పాత నోట్ల డిపాజిట్లు: కేంద్రం కీలక ప్రకటన
పాత నోట్ల డిపాజిట్లు: కేంద్రం కీలక ప్రకటన
Published Tue, Nov 29 2016 6:22 PM | Last Updated on Mon, Sep 4 2017 9:27 PM
న్యూఢిల్లీ : రద్దైన పాత నోట్ల చెల్లుబాటు విషయంలో ప్రజల అవసరాలకు అనుగుణంగా పలుసార్లు, పలుచోట్ల చెల్లుబాటు గడువులను పొడిగించిన కేంద్రం, డిపాజిట్ల విషయంలో అసలు తగ్గేది లేదని ప్రకటించింది. రద్దైన పాత నోట్లను డిపాజిట్ చేసుకునేందుకు ముందుగా ప్రభుత్వం నిర్ణయించిన డిసెంబర్ 30వ తేదీనే ఆఖరని, ఈ తేదీని ఎట్టిపరిస్థితుల్లో పొడిగించేది లేదని నేడు ప్రభుత్వం రాజ్యసభకు తెలిపింది. ఆర్బీఐ, బ్యాంకుల వద్ద సరిపడ నగదు ఉందని వెల్లడించింది. రద్దైన పెద్ద నోట్లను డిపాజిట్ చేయడానికి, కొత్త నగదును విత్ డ్రా చేసుకోవడానికి బ్యాంకుల వద్ద భారీ క్యూలైన్లు నెలకొన్న సంగతి తెలిసిందే. అయినప్పటికీ ప్రభుత్వం పాత నోట్ల డిపాజిట్ల తుదిగడువును మార్చేది లేదని పేర్కొంది.
బ్యాంకుల వద్ద సరిపడ నగదుతో పాటు, రూ.100 నోట్ల చలామణిని కూడా పెంచినట్టు కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేగ్వాల్ తెలిపారు. డిసెంబర్ 30వ తేదీని పొడిగించే ఉద్దేశ్యమేమన్న ఉందా అనే ప్రశ్నకు, అలాంటి ప్రతిపాదన ఏమీ లేదని వెల్లడించారు. గ్రామీణ ప్రజల అవసరార్థం రూ.100, అంతకంటే తక్కువ విలువ కలిగిన నోట్లను బ్యాంకులు సరఫరా చేయాలని ఆదేశించినట్టు పేర్కొన్నారు. కాగ, పాత నోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రకటించిన ప్రధాని, డిసెంబర్ 30వరకు పాత రూ.500, రూ.1000 నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకోవచ్చని వెల్లడించారు.
Advertisement