
కొత్త నోట్లతో భారీగా లంచం.. పోలీసులు షాక్!
తళతళ మెరిసిపోతున్న కొత్త రెండువేల రూపాయల నోట్లు బయటకు వచ్చి సరిగ్గా వారంరోజులు కాలేదు. అప్పుడే లంచగొండి అధికారులు కొత్తనోట్లతో తమ చేతివాటం మొదలుపెట్టారు. తమ అవినీతికి కొత్తనోట్లు అడ్డుకాదంటూ చాటారు. సాక్షాత్తూ ప్రధాని మోదీ సొంతం రాష్ట్రం గుజరాత్‌లో ప్రభుత్వ అధికారులు కొత్తరెండువేల నోట్ల రూపంలో నాలుగు లక్షలు లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయారు. ప్రజలు వెయ్యి, రెండువేలు పొందడానికే బ్యాంకుల ముందు నానా అవస్థలు పడుతున్న తరుణంలో ఏకంగా రూ. 4 లక్షల కొత్తరెండువేల నోట్లు వెలుగుచూడటం పోలీసులనే షాక్‌కు గురిచేసింది.
కచ్‌లోని కండ్ల పోర్ట్ ట్రస్ అధికారులైన సూపరింటెండెంట్ ఇంజినీర్ శ్రీనివాసు, సబ్ డివిజినల్ అధికారి కుంటేకర్ లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)కి దొరికిపోయారు. వారి తరఫున లంచం తీసుకునేందుకు రుద్రేశ్వర్ సునముడి అనే వ్యక్తి రాగా, పక్కాగా స్కెచ్ వేసి అతడిని రెడ్‌హ్యాండెడ్‌గా ఏసీబీ పట్టుకుంది. పెద్దనోట్ల రద్దు తర్వాత బ్యాంకులు వారానికి రూ. 20 వేలు మాత్రమే తీసుకోవడానికి పరిమితి విధించగా, ఇంతమొత్తంలో కొత్తనోట్లు ఎలా వెలుగులోకి వచ్చాయన్నది పోలీసులను విస్మయపరుస్తోంది. ఈ వ్యవహారంలో ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు.