జకీర్ నాయక్ కు కేంద్రం షాక్
న్యూఢిల్లీ: ఇస్లామిక్ రిసెర్చ్ ఫౌండేషన్(ఐఆర్ఎఫ్) వ్యవస్ధాపకుడు జకీర్ నాయక్ కు కేంద్ర ప్రభుత్వం మంగళవారం షాక్ ఇచ్చింది. ఐదేళ్ల పాటు ఐఆర్ఎఫ్ పై నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ జారీ చేసిన ఉత్తర్వులు వెంటనే అమల్లోకి రానున్నాయి. ఐఆర్ఎఫ్ చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు కేంద్ర కేబినేట్ నిర్ధారించింది.
కాగా, జకీర్ నాయక్ స్పీచ్ లపై ప్రభుత్వం గతంలో వ్యతిరేకత వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. పీస్ టీవీతో జకీర్ ఉన్న సంబంధాలు, ముంబైలో ఉన్న ఐఆర్ఎఫ్ లో పనిచేసే వ్యక్తులపై ఉన్న కేసులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మహారాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ఇంటిలిజెన్స్ వర్గాలు ఇచ్చిన సమాచారం మేరకే కేబినేట్ ఐఆర్ఎఫ్ పై నిషేధం విధించిందని సమాచారం.
గతంలో ఒసామా బిన్ లాడన్ ను పొగుడుతూ జకీర్ నాయక్ చేసిన వ్యాఖ్యలను కూడా ఐబీ ఆయనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ లో జోడించినట్లు తెలిసింది. నాయక్ పై టెర్రరిజానికి సంబంధించిన కేసులు కూడా నమోదు చేసే అవకాశాలపై ఎన్ఐఏ పరిశీలిస్తోంది.