఎక్సైజ్ పన్ను వివాదం మరింత ముదురుతోంది. తాజా బడ్జెట్లో కేంద్రం ప్రతిపాదించిన ఈ పన్నును వెనక్కి తీసుకునేంత వరకు తమ  ఆందోళన కొనసాగుతుందని బంగారు వర్తక సంఘాలు స్పష్టం చేశాయి. దీంతో పెళ్లికూతుళ్లకు పుస్తెలతాడు చేయించడానికి కూడా బంగారం దొరికే పరిస్థితి లేకుండా పోతోంది. తాళిబొట్లు చేయించాలన్నా, పెళ్లికి ఆభరణాలు చేయించాలన్నా కూడా దుకాణాలు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నట్లు ప్రజలు వాపోతున్నారు. గత కొన్ని రోజులుగా సాగుతున్న ఉద్యమాన్ని మరింత  ఉధృతం చేయాలని వ్యాపారులు నిర్ణయించుకున్నారు. అటు తమ నిర్ణయంపై వెనక్కి తగ్గేది లేదని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. వజ్రాలు, బంగారం లాంటి విలువైన, విలాసవంతమైన ఉత్పత్తులను పన్నుల జాబితాలో లేకుండా వదిలిపెట్టే ప్రశ్నేలేదని తెగేసి చెబుతున్నారు. దీంతో దేశవ్యాప్తంగా స్వర్ణ, వజ్రాల వ్యాపారులు చేస్తున్న ఆందోళన చర్చనీయాంశమైంది.

పన్ను రద్దు చేసేవరకు తమ ఆందోళన కొనసాగుతుందని అఖిల భారత జువెల్లర్స్, బులియన్ వ్యాపారుల సమాఖ్య (ఏఐబీజేఎస్‌ఎఫ్) స్పష్టంచేసింది.  దీంతో ఎక్సైజ్ పన్నుకు వ్యతిరేకంగా కొన్ని ఆభరణ వ్యాపారుల సంఘాలు  చేస్తున్న సమ్మె 26వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా సమాఖ్య అధ్యక్షుడు ప్రవీణ్ గోయల్ ఒక శ్వేతపత్రం విడుదల చేస్తూ, తాజాగా విధించిన ఎక్సైజ్ పన్ను కారణంగా రోజువారీ పని చేసుకునే స్వర్ణకారులు, కారిగార్‌లకు ఉపాధి లేకుండా పోతుందని తెలిపారు. పన్నువిధింపు నిర్ణయాన్ని ప్రధాని, ఆర్థికమంత్రి పునఃసమీక్షించాలని డిమాండ్ చేశారు. బంగారం వ్యాపారంలో నల్లధనం ఎక్కువగా పోగవుతున్నదన్న అరుణ్‌జైట్లీ వ్యాఖ్యలపై నిరసన వ్యక్తం చేశారు.

మరోవైపు విలాస  వస్తువులపై పన్ను తప్పదని ఆర్థికమంత్రి జైట్లీ స్పష్టం చేశారు. పన్ను అధికారులు ఆభరణాల వర్తకులను వేధించకుండా కట్టుదిట్టమైన  చర్యలు తీసుకుంటామని, పన్నుపై నిబంధనలను సరళతరం చేస్తామని జైట్లీ హామీ ఇచ్చారు.  అటు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు  కేంద్రం ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలని కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement