లచ్చు వాంగ్మూలంతో వీడిన గుట్టు | gunman lachu statement reveals links in cash for vote scam | Sakshi
Sakshi News home page

లచ్చు వాంగ్మూలంతో వీడిన గుట్టు

Published Tue, Jul 7 2015 5:31 PM | Last Updated on Sun, Sep 3 2017 5:04 AM

gunman lachu statement reveals links in cash for vote scam

ఓటుకు కోట్లు కేసులో సత్తుపల్లి ఎమ్మెల్యే సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యను ఏసీబీ ఐదోముద్దాయిగా చేర్చింది. ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో ఆయనే కీలకంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. మే 27 నుంచి మే 31 మధ్య 5 రోజుల గడువులో ఏకంగా 32 సార్లు సెబాస్టియన్‌, సండ్ర మధ్య సంభాషణలు జరిగాయి. సండ్ర 23 సార్లు కాల్‌ చేస్తే.. సెబాస్టియన్‌ 8 సార్లు కాల్‌ చేశారు. వీరిద్దరి సంభాషణలను సవివరంగా సేకరించిన ఏసీబీ అధికారులు.. వాటిని కోర్టుకు సమర్పించారు.


కేసులో ఎ-1గా ఉన్న రేవంత్‌ రెడ్డికి, సండ్ర వెంకట వీరయ్యకు మధ్య 18సార్లు ఫోన్ కాల్స్‌ వెళ్లినట్టు గుర్తించారు. అలాగే సండ్ర వెంకటవీరయ్య, - హ్యారిస్‌ సెబాస్టియన్‌ మధ్య 12 కాల్స్ వెళ్లినట్టు ఏసీబీ తెలిపింది. ఈ కేసుకు సంబంధించి వెంకటవీరయ్యకు గన్‌మన్‌గా పనిచేస్తున్న పోలీసు కానిస్టేబుల్‌ టి.లచ్చు వాంగూల్మం కూడా ఏసీబీ సేకరించింది. మే 29 నుంచి జరిగిన పరిణామ క్రమాన్ని లచ్చు తన వాంగూల్మంలో వివరించారు.  

మే 29న సండ్ర మహానాడుకు హాజరయ్యారని,  మే 30న  ఉదయం 9 గంటల ప్రాంతంలో ఏపీ సీఎం ఇంటికి వెళ్లారని,  అక్కడినుంచి ఎన్టీఆర్‌ ట్రస్టు భవన్‌కు వచ్చారని లచ్చు తన వాంగ్మూలంలో పేర్కొన్నారు. మే 30న లేక్‌ వ్యూ గెస్ట్‌ హౌస్కు, సాయంత్రం 6 గంటలకు  నోవాటెల్‌ హోటల్‌కు వెళ్లారని తెలిపారు. నోవాటెల్‌ హోటల్‌లో జరిగిన సమావేశంలో టీడీపీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో పాటు ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న వేం నరేందర్‌ రెడ్డి కూడా ఉన్నారని లచ్చు తెలిపారు.

మే 31న  ఏసీ సీఎం ఇంటికి వెళ్తున్న సమయంలో వెంకటవీరయ్యకు  ఫోన్‌ కాల్‌ వచ్చిందని, ఫోన్‌ సంభాషణను బట్టి  అది రేవంత్‌ రెడ్డి నుంచి వచ్చినట్టుగా గుర్తించినట్టు లచ్చు తెలిపారు. నేరుగా ఆ ఇంటికి ఎందుకు వెళ్లావని రేవంత్‌ను నిలదీసినట్టు అర్థమైందని లచ్చు తెలిపారు.  ఆ తర్వాత టీడీపీ నాయకులంతా ఏసీబీ ఆఫీసు ముందు ధర్నాచేసేందుకు వెళ్లారని వెంకట వీరయ్య గన్‌మ్యాన్‌ లచ్చు ఏసీబీకి ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నారు.

మొత్తం ఆపరేషన్‌కు పట్టిన సమయం ఐదు రోజులు కాగా.. మొదలైంది మే 27న, ముగిసింది మే 31న. తొలి మూడురోజులు మొత్తం పనంతా తానే చక్కదిద్దిన సండ్ర.. మే 30న వ్యవహారాన్ని రేవంత్‌కు అప్పగించారు. అంతా బాస్‌ ఆదేశాలతోనే చేస్తున్నట్లు చెప్పుకున్న వీరయ్య.. చిన్న చిన్న విషయాల్లోనూ జాగ్రత్త పడ్డారు. కలిసే సమయం, ఎంచుకునే ప్రదేశం, వెంట వచ్చే డ్రైవర్‌ ఇలా అన్ని విషయాల్లోనూ దృష్టి సారించిన సండ్ర.. ఎక్కడా విషయం బయటకు పొక్కకుండా కేర్‌ తీసుకున్నారు. ఎప్పటికప్పుడు ఆపరేషన్‌లో అన్ని విషయాలను చంద్రబాబుకు అప్‌డేట్‌ చేసినట్టుగా సండ్ర తన సంభాషణల్లో పేర్కొన్నారు. పైగా ఆపరేషన్‌కు టీడీపీ ఆఫీసులో పని చేసే జనార్దన్‌ అనే వ్యక్తిని సంధానకర్తగా ఏర్పాటు చేసుకున్నారు. అంటే సండ్ర అండ్‌ టీం ఏ పని చేసినా.. జనార్దన్‌కు వివరించడం, ఆ విషయాన్ని జనార్దన్‌ చంద్రబాబుకు అప్‌డేట్‌ చేసేలా ఏర్పాట్లు చేసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement