పార్లమెంటరీ వ్యవహరాల శాఖ మంత్రి కమల్ నాథ్
సీఎం కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా చేసిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ నరసింహన్ పంపిన నివేదిక ఇంకా తమకు అందలేదని పార్లమెంట్ వ్యవహరాల శాఖ మంత్రి కమల్నాథ్ వెల్లడించారు. గురువారం ఉదయం హస్తినలో సమావేశమైన కేంద్ర కేబినెట్ భేటీ ముగిసిన తర్వాత కమల్నాథ్ విలేకర్లతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి పాలన, కొత్త ముఖ్యమంత్రి అంశంపై కేబినెట్ సమావేశంలో చర్చజరగలేదని తెలిపారు. అలాగే తెలంగాణపై కూడా చర్చించలేదన్నారు. అయితే లోక్సభలో ఆమోదం పొందిన ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవవస్థీకరణ బిల్లుపై ఈ రోజు మధ్యాహ్నం 3.00గంటలకు రాజ్యసభలో చర్చించనున్నట్లు చెప్పారు.
లోక్సభలో మంగళవారం ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవవస్థీకరణ బిల్లు ఆమోదం పొందటంతో బుధవారం రాజ్యసభలో ప్రవేశపెట్టారు.అయితే ఆ బిల్లులో పలు సవరణలు చేయాలని బీజేపీ తీవ్రంగా పట్టుబట్టింది. దీంతోపాటు సీమాంధ్రకు చెందిన పలువురు ఎంపీలు రాజ్యసభలో ఆందోళనల చేపట్టారు. ఆ నేపథ్యంలో సభ పలుసార్లు వాయిదా పడింది. దాంతో బిల్లులో సవరణలపై చర్చించి ప్రస్తుత ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరిస్థితిపై నిర్ణయం తీసుకోవాలని కేంద్రం యోచించింది. దాంతో ఈ రోజు ఉదయం కేబినెట్ భేటీ అయింది.
అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ అధిష్టానం అడ్డగోలుగా ముందుకు వెళ్లి లోక్సభలో బిల్లు ఆమోదింప చేసింది. అందుకు నిరనసగా కిరణ్ కుమార్ రెడ్డి తన సీఎం పదవితోపాటు కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి బుధవారం రాజీనామా చేశారు. అనంతరం ఆయన గవర్నర్ ఈఎస్ఎల్ నర్శింహన్ను కలసి తన రాజీనామా లేఖను కిరణ్ సమర్పించారు.
ముఖ్యమంత్రి రాజీనామా, రాష్ట్రంలో పరిస్థితులపై గవర్నర్ కేంద్రానికి నివేదిక పంపారు. ఈ నేపథ్యంలో కమల్నాథ్పై విధంగా స్పందించారు. అయితే లోక్సభతోపాటు ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ తరుణంలో ఆంధ్రప్రదేశ్లో కొత్త ముఖ్యమంత్రిని నియమించాలా లేక రాష్ట్రపతి పాలన పెట్టాలా అని కేంద్రం ఆలోచనలో చేస్తుంది.