చీప్ లిక్కర్ కాదు.. చౌక మద్యం | government war on gudumba says padma rao | Sakshi
Sakshi News home page

చీప్ లిక్కర్ కాదు.. చౌక మద్యం

Published Tue, Aug 25 2015 1:15 AM | Last Updated on Sun, Sep 3 2017 8:03 AM

చీప్ లిక్కర్ కాదు.. చౌక మద్యం

చీప్ లిక్కర్ కాదు.. చౌక మద్యం

సాక్షి, హైదరాబాద్: ‘‘గుడుంబా మహమ్మారి నుంచి ప్రజల ప్రాణాలను రక్షించేందుకే తెలంగాణ ప్రభుత్వం తక్కువ ధరకు మద్యాన్ని అందించే ఏర్పాటు చేస్తోంది. అంతేగానీ గుడుంబాకు ప్రత్యామ్నాయంగా ఎలాంటి చీప్ లిక్కర్‌ను పంపిణీ చేయడం లేదు’’ అని ఎక్సైజ్ శాఖ మంత్రి టి.పద్మారావు గౌడ్  స్పష్టం చేశారు. ప్రభుత్వం తీసుకు రానున్న నూతన మద్యం పాలసీపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో... మంత్రి సోమవారం సచివాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మద్యం పాలసీలో తాము తీసుకురాబోతున్న విధి విధానాలను వివరించారు.

రాజకీయంగా మనుగడ ప్రశ్నార్థకం కావడంతో  కొన్ని విపక్షాలు, తాము ఇంకా ప్రకటించని మద్యం పాలసీపై లేనిపోని రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు. నూతన మద్యం పాలసీని రెండు, మూడు రోజుల్లో ప్రకటిస్తామని, అందులో ప్రజలకు హానీ కలిగించే అంశాలేమైనా ఉంటే నిలదీసే అధికారం ఎవరికైనా ఉంటుందని చెప్పారు. ప్రభుత్వం మద్యం తాగాలని ప్రోత్సహించదని, గుడుంబా తాగి ప్రాణాలు తీసుకోకుండా ప్రజలను రక్షించేందుకే ఈ చర్యలు చేపట్టిందన్నారు. అక్టోబరు 1 నుంచి నూతన మద్యం పాలసీ అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు.
 
అన్నింట్లోనూ అదే ఆల్కహాల్
గుడుంబాను అరికట్టేందుకు ప్రభుత్వం కొత్తగా సారాయి దుకాణాలు ప్రారంభించ నుందని, కిరాణా షాపుల్లో కూడా మద్యం అమ్మకాలు చేపట్టనుందని విపక్షాలు అసత్య ఆరోపణలు చేస్తున్నాయని మంత్రి దుయ్యబట్టారు. ప్రభుత్వం సారాయి గానీ, ఆపిల్‌జ్యూస్‌ను గానీ ప్రజలకు అందించడం లేదని, గతంలో ఉన్న మద్యం సీసాలనే తక్కువ ధరకు పంపిణీ చేస్తుందన్నారు. రూ.వెయ్యి ఖరీదున్న మద్యంలో ఎంత శాతం ఆల్కహాల్ ఉంటుందో, రూ.15కు అందించే మద్యం లోనూ అంతే శాతం (42.5) ఆల్కహాల్ ఉంటుందన్నారు.

మండలం యూనిట్‌గా ప్రతి మండలంలో మూడు గ్రామాల్లో ఔట్‌లెట్లు (వైన్ షాపులు) ఉండేలా కొత్త విధానం తీసుకొస్తామన్నారు. మద్యం తాగకుండా ఉండలేని వారు.. కాస్త దూరం వెళ్లి అయినా నాణ్యమైన మద్యం తెచ్చుకుంటారని వ్యాఖ్యానించారు. గుడుంబాను అరికట్టేందుకు డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ స్థాయి అధికారి నేతృత్వంలో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నారు.

నూతన మద్యం పాలసీతో కల్లుగీత కార్మికులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నారు. దశల వారీగా మద్యం విక్రయాలను నియంత్రిస్తామని, మద్యంతో జరిగే నష్టాలపై ప్రజలను చైతన్యపరిచేందుకు ప్రభుత్వం డాక్యుమెంటరీని రూపొందించిందని పేర్కొన్నారు. సాంస్కృతిక సారధి నేతృత్వంలో కూడా కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు.
 
ఆదాయం కోల్పోతున్నాం
రాష్ట్రంలో గుడుంబాను సంపూర్ణంగా అరికట్టాలన్నది ప్రభుత్వ ధ్యేయమని పద్మారావు చెప్పారు. రూ.10తో గుడుంబా సేవిం చి అమాయకులు బలవుతున్నందున వారికి అందుబాటులో ఉండేలా సురక్షితమైన మద్యాన్ని రూ.15కే అందించాలని నిర్ణయిం చామన్నారు. సేల్స్‌ట్యాక్స్, వ్యాట్, ఎక్సైజ్ డ్యూటీ.. ఇలా వివిధ రూపాల్లో ఒక కేసు మద్యానికి రూ.1,840 ఆదాయం ప్రభుత్వానికి వస్తుందని, అయితే మద్యం తక్కువ ధరకు అందించాలనే ఉద్దేశంతో.. పన్నులను రూ.730కి  ప్రభుత్వం తగ్గించుకుందన్నారు.

ప్రస్తుతం రాష్ట్రంలో నెలకు 1.50 లక్షల కేసు ల విక్రయం జరుగుతోందని, పన్నులను తగ్గించడం ద్వారా ఆదాయాన్ని కోల్పోతామన్నారు. ప్రస్తుతం దుకాణాల్లో 180 మిల్లీలీటర్ల మద్యం ధర రూ.70 ఉండగా దాని ధరను రూ.30కు, 90 మిల్లీలీటర్ల మద్యం ధరను రూ.40 నుంచి రూ.15కు త గ్గిస్తున్నామని చెప్పారు. ఈ కొత్త విధానం గ్రామీణ ప్రాంతాలకు మాత్రమే పరిమితమని, పట్టణ, నగర ప్రాంతాల్లో మద్యం ధరల్లో ఎలాంటి మార్పులు ఉండబోవన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement