
టాటా-సింగపూర్ ఎయిర్‌లైన్స్‌కు గ్రీన్ సిగ్నల్
న్యూఢిల్లీ: సింగపూర్ ఎయిర్‌లైన్స్‌తో (ఎస్‌ఐఏ) కలిసి టాటా సన్స్ తలపెట్టిన జాయింట్ వెంచర్‌కి ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ లభించింది. ఈ ప్రతిపాదనను విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (ఎఫ్‌ఐపీబీ) ఆమోదముద్ర వేసినట్లు ఆర్థిక వ్యవహారాల విభాగం కార్యదర్శి అరవింద్ మాయారాం గురువారం తెలిపారు. ఈ జేవీకి ఎటువంటి షరతులు విధించలేదని పేర్కొన్నారు. ఎఫ్‌ఐపీబీ ఆమోదం లభించడంతో.. దేశీయంగా పూర్తి స్థాయిలో విమాన సర్వీసులు ప్రారంభిం చేందుకు టాటా-ఎస్‌ఐఏకి మార్గం సుగమమైంది.
ఈ జేవీలో టాటా సన్స్‌కి 51%, ఎస్‌ఐఏకి 49% వాటాలు ఉంటాయి. ప్రారంభ దశలో ఇందులో ఇరు కంపెనీలు కలిసి 100 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టనున్నాయి. టాటా సన్స్ మరోవైపు మలేసియాకి చెందిన ఎయిర్‌ఏషియా తో కలిసి చౌక విమాన సర్వీసులను కూడా ప్రారంభించనున్న సంగతి తెలిసిందే. ఈ వెంచర్‌కి ఏప్రిల్‌లో ఎఫ్‌ఐపీబీ అనుమతులు లభించాయి.