మార్కెట్ రెగ్యులేటరీకి కొత్త బాస్
న్యూఢిల్లీ : మార్కెట్ రెగ్యులేటరీ సెబీకి కొత్త బాస్ వచ్చేశారు. సీనియర్ ఆర్థికమంత్రిత్వ శాఖ అధికారి అజయ్ త్యాగిని సెక్యురిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డు ఆఫ్ ఇండియా(సెబీ) చైర్మన్గా నియమిస్తున్నట్టు ప్రభుత్వం పేర్కొంది. ఆయన ఐదేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. ప్రస్తుత చీఫ్ యూకే సిన్హా స్థానంలో ఆయన పదవిలోకి వస్తున్నారు. యూకే సిన్హా పొడిగింపు కాలం 2017 మార్చి 1తో ముగియనున్న నేపథ్యంలో కొత్త చీఫ్ను నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. హిమాచల్ ప్రదేశ్ కేడర్కు చెందిన త్యాగి 1984 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్. ప్రస్తుతం ఆర్థికవ్యవహారాల విభాగానికి అదనపు కార్యదర్శిగా ఉన్నారు.
క్యాపిటల్ మార్కెట్లు, ఇతర వాటిని హ్యాండిల్ చేస్తున్నారు. 2014 నుంచి క్యాపిటల్ మార్కెట్ డివిజన్ను ఆయన పర్యవేక్షిస్తున్నారు. మార్కెట్ రెగ్యులేటరీకి చైర్మన్గా త్యాగిని నియమిస్తున్నట్టు అధికారిక ఆదేశాలు తెలిపాయి. ప్రస్తుతం సెబీ చీఫ్‌గా ఉన్న యూకే సిన్హా బీహార్ కేడర్కు చెందిన రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్. ఆయన్ని 2011 ఫిబ్రవరిలో సెబీ చీఫ్గా ప్రభుత్వం మూడేళ్ల కాలానికి నియమించింది. అనంతరం ఆయన పదవీకాలాన్ని మరో రెండేళ్లకు పొడిగించింది. గతేడాది ఫిబ్రవరి ఆయన పదవి కాలం పూర్తవుతుందనగా.. మరోసారి సిన్హా పదవికాలాన్ని 2017 మార్చి 1 వరకు ప్రభుత్వం పొడిగించింది.