పసిడిపై పన్ను 3% | Gold to be taxed at 3% under GST; footwear below ₹500 at 5% | Sakshi
Sakshi News home page

పసిడిపై పన్ను 3%

Published Sun, Jun 4 2017 2:04 AM | Last Updated on Tue, Sep 5 2017 12:44 PM

పసిడిపై పన్ను 3%

పసిడిపై పన్ను 3%

► తగ్గనున్న దుస్తులు, బిస్కెట్లు, పాదరక్షల ధరలు
► మరికొన్ని వస్తువులు, సేవల పన్నురేట్ల ఖరారు


న్యూఢిల్లీ: జీఎస్టీ (వస్తు సేవల పన్ను) పరిధిలోకి రానున్న మరికొన్ని వస్తువులు, సేవలను పన్ను శ్లాబులను శనివారం జీఎస్టీ మండలి ప్రకటించింది. కొంతకాలంగా బంగారంపై జీఎస్టీ ఎలా ఉంటుందోనన్న సస్పెన్స్‌కు మండలి తెరదించింది. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ నేతృత్వంలో ఢిల్లీలో సమావేశమైన జీఎస్టీ కౌన్సిల్‌ బంగారంపై 3శాతం పన్నును ఖరారు చేసింది.

ప్రస్తుతం ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా (2 నుంచి 2.5 శాతం) పన్నువసూలు చేస్తున్నారు. అయితే కొందరు ఐదుశాతం పన్నుపై.. మరికొందరు 2 శాతంపై డిమాండ్‌ చేశారు. ఆ తర్వాత ఏకాభిప్రాయం మేరకు దీన్ని 3శాతంగా మండలి నిర్ణయించింది. సానబెట్టని వజ్రాలపై 0.25 శాతం పన్ను విధించింది.

తగ్గనున్న బిస్కెట్లు, పాదరక్షల ధర
అటు, రూ.1000 లోపలున్న దుస్తులు, బిస్కట్లు, చెప్పులు మొదలైనవాటి ధర స్వల్పంగా తగ్గనుంది. మండలి సమావేశం అనంతరం జీఎస్టీ పరిధిలోకి వచ్చే వస్తువుల వివరాలను జైట్లీ వెల్లడించారు.  తునికాకును 18 శాతం, బీడీలను 28 శాతం పన్ను పరిధిలోకి తీసుకొచ్చారు. సిల్క్, జనపనార వస్త్రాలకు పన్నునుంచి పూర్తి మినహాయింపునివ్వగా.. కాటన్, ఇతర రకాల దారాలపై 5 శాతం పన్ను విధించనున్నారు. అయితే చేతితో నేసిన దారాలు, పోగులు మాత్రం 18 శాతం పరిధిలోకి రానున్నాయని జైట్లీ వెల్లడించారు. జూలై 1 నుంచి జీఎస్టీ అమల్లోకి రానున్నందున మరోసారి జూన్‌ 11న జీఎస్టీ మండలి సమావేశం అవుతుందని జైట్లీ తెలిపారు.

ప్రస్తుతానికి కిలో వందరూపాలయకు తక్కువగా ఉన్న బిస్కెట్లపై 20.6 శాతం, అంతకన్నా ఎక్కువ ధర ఉన్న వాటిపై 23.11 శాతం పన్నుభారం పడుతుండగా.. జీఎస్టీలో అన్ని రకాల బిస్కెట్లపై పన్నును 18 శాతం పరిధిలోకి తీసుకొచ్చారు. 9.5శాతం పన్ను ఉన్న రూ.500లోపు పాదరక్షలపై 5 శాతం, అంతకన్నా ఎక్కువ ధర కలిగిన పాదరక్షలపై 23.1 నుంచి 29.58 శాతం ఉన్న పన్నును 18 శాతంగా నిర్ణయించారు. సౌర పానెళ్ల పరికరాలపై 5 శాతం పన్ను విధించాలని నిర్ణయించారు. వ్యవసాయ పరికరాలను జీఎస్టీ మండలి 5, 12 శాతం పన్ను శ్లాబుల్లోకి చేర్చింది.  

అనుకున్న గడవునుంచే!
అయితే జీఎస్టీ అమలును ఒకనెల వాయిదా వేయాలంటూ పశ్చిమబెంగాల్‌ ఆర్థిక మంత్రి అమిత్‌ మిత్రా అన్నారు. దీనివల్ల పెద్ద నష్టమేమీ జరగదన్నారు. దీనిపై జైట్లీ స్పందిస్తూ.. ‘మిగిలిన రాష్ట్రాలేవీ అ భ్యంతరం తెలపలేదు. పశ్చిమబెంగాల్‌ కూడా జూలై 1నుంచే జీఎస్టీని అమలుచేస్తుందని ఆశిస్తున్నాం. ఎట్టిపరిస్థితుల్లో నిర్ణయించిన తేదీనుంచే అమల్లోకి వస్తుంది’ అని స్పష్టం చేశారు.

యాంటీ–ప్రాఫిటీరింగ్‌ (జీఎస్టీ అమల్లోకి వచ్చాక పన్ను శ్లాబుల కారణంగా వచ్చే లాభాలను కస్టమర్లకు బదలాయించటం) నిబంధనలకు సంబంధించి రాష్ట్రాలు లేవనెత్తే ఫిర్యాదులను పరిశీలించేందుకు అధికారులతో ఓ కమిటీని ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయించింది. మరోవైపు, జీఎస్టీ వ్యవస్థకు ఐటీ పరంగా ఎలాంటి లోపాల్లేని భద్రత వ్యవస్థ ఏర్పాటుచేసినట్లు జీఎస్టీ నెట్‌వర్క్‌ స్పష్టంచేసింది.

ఏ వస్తువుకు ఎంత పన్ను?
పన్నులేనివి: జనపనార, తాజా మాంసం, చేపలు, చికెన్, గుడ్లు, పాలు, మజ్జిగ, పెరుగు, తేనె, తాజా పళ్లు, తాజా కూరగాయలు, గోధుమపిండి, శెనగ పిండి, బ్రెడ్, ప్రసాదం, ఉప్పు, బొట్టు బిళ్లలు, సింధూరం, స్టాంపులు, జ్యుడిషియల్‌ పేపర్స్, వార్తాపత్రికలు, గాజులు, చేనేత, రూ.వెయ్యికన్నా తక్కువ చార్జీ ఉన్న లాడ్జీలు

5 శాతం పరిధిలోకి: ముక్కలుగా కోసిన చేపలు, రూ. 1000 కన్నా తక్కువ ధర, దుస్తులు, శీతలీకరించిన కూరగాయలు, పిజ్జా బ్రెడ్, రస్క్, సగ్గుబియ్యం, లైఫ్‌బోట్లు, రైల్వే, విమాన రవాణా సేవలు, చిన్న రెస్టారెంట్లు

12 శాతం పరిధిలోకి: రూ.1000 కన్నా ఎక్కువ ధర గల దుస్తులు, శీతలీకరించిన మాంస ఉత్పత్తులు, వెన్న, చీజ్, జంతువుల కొవ్వు, భుటియా, నమ్‌కీన్, కలరింగ్‌–చిత్రాల పుస్తకాలు, గొడుగులు, కుట్టు మిషన్లు, నాన్‌–ఏసీ హోటళ్లు, బిజినెస్‌ క్లాస్‌ విమానం టికెట్లు, ఎరువులు, వర్క్‌ కాంట్రాక్టులు

18 శాతం పరిధిలోకి: పాస్తా, కార్న్‌ఫ్లేక్స్, పేస్ట్రీలు, కేకులు, నిల్వఉంచిన కూరగాయలు, జామ్, సాస్‌లు, సూప్‌లు, ఇన్‌స్టంట్‌ ఫుడ్‌ మిక్స్‌లు, ఎన్వలప్‌లు, ప్రింటెడ్‌ సర్క్యూట్‌లు, కెమెరాలు, స్పీకర్లు, మానిటర్లు , మద్యం సరఫరా చేసే ఏసీ హోటళ్లు, టెలికాం సేవలు, ఐటీ సేవలు, ఆర్థిక సేవలు

28 శాతం పరిధిలోకి: మొలాసిస్, కోకోవా లేని చాక్‌లేట్స్, చాకలేట్‌ పూతపూసిన వేఫర్స్, ఆఫ్టర్‌ షేవ్‌ లోషన్, వాల్‌పేపర్, సెరామిక్‌ టైల్స్, వాటర్‌ హీటర్, డిష్‌వాషర్, త్రాసు, వ్యాక్యూమ్‌ క్లీనర్, షేవర్స్, వ్యక్తిగత అవసరాల కోసం విమాన సేవలు, 5–స్టార్‌ హోటళ్లు, రేస్‌క్లబ్‌ బెట్టింగుల, సినిమాలు మొదలైనవి

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement