కుక్కలకు రూ. 5 కోట్ల ఆస్తి ఇచ్చేశారు! | golden retrievers given 5 crores property by mumbai couple | Sakshi
Sakshi News home page

కుక్కలకు రూ. 5 కోట్ల ఆస్తి ఇచ్చేశారు!

Published Wed, Mar 8 2017 12:37 PM | Last Updated on Tue, Sep 5 2017 5:33 AM

కుక్కలకు రూ. 5 కోట్ల ఆస్తి ఇచ్చేశారు!

కుక్కలకు రూ. 5 కోట్ల ఆస్తి ఇచ్చేశారు!

ఎవరైనా వాటిని 'కుక్కలు' అని పిలిస్తే చాలు.. ఆమెకు ఎక్కడలేని కోపం వచ్చేస్తుంది. అవి మా బిడ్డలని చెబుతారు ముంబైకి చెందిన నందినీ సుచ్‌దే (52). వాటిపేర్లు బడ్డీ, టైనీ. మామూలుగా అయితే కుక్కలను గొలుసులతో కట్టేస్తారు.. కానీ గోల్డెన్ రిట్రీవర్ జాతికి చెందిన ఈ శునకాలకు వాటి పేర్లకు తగ్గట్లే మెడలో బంగారు గొలుసులు ఉంటాయి. అంతేకాదు.. త్వరలోనే ఇవి ముంబై నగరంలో, ఇంకా మాట్లాడితే దేశంలోనే అత్యంత ధనవంతులైన శునకాలు అవుతాయి. ఎందుకంటే, ఆ దంపతులు వీటినే తమ వారసులుగా ప్రకటించి వాటికి రూ. 5 కోట్ల ఆస్తిని రాసిచ్చేస్తున్నారు.

నందినితో పాటు ఆమె భర్త నిమేష్ సుచ్‌దేకు కూడా ఇవంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నపుంచి వాటిని తమ సొంత పిల్లల కంటే కూడా ఎక్కువగా చూసుకుంటున్నారు. సాధారణంగా కుక్కలకు తిండి పెట్టే ప్లేట్లు వేరేగా ఉంటాయి. వాటిని చేత్తో పట్టుకోడానికి కూడా చాలా మంది ఇష్టపడరు. కానీ ఈ దంపతులు మాత్రం అవి తిన్న ప్లేట్లలో ఏమైనా మిగిలిపోతే వాటిని తాము కూడా తీసుకుని మరీ తింటారు!! వాటికి వెండి కంచాల్లో తిండి పెడతారు. 1998లో ముంబైకి వచ్చిన నందిని.. గుజరాతీ వ్యాపారవేత్త నిమేష్‌తో ప్రేమలో పడ్డారు. ఇద్దరూ 2002లో పెళ్లి చేసుకున్నారు. అయితే.. పిల్లలు పుడతారని ఆశిస్తే ఆమెకు అబార్షన్ జరగడంతో తీవ్రంగా ఆవేదన చెందారు. తాను ఐవీఎఫ్ చికిత్స తీసుకోవడం మొదలుపెట్టాక ఒకరోజు తన భర్త బడ్డీని ఇంటికి తెచ్చారని, దాంతో.. పిల్లల కోసం ఆరాటపడేకంటే కుక్కపిల్లలను పెంచుకోవడం మంచిదని భావించానని చెప్పారు. ఆ తర్వాత మరో రెండింటిని కూడా ఆయన తీసుకొచ్చారు. అవి మనుషుల కంటే ఎక్కువగా తనను ప్రేమించాయని వివరించారు.

హృద్రోగంతో బాధపడుతున్న నందిని.. తనను పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని భావించేవారు. అందుకే, ఏ నిమిషంలో ఎలా ఉంటామోనని అందరు తల్లిదండ్రుల్లాగే తమ 'పిల్లలు' ఎలాంటి ఇబ్బంది పడకూడదని వాటి భవిష్యత్తు కోసం బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేశారు. కొలాబా, మస్జిద్ బందర్ ప్రాంతాలలో రెండు ఫ్లాట్లు, కోల్‌కతాలో ఒక అపార్ట్‌మెంటు, ఇతర ఆస్తులు అన్నీ కలిపి రూ. 5 కోట్ల విలువైన వాటిని ఆ కుక్కలకు ఇచ్చేశారు. వాస్తవానికి వీళ్లకు మూడు కుక్కలు ఉండేవి. అయితే వాటిలో జూనియర్ అనేది గత డిసెంబర్‌లో చనిపోయింది. అయినా ఈ మూడు కుక్కల పేరుమీద కలిపి ఒక ట్రస్టు ఏర్పాటుచేస్తున్నారు. ఆ ట్రస్టు ఖాతాలో వేసే డబ్బులతో కుక్కల సంక్షేమం చూస్తారు. ఈ రెండింటితో పాటు.. ఎవరూ పట్టించుకోకుండా వదిలేసిన ఇతర కుక్కలనూ సంరక్షిస్తారు. ట్రస్టు ఆధ్వర్యంలో ఒక అంబులెన్సు, మందులు, కుక్కలకు ఉచిత చికిత్స ఏర్పాట్లు చేస్తున్నారు. దంపతులిద్దరూ ఆ ట్రస్టు సొమ్ములోంచి ఒక్క రూపాయి కూడా తీసుకోడానికి వీలుండదు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement