మార్చి నుంచి ఉచిత సెల్ ఫోన్లు, ట్యాబ్‌లు!
లోక్‌సభ ఎన్నికలు దగ్గరపడుతున్న తరుణంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం.. గ్రామీణులకు ఉచిత మొబైల్ ఫోన్లు, విద్యార్థులకు ఉచిత ట్యాబ్లెట్ కంప్యూటర్ల పథకాన్ని వేగంగా ముందుకు తెస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లోని కుటుంబాలకు ఉచిత సెల్ ఫోన్లు, ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు ఉచిత ట్యాబ్లెట్ కంప్యూటర్లు ఇవ్వాలన్న ప్రతిపాదనకు టెలికం కమిషన్ మంగళవారం విస్తృత ఆమోదం తెలిపింది.
మొత్తం రూ. 10 వేల కోట్ల వ్యయం కాగల ఈ పథకాన్ని వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు కొంచెం ముందుగా మార్చి నుంచి అమలులోకి తేవాలని కేంద్రం యోచిస్తున్నట్లు సమాచారం. ఈ పథకం ప్రతిపాదనపై టెలికమ్యూనికేషన్స్ విభాగంలో అత్యున్నత నిర్ణాయక సంస్థ అయిన టెలికం కమిషన్ చర్చించిందని, ఇందులోని చాలా అంశాలకు ఆమోదం తెలిపిందని ఆ శాఖ వర్గాలు వెల్లడించాయి.
దీనికి సంబంధించి మరికొన్ని అంశాలపై త్వరలోనే చర్చిస్తామని.. ఆ తర్వాత ఈ ప్రతిపాదనను తుది ఆమోదం కోసం కేంద్ర మంత్రివర్గానికి పంపిస్తామన్నాయి. ఈ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని రెండున్నర కోట్ల కుటుంబాలకు, ప్రభుత్వ పాఠశాలల్లో 11, 12 తరగతులు చదువుతున్న 90 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుందని వివరించాయి. బీఎస్‌ఎన్‌ఎల్ ద్వారా ఈ పథకాన్ని అమలు చేస్తారు.
ఉచిత మొబైల్ ఫోన్ల పథకాన్ని ప్రధానంగా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కార్మికుల కోసం ఉద్దేశించారు. ఈ పథకానికి రూ. 4,840 కోట్లు వ్యయం అవుతుందని అంచనా. ఈ పథకాన్ని 2014 మార్చి తర్వాత అమలులోకి తెచ్చి ఆరేళ్లలో పూర్తిచేస్తారు. తొలి ఏడాది 25 లక్షల మంది లబ్ధిదారులు, రెండో ఏడాది 50 లక్షల మంది, మూడో ఏడాది 75 లక్షల మంది, నాలుగో ఏడాది కోటి మంది లబ్ధిదారులకు వీటిని పంపిణీ చేస్తారు.