న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. ప్రభుత్వం సెప్టెంబర్‌లో కరువు భత్యాన్ని (డీఏ) ప్రస్తుతమున్న 80 శాతం నుంచి 90 శాతానికి పెంచే అవకాశం ఉంది. ఈ ఏడాది జూలై 1 నుంచి దీన్ని వర్తింపజేయనుంది. దీనివల్ల సుమారు 50 లక్షల మంది కేంద్ర ఉద్యోగులు, 30 లక్షల మంది పెన్షనర్లకు లబ్ధి చేకూరనుంది. డీఏ పెంపు 10-11 శాతం మధ్య ఉండొచ్చని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ప్రభుత్వం ఈ ఏడాది ఏప్రిల్‌లో డీఏను 72 శాతం నుంచి 80 శాతానికి పెంచింది. దీన్ని ఈ ఏడాది జనవరి 1 నుంచి వర్తింపజేసింది. 2010 సెప్టెంబర్‌లో చివరిసారిగా డీఏ 10 శాతం పెరిగింది. మరోవైపు డీఏను 90 శాతానికి పెంచడంతోపాటు అందులో 50 శాతాన్ని మూలవేతనంలో కలపాలని కేంద్ర ప్రభుత్వోద్యోగుల సమాఖ్య సెక్రటరీ జనరల్ కె.కె.ఎన్. కుట్టీ డిమాండ్ చేశారు. డీఏను మూల వేతనంలో కలపడం వల్ల దాని నిష్పత్తిలో ఉండే ఇతర అలవెన్సులు ఉద్యోగులకు లబ్ధి చేకూరుస్తాయన్నారు. 2011 జనవరి 1 నుంచి జీవన వ్యయం వాస్తవ పెరుగుదల 171 శాతంగా ఉండటం వల్ల ప్రతిపాదిత డీఏ పెంపు వల్ల ఉద్యోగులకు పెద్దగా ఉపయోగం ఉండదన్నారు.
కేంద్ర ఉద్యోగులకు త్వరలో 10 % డీఏ పెంపు!
Published Mon, Aug 5 2013 2:45 AM | Last Updated on Mon, Aug 20 2018 9:16 PM
Advertisement