'ఢిల్లీ రావడానికి సంచలనం ఏమీ లేదు'
న్యూఢిల్లీ: తన ఢిల్లీ పర్యటన సాధారణ పర్యటన మాత్రమేనని గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ అన్నారు. తాను ఢిల్లీ రావడం వెనుక సంచలనం ఏమీ లేదని చెప్పారు. రాష్ట్ర విభజన జరిగి ఏడాది పూర్తైన సందర్భంగా ఇక్కడికి వచ్చినట్టు తెలిపారు. కేంద్ర హోంశాఖ కార్యదర్శి ఎల్సీ గోయల్ తో సమావేశం ముగిసిన తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడారు.
విభజన చట్టంలోని సెక్షన్ 8 గురించి కేంద్రం తనను అడగలేదని తెలిపారు. విభజన అంశాలను మాత్రమే కేంద్రానికి నివేదించినట్టు చెప్పారు. టీడీపీ ఓటుకు నోటు వ్యవహారంపై స్పందించేందుకు గవర్నర్ నిరాకరించారు. ఫోన్ టాపింగ్ ఆరోపణలపై కేంద్రానికి ఎలాంటి నివేదిక ఇవ్వలేదని స్పష్టం చేశారు. విలేకరులు అడిగిన చాలా ప్రశ్నలకు 'నో కామెంట్' అంటూ గవర్నర్ సమాధానమిచ్చారు.