రాష్ట్ర విభజనపై రేపు జీవోఎం భేటి!
రాష్ట్ర విభజనపై విధివిధానాలపై దృష్టి సారించేందుకు గ్రూప్ ఆఫ్ మినిస్టర్ (జీవోఎం) శనివారం సాయంత్రం నాలుగు గంటలకు
సమావేశమవ్వనుంది. ఈ సమావేశంలో నదీ జలాలు, విద్యుత్, ఆస్తుల పంపిణీ, సరిహద్దు లాంటి అంశాలపై చర్చించే అవకాశం ఉంది.
రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఎలాంటి వివాదాలు తలెత్తకుండా పది సంవత్సరాల పాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉండటానికి అవసరమయ్యే న్యాయపరమైన, పాలనపరమైన అంశాలపై చర్చించనున్నట్టు తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో సందేహాలు తలెత్తకుండా.. కమిటీ నిజాయితీతో సమస్యలను పరిష్కరిస్తుందని అక్టోబర్ 11న సమావేశమైన జీవోఎం తెలిపింది. తొలి సమావేశానికి ఆర్ధిక మంత్రి చిదంబరం, రక్షణ మంత్రి ఏకే ఆంటోని గైర్హాజరయ్యారు.
తెలంగాణ ఏర్పాటుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల స్థాయిలో తీర్మానం కోసం, ఇతర సమస్యల పరిష్కారం కోసం కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే నేతృత్వంలో జీవోఎంను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.