‘గ్రేట్’ ఫెస్టివల్‌కు గూగుల్ గుడ్‌బై
న్యూఢిల్లీ: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్, పేటీఎం వంటి ఆన్‌లైన్ షాపింగ్ సంస్థల జోరు నేపథ్యంలో ‘గ్రేట్ ఆన్‌లైన్ షాపింగ్ ఫెస్టివల్’ను (జీవోఎస్‌ఎఫ్) ఈ ఏడాది నుంచి నిలిపివేయనున్నట్లు గూగుల్ వెల్లడించింది. అమెరికాలో సైబర్ మండే తరహాలో వివిధ ఉత్పత్తులపై కొనుగోలుదారులకు భారీ డిస్కౌంటు ఆఫర్లు అందించేలా భారత్‌లో గూగుల్ 2012లో జీవోఎస్‌ఎఫ్‌ను ప్రారంభించింది. అయితే, ప్రస్తుతం పలు ఈ-కామర్స్ కంపెనీలు ఇలాంటి డీల్స్‌ను ప్రకటిస్తూనే ఉన్నాయి.
భారీ ఆఫర్లతో కస్టమర్లను ఆకట్టుకునేందుకు వ్యాపార సంస్థలు ఏడాది పాటు వేచి చూడాల్సిన అవసరం లేదని, అటు కొనుగోలుదారులు కూడా అంత సమయం నిరీక్షించాల్సిన పరిస్థితి లేదని గూగుల్ ఇండియా ఇండస్ట్రీ డెరైక్టర్ నితిన్ బవన్‌కులె ఒక బ్లాగులో వ్యాఖ్యానించారు. అందుకే జీవోఎస్‌ఎఫ్‌ను నిలి పివేయాల్సిన తరుణం వచ్చినట్లు చెప్పారు. 2012లో జీవోఎస్‌ఎఫ్ ప్రారంభమైనప్పుడు 90 రిటైలర్లు విక్రయాలు చేపట్టగా, 2013లో ఆ సంఖ్య 240కి , గతేడాది 550కి చేరింది.