జీఎస్‌కే బంపర్ ఆఫర్..
భారత్ సబ్సిడరీ జీఎస్‌కే ఫార్మా ఇన్వెస్టర్లకు రూ.6,389 కోట్ల ఓపెన్ ఆఫర్
24.3% వాటా కొనుగోలుకు ప్రకటన
షేరుకి రూ.3,100 చెల్లించనున్నట్లు వెల్లడి
వచ్చే ఫిబ్రవరిలో ఆఫర్ ప్రారంభమయ్యే చాన్స్
ముంబై: విదేశీ బహుళజాతి సంస్థలు భారత్‌లో తమ అనుబంధ సంస్థలను పూర్తిగా తమ చెప్పుచేతల్లోకి తీసుకోవడానికి ఉవ్విళ్లూరుతున్నాయి. బ్రిటిష్ ఫార్మా దిగ్గజం గ్లాక్సోస్మిత్‌క్లైన్(జీఎస్‌కే)... దేశీ కంపెనీ జీఎస్‌కే ఫార్మాలో 24.33 శాతం వాటాను కొనుగోలు చేయడంకోసం సోమవారం ఓపెన్ ఆఫర్‌ను ప్రకటించింది. షేరుకి రూ. 3,100 చొప్పున చెల్లించేందుకు ముందుకొచ్చింది. ఇందుకోసం మొత్తం రూ. 6,389 కోట్లను వెచ్చించనున్నట్లు తెలిపింది. కాగా, యూరప్ ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం యూనిలీవర్ కూడా భారతీయ అనుబంధ సంస్థ హిందుస్థాన్ యూనిలీవర్(హెచ్‌యూఎల్)లో ఈ ఏడాది ఓపెన్‌ఆఫర్ ద్వారా భారీగా వాటాను కొనుగోలు చేయడం తెలిసిందే. 52.48% నుంచి 67.28 శాతానికి వాటా పెంచుకుంది. దీనికోసం రూ. 19,180 కోట్లను వెచ్చించింది. వాస్తవానికి 75%కి వాటా పెంచుకోవడానికి ఆఫర్ ఇవ్వగా.. ఇన్వెస్టర్ల నుంచి ఆశించిన స్పందనలేకపోవడంతో లక్ష్యాన్ని చేరలేకపోయింది.
75 శాతానికి జీఎస్‌కే వాటా...!
ప్రస్తుతం జీఎస్‌కే ఫార్మాలో జీఎస్‌కేకు 50.67% వాటా ఉంది. ప్రతిపాదిత ఓపెన్ ఆఫర్ ద్వారా రూ.10 ముఖ విలువ గల 2.609 కోట్ల జీఎస్‌కే ఫార్మా షేర్లను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. తద్వారా తన వాటాను 75% వరకూ పెంచుకోవాలనేది జీఎస్‌కే ప్రణాళిక. కాగా, నియంత్రణ అనుమతులకు లోబడి.. వచ్చేఏడాది ఫిబ్రవరిలో ఆఫర్ ప్రారంభమయ్యే అవకాశాలున్నాయని జీఎస్‌కే ఒక ప్రకటనలో పేర్కొంది.
మా నిబద్ధతకు నిదర్శనం...: జీఎస్‌కే
‘భారత్‌కు జీఎస్‌కే ఇస్తున్న వ్యూహాత్మక ప్రాధాన్యానికి ఈ ఆఫర్ నిదర్శనం. ఇక్కడి మార్కెట్‌పై దీర్ఘకాలిక ప్రణాళిక, నిబద్ధతలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నాం’ అని జీఎస్‌కే గ్రూప్ చీఫ్ స్ట్రాటజిక్ ఆఫీసర్ డేవిడ్ రెడ్‌ఫెర్న్ ఈ ఓపెన్ ఆఫర్‌పై స్పందించారు. భారత్‌లో కార్యకలాపాలపై ఈ ఆపర్ ఎలాంటి ప్రభావం చూపదని, ఇక్కడ తమ పెట్టుబడులు యథావిధిగా కొనసాగుతాయని ఆయన స్పష్టం చేశారు. భారత్‌లో విక్రయిస్తున్న ఫార్మా ఉత్పత్తులన్నింటినీ దాదాపు ఇక్కడే తయారుచేస్తున్నట్లు చెప్పారు. నాసిక్‌లో తమకు భారీ ప్లాంట్ ఉందని.. బెంగళూరులో మరో ప్లాంట్ ఏర్పాటు ప్రణాళికల్లో ఉన్నామని వెల్లడించారు. కాగా, జీఎస్‌కే ఫార్మాలో దాదాపు 5,000 మంది సిబ్బంది పనిచేస్తున్నారు.
జీఎస్‌కే కన్జూమర్‌లో ఇప్పటికే...
మరో భారతీయ అనుబంధ సంస్థ జీఎస్‌కే కన్జూమర్ హెల్త్‌కేర్‌లో కూడా జీఎస్‌కే తన వాటాను ఈ ఏడాది జనవరిలో 43.2% నుంచి 72.5%కి ఓపెన్ ఆఫర్ ద్వారానే పెంచుకుంది. ఇందుకు రూ.4,800 కోట్లను వెచ్చించింది. హార్లిక్స్, బూస్ట్, మాల్టోవా, క్రోసిన్, ఈనో, అయొడెక్స్ వంటి ఉత్పత్తులను జీఎస్‌కే కన్జూమర్ భారత్‌లో విక్రయిస్తోంది.
షేరు.. 20% జంప్
జీఎస్‌కే ఆఫర్ ప్రభావంతో జీఎస్‌కే ఫార్మా షేరు ధర సోమవారం బీఎస్‌ఈలో దాదాపు 20 శాతం వరకూ దూసుకెళ్లింది. రూ. 2,952 వద్ద 52 వారాల గరిష్టాన్ని కూడా తాకింది. చివరకు క్రితం ముగింపు(రూ.2,468)తో పోలిస్తే రూ.459 (18.6%) ఎగబాకి రూ.2,927 వద్ద స్థిరపడింది. ఎన్‌ఎస్‌ఈలో రూ.465(18.60%) లాభపడి రూ.2,925 వద్ద ముగిసింది. శుక్రవారం నాటి షేరు ముగింపు ధరతో పోలిస్తే తాజా ఓపెన్ ఆఫర్‌లో ప్రకటించిన ధర 26 శాతం అధికం కావడం గమనార్హం.