మన స్టాక్స్... అండర్‌వెయిట్ | Goldman Sachs still ‘underweight’ on Indian shares | Sakshi
Sakshi News home page

మన స్టాక్స్... అండర్‌వెయిట్

Published Thu, Sep 19 2013 3:42 AM | Last Updated on Fri, Sep 1 2017 10:50 PM

Goldman Sachs still ‘underweight’ on Indian shares

న్యూఢిల్లీ: ప్రస్తుతం స్టాక్ మార్కెట్లు లాభాల బాటలో సాగుతున్నప్పటికీ గోల్డ్‌మన్ శాక్స్ మాత్రం ఈక్విటీలకు అండర్‌వెయిట్ రేటింగ్‌ను ఇచ్చింది. వెరసి రానున్న ఏడాది కాలంలో నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ ప్రధాన సూచీ ‘నిఫ్టీ’ లక్ష్యాన్ని 5,700 పాయింట్లుగా పేర్కొంది. ప్రస్తుతం నిఫ్టీ 5,900 స్థాయిలో కదులుతున్న సంగతి తెలిసిందే. మరోవైపు స్టాక్ మార్కెట్ల ప్రామాణిక సూచీ సెన్సెక్స్ 20,000 పాయింట్ల సమీపానికి చేరినప్పటికీ ఇండియా స్థూల ఆర్థిక పరిస్థితులు సంక్లిష్టంగా ఉన్నాయంటూ అంతర్జాతీయ ఫైనాన్షియల్ సర్వీసుల దిగ్గజం గోల్డ్‌మన్ వ్యాఖ్యానించింది. ఆర్థిక వ్యవస్థ పలు సవాళ్లను ఎదుర్కొంటున్నదని, కఠిన ఆర్థిక విధానాల కారణంగా ఈక్విటీల రేటింగ్‌ను తగ్గించామని వివరించింది. కాగా, జూలై చివర్లోనూ దేశీయ ఈక్విటీలకు అండర్‌వెయిట్ రేటింగ్‌ను ప్రకటించింది. దేశీయ వృద్ధి అవకాశాలు బలహీనంగా ఉన్నాయంటూ గోల్డ్‌మన్ అప్పట్లో పేర్కొంది. అప్పటినుంచీ పరిస్థితుల్లో పెద్దగా మార్పులేవీ రాలేదంటూ తాజాగా వివరణ ఇచ్చింది. ఈ ఆర్థిక సంవత్సరంలో కంపెనీల ఆర్జన గతేడాదితో పోలిస్తే 5% పాయింట్లు తక్కువగా 8% వృద్ధికి పరిమితం కావచ్చునని అంచనా వేసింది. 
 
 ర్యాలీ నిలబడదు
 రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురామ్ రాజన్ చర్యల నేపథ్యంలో మార్కెట్లలో ర్యాలీ వచ్చినప్పటికీ మూలాలు పటిష్టంగా లేనందున మళ్లీ బలహీనపడే అవకాశముందని పేర్కొంది. అధిక వడ్డీ రేట్ల నేపథ్యంలో పెట్టుబడులు క్షీణించడం, పెరుగుతున్న ఇంధన ధరలు, ఉద్యోగ అవకాశాలు తగ్గడంతో వినియోగ డిమాండ్ నెమ్మదించడం వంటి సమస్యలు కొనసాగుతాయని భావిస్తున్నట్లు తెలిపింది. సమీప కాలానికి టోకు ధరల ద్రవ్యోల్బణం 7%కు పెరుగుతుందని, దీంతో రిజర్వ్ బ్యాంక్ కఠిన పరపతి విధానాలను కొనసాగిస్తుందని గోల్డ్‌మన్ శాక్స్ ఆర్థికవేత్తలు అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా కొద్ది నెలల్లో కీలకమైన కొన్ని రాష్ట్రాల అసెంబ్లీలతోపాటు, పార్లమెంట్‌కు సైతం సార్వత్రిక ఎన్నికలు జరగనుండటంతో రాజకీయ అనిశ్చితికి తెరలేవనుందని తెలిపింది. ఈ పరిస్థితులు విధాన నిర్ణయాలను ఆటంకపరుస్తాయని వ్యాఖ్యానించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement