mumbai couple
-
బంధువని నమ్మారు జైలు పాలయ్యారు... చివరికి
ముంబై: ఖతర్‌లో డ్రగ్స్ అక్రమ రవాణా ఆరోపణలపై అరెస్టయిన మహమ్మద్ షరిఖ్, ఒనిబా ఖురేషి దంపతులు ఎట్టకేలకు నిర్దోషులుగా బయటపడ్డారు. 2019లో ఖతర్ న్యాయస్థానం ఈ జంటను దోషిగా తేల్చి పదేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ క్రమంలో షరిఖ్ కుటుంబ సభ్యులు భారత ప్రభుత్వాన్ని ఆశ్రయించారు. భారత ప్రభుత్వాధికారులు ఖతర్ అధికారులతో ఈ దంపతుల విషయంలో అసలేం జరిగిందో వివరించారు. దాంతో గురువారం ఈ దంపతులు ముంబై విమానాశ్రయానికి చేరుకున్నారు. వివరాల ప్రకారం... 2019, జూలై 4న ఖతర్ వెళ్లేందుకు షరిఖ్ దంపతులు బెంగళూరు విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ వారికి తబస్సుం ఖురేషి అనే బంధువు ఓ బ్యాగు ఇచ్చింది. దోహాలో బ్యాగు సంబంధించిన వ్యక్తి వచ్చి తీసుకెళ్తాడని తబస్సుం చెప్పింది. ఆ సమయంలో అందులో ఏముందో అడగకపోవడమే వారి జీవితాన్ని జైలుపాలు చేసింది. దోహాలోని హమద్ విమానాశ్రయానికి చేరుకున్నాక ఎయిర్‌పోర్టులో లగేజీ తనిఖీ చేస్తుండగా షరిఖ్ దంపతుల బ్యాగులో 4.1 కిలోల మాదకద్రవ్యాలు బయటపడ్డాయి. దీంతో ఆ దంపతులను పోలీసులు అరెస్టు చేశారు. విచారణలో వారు ఈ బ్యాగుతో ఎటువంటి సంబంధం లేదని ,తమ బంధువు తబస్సుం ఖురేషి ఇచ్చింది అని చెప్పినా అక్కడి పోలీసులు వినిపించుకోలేదు. చివరికి పోలీసుల చేతిలోంచి డ్రగ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు విచారణ అనంతరం షరిఖ్ దంపతులను దోహా సెంట్రల్ జైలుకు తరలించారు. పరాయి దేశంలో ఆ దంపతులు ఏ తప్పు చేయలేదని నిరూపించుకోలేకపోయారు. దాంతో ఖతర్ న్యాయస్థానం వీరికి పదేళ్ల జైలు శిక్ష విధించింది. శిక్షా సమయంలో ఒనిబా గర్భణి కూడా. ఈ క్రమంలో షరిఖ్ కుటుంబ సభ్యులతో సాయంతో తమకు న్యాయం చేయాలంటూ భారత ప్రభుత్వాన్ని ఆశ్రయించింది. అధికారుల విచారణలో షరిఖ్ అత్త తబస్సుం ఖురేషి మాదకద్రవ్యాలను ఈ జంట బ్యాగులో వారికి తెలియకుండా పెట్టినట్లు తెలిసింది. అంతేగాక ఈ షరిఖ్ దంపతుల ఖతర్ యాత్రను కూడా తబస్సుం స్పాన్సర్ చేసినట్లు అధికారులు తేల్చారు. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారుల అభ్యర్థన మేరకు ఈ ఏడాది ఫిబ్రవరిలో అక్కడి న్యాయస్థానం ఈ దంపతుల అప్పీల్‌ను విచారణకు స్వీకరించింది. విచారణ అనంతరం షరిఖ్ దంపతులను నిర్ధోషులుగా తేల్చిన కోర్టు.. మార్చి 29న వీరిని విడుదల చేయాలని ఆదేశించింది. దీంతో అక్కడి ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుని బుధవారం సాయంత్రం ఈ దంపతులు స్వదేశానికి పయనమయ్యారు. అందుకే అపరిచితులనే కాదు ఒక్కోసారి పరిచయస్తులను కూడా నమ్మరాదని ఈ సంఘటన చెబుతోంది. -
‘ఇదొక అందమైన, అరుదైన అనుభూతి’
ప్రతీ ఒక్కరి జీవితంలో పెళ్లి అనేది ఓ మధుర ఙ్ఞాపకం. అలాంటి వేడుకను రొటీన్‌గా కాకుండా కాస్త ప్రత్యేకంగా చేసుకోవాలని కొందరు కోరుకుంటుంటారు. ముంబైకి చెందిన ప్రబీర్, సయాలీ కొర్రియాలు కూడా ఆ కోవకు చెందిన వారే. అందుకే ‘ఆంగ్రియా’ వేదికగా సముద్రం మధ్యలో వివాహబంధంతో ఒక్కటయ్యారు. ‘ఇదొక అందమైన, అరుదైన అనుభూతి. ఇది నా కల. మొదటిసారిగా క్రూయిజ్‌లో ప్రయాణిస్తున్నా’ అంటూ వధువు సయాలీ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. భర్తతో కలిసి కేక్ కట్‌చేసి తియ్యని వేడుక చేసుకున్నారు. ఆంగ్రియా.. ది క్రూయిజ్! భారత తొలి లగ్జరీ క్రూయిజ్ షిప్ పేరే ఆంగ్రియా. ముంబై నుంచి గోవాల మధ్య ప్రయాణించే ఈ తొలి దేశీయ నౌక వేదికగా.. ‘సముద్రంలో అరుదైన అనుభూతితో ఓ జంట ఒక్కటైంది. ఇలా పెళ్లి వేడుకకు ఆంగ్రియా వేదిక కావడం చాలా సంతోషంగా ఉంది. నౌక కెప్టెన్‌గా నాకు పెళ్లి నిర్వహించే అవకాశం ఉంది’ అంటూ కెప్టెన్ ఇర్విన్ సీక్వెరియా ఆనందం వ్యక్తం చేశారు. పదిహేనేళ్ల కెరీర్లో 60 నౌకలకు కెప్టెన్‌గా వ్యవహరించిన తనకు ఇది కొత్త అనుభూతి అన్నారు. కాగా ఆంగ్రియా ఆరు డెక్‌లు, 104 క్యాబిన్లతో చాలా విశాలంగా ఉంటుంది. ఒకేసారి 399 మంది ప్యాసింజర్లను తీసుకువెళ్లగలదు. వర్షాకాలంలో తప్ప మిగతా అన్ని కాలాల్లో వారానికి నాలుగు సార్లు ఈ నౌక ముంబై- గోవాల మధ్య ప్రయాణిస్తుంది. టికెట్ ధర 7 నుంచి 12 వేల వరకు ఉంటుంది. -
హాయిగా జీవించాం.. ప్రశాంతంగా చనిపోనివ్వండి!
సాక్షి, ముంబయి: తాము ఇంతకాలం ఎంతో ఆనందంగా జీవించామని ఈ చివరిదశలో అనారోగ్యంతో మంచాన పడి, ఆస్పత్రుల చుట్టూ తిరగలేమని చావును ప్రసాదించాలని కోరుతున్నారు ముంబయికి చెందిన వృద్ధ దంపతులు. కారుణ్య మరణానికి అనుమతినివ్వాలని తాము దాఖలు చేసిన పిల్‌పై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సాధ్యమైనంత త్వరగా స్పందించాలని దంపతులు విజ్ఞప్తి చేస్తున్నారు. నారాయణ్ లావాటే (88), ఐరావతి లావాటే (78) దంపతులు దక్షిణ ముంబయి, గ్రాంట్ రోడ్డులోని ఓ చిన్న ఇంట్లో నివాసం ఉంటున్నారు. స్టేట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్‌గా విధులు నిర్వహించిన నారాయణ్ 1989లో రిటైర్ కాగా, ఓ ప్రైవేట్ కాలేజ్ ప్రిన్సిపల్‌గా చేసిన ఐరావతి 1997లో పదవీ విరమణ చేశారు. అప్పటినుంచీ స్థానిక గ్రాంట్ రోడ్డులోని తమ ఇంట్లో హాయిగా జీవనం సాగిస్తున్నారు. అయితే ఇప్పటివరకూ తమకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని, కానీ భవిష్యత్తులో ఎలాంటి కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుందోనని ఆందోళన మొదలైందన్నారు నారాయణ్. ఒకరు లేకుండా మరొకరం బతకలేమని, అదే విధంగా మాలో ఏ ఒక్కరు అనారోగ్యంతో మంచాన పడి కష్టాలు పడుతున్నా చూడటం తమ వల్ల కాదని నారాయణ్ అన్నారు. యాక్టివ్ ఎథనేషియా ద్వారా తమ దంపతులకు కారుణ్య మరణం (మెర్సీ కిల్లింగ్) అవకాశం ఇవ్వాలంటున్నారు. ప్రశాంతంగా బతికేందుకు ఎంత హక్కు ఉందో.. ఎలాంటి ఆంక్షలు లేకుండా చనిపోయేందుకు పౌరులకు అంతే హక్కు ఉండాలన్నారు. ఇప్పటికీ చాలా వృద్ధాప్యంలో ఉన్నామని, ప్రస్తుతం ఇక్కడ మెట్రో రైలు పనులు జరుగుతున్నందున బయటకు వెళ్లడానికి చాలా కష్టంగా ఉందన్నారు ఐరావతి. నా భర్తకు వచ్చే పెన్షన్ మాకు సరిపోతుంది కానీ, కష్టాలు, బాధలతో ప్రాణం వదలడం కంటే సుఖమయంగా లోకాన్ని విడిచిపోవాలని భావిస్తున్నానని పేర్కొన్నారు. ఎన్సీపీ నేతలు శరద్ పవార్, సుప్రియ సూలేలతో పాటుగా రామ్ జెఠ్మలానీ, రాజ్యసభ సభ్యుడు కరణ్ సింగ్, కాంగ్రెస్ నేత అభిషేక్ మను సింగ్వీలకు కారుణ్య మరణానికి సంబంధించిన డ్రాఫ్ట్ ఆఫ్ బిల్‌ను పంపించినట్లు నారాయణ్ దంపతులు వివరించారు. ‘మా బంధువులకు చెబితే అలా చేయవద్దని చెప్పారు... ఎందుకంటే వారికి సంతానం ఉన్నారు, బాధ్యతలున్నాయి. మాకు అలాంటి ఏ సమస్యలు, బాధ్యతలు లేవని’ నారాయణ్ దంపతులు అంటున్నారు. కారణ్య మరణాలు అంటే?.. ఎలా చేస్తారు.. కారుణ్య మరణాలను అమలు చేసేందుకు యాక్టివ్ ఎథనేషియా, పాసివ్ ఎథనేషియా అనే రెండు పద్ధతులు ఉంటాయి. ప్రాణాంతక జబ్బుతో బాధపడుతూ ఇక ఎంతమాత్రం బతకరని తెలిసిన రోగుల విషయంలో కొన్ని దేశాలు యాక్టివ్ ఎథనేషియాను, మరికొన్ని దేశాలు పాసివ్ ఎథనేషియాను అమలు చేస్తున్నాయి. యాక్టివ్ ఎథనేషియా అంటే ప్రాణాలు తీసే ఇంజెక్షన్ ఇవ్వడం ద్వారా మృత్యువును ప్రసాదించడం. పాసివ్ ఎథనేషియా అంటే చికిత్సను ఆపేసి లైఫై సపోర్ట్ వ్యవస్థను తొలగించి రోగి తనంతట తానే చనిపోయేలా చేయడం. యాక్టివ్ ఎథనేషియాను దుర్వినియోగం చేసే అవకాశం ఉండడంతో పాసివ్ ఎథనేషియాకే కేంద్రం మొగ్గు చూపుతున్న విషయం విదితమే. -
కుటుంబం ఆత్మహత్య, మూడు సూసైడ్ నోట్స్
ముంబై: ముంబైలో ఓ డాక్టర్ కుటుంబంతో సహా ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. స్థానికంగా ఓ క్లినిక్ నిర్వహించే ఎంబీబీఎస్ డాక్టర్ జాస్మిన్పటేల్(45) ఇంద్రజిత్ దత్త, కుమార్తె ఓసిన్(15) ఉరివేసుకుని ఉసురుతీసుకున్నారు. ఆదివారం ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులను మూడు వేరువేరు సూసైడ్ లేఖలను గుర్తించారు. దీంతో హత్య కోణాన్ని పోలీసులు కొట్టి పారేసినప్పటికీ, సంఘటనా స్థలంలో మూడు సూసైడ్ నోట్స్ లభ్యం కావడంపై ఆరా తీస్తున్నారు. తీవ్ర అనారోగ్యం కారణంగా తనువు చాలిస్తున్నట్టుగా డాక్టర్ జాస్మిన్ తన లేఖలో పేర్కొన్నారు. అయితే తన కుమార్తెను ఒంటరిగా వదిలి వెళ్లడం ఇష్టం లేదని రాశారు. అలాగే తమ శరీరాలను కెమ్ హాస్పిటల్ లోని వైద్య విద్యార్థులకోసం దానం చేయాల్సిందిగా రాశారు. ఈ దంపతుల ఎడతెగని గొడవలతో తాను విసిగిపోయినట్టు ఓసిన్ తన లేఖలో తెలిపింది. ఈ కారణంగానే తాను చదువును మధ్యలోనే విడిచిపెట్టాల్సి వచ్చిందనీ, దీంతో తీవ్రమైన మానసిక ఒత్తిడికి, అసహనానికి గురైనట్టు తెలిపింది. అయితే భార్య, కూతురు చనిపోవడంతో తానూ ఆత్మహత్యకు పాల్పడుతున్నట్టుగా లేఖరాసిన దత్తూ తాను ఉరివేసుకున్నారు. అంతేకాదు తమ ఇంటి తాళాన్ని ఒక ప్లాస్టిక్ కవర్ లో చుట్టి ఇంటిగుమ్మం ముందు పడేశారు. పొద్దున్నే పనిమనిషి వచ్చి చూడటంతో విషయం వెలుగు చూసింది. వీరిని మధ్యప్రదేశ్ కు చెందినవారిగా భావిస్తున్న పోలీసులు బంధువుల ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నారు. మరోవైపు ఈ దంపతులు పెద్దగా ఎవరితోనే మాట్లాడేవారుకాదనీ, కేవలం పాలు, కూరగాయలు లాంటి నిత్యావసరాలకోసం మాత్రమే బయటికి వచ్చేవారని చుట్టపక్కల వారు చెబుతున్నారు. కనీసం నడవలేని స్థితిలో విపరీతమైన నడుం నొప్పితో డాక్టర్ జలీల్ బాధపడుతున్నట్టు పోలీసు ఉన్నతాధికారి అశోక్ నాయక్ తెలిపారు. ఇంట్లో వాకింగ్ స్టిక్‌ను కూడా స్వాధీనం చేసకున్నట్టు చెప్పారు. అలాగే చేతిరాతల నిపుణుల ద్వారా వీరి ఆత్మహత్యల లేఖలను పరిశీలించనున్నట్టు చెప్పారు. ముగ్గురు నైలాన్తాళ్లతో ఉరివేసుకున్నారని ముంబై పోలీసు కమిషనర్ హేమంత్ నాగ్రేల్ వెల్లడించారు. మద్యంమత్తులో ఉన్న దత్తా, భార్యా బిడ్డల ఆత్మహత్య గమనించిన అనంతరం తాను కూడాసూసైడ్ చేసుకున్నాడని కామోథీ పోలీస్ స్టేషన్ సీనియర్ పోలీసు అశోక్ నాయక్ చెప్పారు. అయితే దత్తా సూసైడ్ నోట్ లో ఓసిల్ తన కూతురు లాంటిదని పేర్కొనడంపై పోలీసులు అనుమానాలు వ్యక్తం చేశారు. బహుశా ఆ యువతి అతని కూతురు కాకపోయి వుండవచ్చని భావిస్తున్నారు. -
కుక్కలకు రూ. 5 కోట్ల ఆస్తి ఇచ్చేశారు!
ఎవరైనా వాటిని 'కుక్కలు' అని పిలిస్తే చాలు.. ఆమెకు ఎక్కడలేని కోపం వచ్చేస్తుంది. అవి మా బిడ్డలని చెబుతారు ముంబైకి చెందిన నందినీ సుచ్దే (52). వాటిపేర్లు బడ్డీ, టైనీ. మామూలుగా అయితే కుక్కలను గొలుసులతో కట్టేస్తారు.. కానీ గోల్డెన్ రిట్రీవర్ జాతికి చెందిన ఈ శునకాలకు వాటి పేర్లకు తగ్గట్లే మెడలో బంగారు గొలుసులు ఉంటాయి. అంతేకాదు.. త్వరలోనే ఇవి ముంబై నగరంలో, ఇంకా మాట్లాడితే దేశంలోనే అత్యంత ధనవంతులైన శునకాలు అవుతాయి. ఎందుకంటే, ఆ దంపతులు వీటినే తమ వారసులుగా ప్రకటించి వాటికి రూ. 5 కోట్ల ఆస్తిని రాసిచ్చేస్తున్నారు. నందినితో పాటు ఆమె భర్త నిమేష్ సుచ్దేకు కూడా ఇవంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నపుంచి వాటిని తమ సొంత పిల్లల కంటే కూడా ఎక్కువగా చూసుకుంటున్నారు. సాధారణంగా కుక్కలకు తిండి పెట్టే ప్లేట్లు వేరేగా ఉంటాయి. వాటిని చేత్తో పట్టుకోడానికి కూడా చాలా మంది ఇష్టపడరు. కానీ ఈ దంపతులు మాత్రం అవి తిన్న ప్లేట్లలో ఏమైనా మిగిలిపోతే వాటిని తాము కూడా తీసుకుని మరీ తింటారు!! వాటికి వెండి కంచాల్లో తిండి పెడతారు. 1998లో ముంబైకి వచ్చిన నందిని.. గుజరాతీ వ్యాపారవేత్త నిమేష్తో ప్రేమలో పడ్డారు. ఇద్దరూ 2002లో పెళ్లి చేసుకున్నారు. అయితే.. పిల్లలు పుడతారని ఆశిస్తే ఆమెకు అబార్షన్ జరగడంతో తీవ్రంగా ఆవేదన చెందారు. తాను ఐవీఎఫ్ చికిత్స తీసుకోవడం మొదలుపెట్టాక ఒకరోజు తన భర్త బడ్డీని ఇంటికి తెచ్చారని, దాంతో.. పిల్లల కోసం ఆరాటపడేకంటే కుక్కపిల్లలను పెంచుకోవడం మంచిదని భావించానని చెప్పారు. ఆ తర్వాత మరో రెండింటిని కూడా ఆయన తీసుకొచ్చారు. అవి మనుషుల కంటే ఎక్కువగా తనను ప్రేమించాయని వివరించారు. హృద్రోగంతో బాధపడుతున్న నందిని.. తనను పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని భావించేవారు. అందుకే, ఏ నిమిషంలో ఎలా ఉంటామోనని అందరు తల్లిదండ్రుల్లాగే తమ 'పిల్లలు' ఎలాంటి ఇబ్బంది పడకూడదని వాటి భవిష్యత్తు కోసం బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేశారు. కొలాబా, మస్జిద్ బందర్ ప్రాంతాలలో రెండు ఫ్లాట్లు, కోల్‌కతాలో ఒక అపార్ట్మెంటు, ఇతర ఆస్తులు అన్నీ కలిపి రూ. 5 కోట్ల విలువైన వాటిని ఆ కుక్కలకు ఇచ్చేశారు. వాస్తవానికి వీళ్లకు మూడు కుక్కలు ఉండేవి. అయితే వాటిలో జూనియర్ అనేది గత డిసెంబర్లో చనిపోయింది. అయినా ఈ మూడు కుక్కల పేరుమీద కలిపి ఒక ట్రస్టు ఏర్పాటుచేస్తున్నారు. ఆ ట్రస్టు ఖాతాలో వేసే డబ్బులతో కుక్కల సంక్షేమం చూస్తారు. ఈ రెండింటితో పాటు.. ఎవరూ పట్టించుకోకుండా వదిలేసిన ఇతర కుక్కలనూ సంరక్షిస్తారు. ట్రస్టు ఆధ్వర్యంలో ఒక అంబులెన్సు, మందులు, కుక్కలకు ఉచిత చికిత్స ఏర్పాట్లు చేస్తున్నారు. దంపతులిద్దరూ ఆ ట్రస్టు సొమ్ములోంచి ఒక్క రూపాయి కూడా తీసుకోడానికి వీలుండదు.