చనిపోయిన భర్తపై కట్నం వేధింపుల కేసు
గురుగావ్: అత్తమామలను వేధింపులకు గురిచేసేందుకు, భర్త నుంచి సులభంగా విడాకులు తీసుకొని భరణం పొందేందుకు కొంత మంది మహిళలు భారతీయ శిక్షాస్మృతిలోని 498ఏ సెక్షన్‌ను దుర్వినియోగం చేస్తున్న విషయం తెల్సిందే. ఉత్తరప్రదేశ్‌లోని గురుగావ్ ప్రాంతానికి చెందిన ఓ మహిళ, చట్టంలోని ఓ సెక్షన్ ఎక్కువే చదివినట్టున్నది... భర్త ఆత్మహత్య చేసుకొని చనిపోయిన మరుసటి రోజున భర్తతోపాటు, అత్తమామలపై వరకట్న వేధింపుల కేసును దాఖలు చేసింది.
బ్యాంకర్‌గా పనిచేస్తున్న 30 ఏళ్ల రాకేశ్ పిలానియా అక్టోబర్ ఐదవ తేదీన తాను నివసిస్తున్న అపార్ట్‌మెంట్ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఆ మరుసటి రోజే భార్య , భర్త,అత్తమామలపై డౌరీ కేసును దాఖలు చేసిందని 498ఏ సెక్షన్ దుర్వినియోగంపై డాక్యుమెంటరీ తీస్తున్న ఫిల్మ్‌మేకర్, జర్నలిస్ట్ దీపక్ భరద్వాజ్ తెలిపారు.
ఈ కేసులో రాకేశ్ చనిపోయినందున ఆయన్ని కేసు నుంచి తప్పిస్తారని, అయితే బంధువులపై మాత్రం దర్యాప్తు కొనసాగుతుందని ఆయన తెలిపారు. భర్త ఆత్మహత్యకు కారకురాలిగా భావించి ఆమెను అరెస్టు చేయకుండా, కేసు పెట్టకుండా ఉండేందుకే ఆమె ఈ వరకట్నం కేసును దాఖలు చేసి ఉండవచ్చని భరద్వాజ్ అనుమానం వ్యక్తం చేశారు. 498ఏ సెక్షన్ దుర్వినియోగానికి ఇది మరో చక్కటి ఉదాహరణని ఆయన వ్యాఖ్యానించారు.
‘పది లక్షల రూపాయలు కావాలని వేధిస్తున్నట్టు కేసు పెడతానంటూ మమ్మల్ని, మా అబ్బాయిని కోడలు తరచుగా బెదిరించేది. ఆ బెదిరింపులు, వేధింపులను భరించలేకనే నా కుమారుడు ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడు’ అని రాకేశ్ తండ్రి ఆనంద్ ప్రకాష్ పిలానియా మీడియాకు తెలిపారు. ఇదే విషయమై రాకేశ్ భార్యను కూడా మీడియా సంప్రదించగా మాట్లాడేందుకు ఆమె నిరాకరించారు.