వచ్చే నెలలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సగం జీతమే..? | Half salary for telangana govt employees over notes cancellation | Sakshi
Sakshi News home page

వచ్చే నెలలో ఉద్యోగులకు సగం జీతమే..?

Published Tue, Nov 15 2016 2:15 AM | Last Updated on Sat, Aug 11 2018 4:59 PM

వచ్చే నెలలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సగం జీతమే..? - Sakshi

వచ్చే నెలలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సగం జీతమే..?

పెద్ద నోట్ల రద్దుతో రాష్ట్ర ఆదాయం ఢమాల్‌.. అవసరమైతే ఉద్యోగుల జీతాల్లో కోత
ఆదాయం సమకూరిన తర్వాత తిరిగి చెల్లించాలని భావిస్తున్న సర్కారు
♦ పదో వంతుకు పడిపోయిన వివిధ శాఖల రాబడి
♦ రాష్ట్రానికి ప్రతినెలా వచ్చే ఆదాయం రూ. 9 వేల కోట్లు
♦ ఈ నెల అందులో సగం కూడా రాని పరిస్థితి
♦ ఉద్యోగులకు, పెన్షనర్లకు చెల్లించాల్సింది 2,500 కోట్లు
♦ జీతాలకే అంత మొత్తం పోతే ఖజానా ఖాళీ
♦ ఆర్థిక శాఖ అధికారులతో సీఎం మంతనాలు


సాక్షి, హైదరాబాద్‌
పెద్ద నోట్ల రద్దు ప్రకంపనలు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను వెంటాడుతున్నాయి. పన్నుల ద్వారా వచ్చే ఆదాయం ఒక్కసారిగా స్తంభించిపోవటంతో రాష్ట్ర ఖజానా వెలవెలబోతోంది. దీంతో ఉద్యోగుల వచ్చేనెల జీతాలకు కటకట తప్పదని ప్రభుత్వం అంచనా వేస్తోంది. తప్పనిసరైతే ఉద్యోగుల జీతాల్లో కొంత మేరకు కోత పెట్టాల్సి వస్తుందని రాష్ట్ర ఆర్థిక శాఖ లెక్కలేసుకుంటోంది. సీఎం కె.చంద్రశేఖర్‌రావు సమక్షంలో ఉన్నతాధికారులతో ఇటీవల వరుసగా జరిగిన సమావేశాల్లో ఈ విషయం చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో డిసెంబర్‌ ఒకటిన ప్రభుత్వ ఉద్యోగులు పూర్తి జీతం అందుకుంటారా.. లేదా..? అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పుడున్న కష్టకాలంలో జీతాల్లో 25 శాతం నుంచి 50 శాతం వరకు కోత పెట్టి ఆదాయం సమకూరిన తర్వాత అంతమేరకు ఉద్యోగులకు తిరిగి చెల్లించాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీంతో రాష్ట్రంలో దాదాపు 3.5 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు ఇబ్బంది పడే ప్రమాదముంది. రాష్టంలో ఉద్యోగుల నెలసరి జీతాలు, రిటైర్డ్‌ ఉద్యోగుల పెన్షన్లకు ప్రతి నెలా దాదాపు రూ.2,500 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది.

సగం వస్తే గొప్ప
కేంద్రం నుంచి వచ్చే పన్నుల వాటాతో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి వివిధ విభాగాల ద్వారా వచ్చే ఆదాయం ప్రతినెలా దాదాపు రూ.9,000 కోట్లు ఉంటుంది. అయితే నోట్ల రద్దు పరిణామాలతో ప్రధానంగా ఆదాయం తెచ్చి పెట్టే శాఖల్లో ఆదాయం పదోవంతుకు పడిపోయింది. స్టాంపులు రిజిస్ట్రేషన్లు, వాహనాల కొనుగోళ్లు, ఎక్సైజ్, వ్యాట్‌ ఆదాయం అనూహ్యంగా తగ్గిపోయింది. ఈ నెల 9వ తేదీ నుంచి వరుసగా మూడ్రోజుల్లో రూ.15 కోట్లు రావాల్సిన స్టాంపులు రిజిస్ట్రేషన్ల ఆదాయం కేవలం రూ.30 లక్షలు వచ్చింది. పుండు మీద కారం చల్లినట్లుగా ఇదే నెలలో కేంద్రం విడుదల చేసే పన్నుల వాటాలో రూ.480 కోట్లు కోత పడింది. దీంతో రాష్ట్ర ఆదాయం ఈ నెలలో సగానికి సగం పడిపోయే ప్రమాదముందని.. రూ.4,000 కోట్లకు మించి వచ్చేలా లేదని ఇటీవల సీఎం సమక్షంలో ఆర్థిక శాఖ అధికారులు ప్రాథమికంగా అంచనాకు వచ్చినట్లు తెలిసింది. అందులో ప్రతినెలా విధిగా చెల్లించాల్సిన వడ్డీలు, వాయిదాలకు రూ.1,100 కోట్లు పోతే.. మిగతా సొమ్మంతా జీతాలకు చెల్లించే పరిస్థితి లేదని చర్చ జరిగింది. జీతాలు పూర్తిగా చెల్లిస్తే ఇతరత్రా ఖర్చులన్నీ ఆగిపోతాయని, కనీస నిర్వహణ ఖర్చులకు డబ్బుల్లేక ఖజానా ఖాళీ అవుతుందని లెక్కలు వేశారు. ఈ నేపథ్యంలో అంచనాకు మించి కొంత ఆదాయం సమకూరితే తప్ప.. ఉద్యోగుల జీతాల్లో కోత పెట్టడం మినహా మరో గత్యంతరం లేదని ఆర్థిక శాఖ వర్గాలు యోచిస్తున్నాయి. వచ్చేవారంలో సమకూరే ఆదాయానికి అనుగుణంగా జీతాలు పూర్తిగా చెల్లించాలా.. కోత పెట్టాలా.. అనే అంశంపై తదుపరి నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి.

ఉద్యోగుల డీఏకు ఎసరు?
పెద్ద నోట్ల రద్దు పరిణామాలతో ద్రవోల్బణం తగ్గిపోతుందని, ధరలన్నీ దిగి వస్తాయని కేంద్రం అంచనా వేస్తోంది. అదే జరిగితే ఇకపై ఉద్యోగులకు చెల్లించే డీఏ (కరువు భత్యం) ఆగిపోతుందనే ప్రచారం మొదలైంది. ప్రస్తుతం ఏటేటా రెండు దఫాలుగా కేంద్రం డీఏను ప్రకటిస్తోంది. దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం సైతం ఉద్యోగులకు డీఏను చెల్లిస్తుంది. ద్రవ్యోల్బణం తగ్గితే క్రమంగా ఉద్యోగులకు ఇచ్చే డీఏను కేంద్రం నిలిపివేస్తుందని ఉద్యోగ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరోవైపు రూ.2.50 లక్షల నగదు మించి ఉన్న వారందరినీ కేంద్రం సంపన్న వర్గాల జాబితాలో జమ కట్టి.. భవిష్యత్తులో సంక్షేమ పథకాలు వారికి అందకుండా కోత పెట్టబోతుందా అనేది అన్ని విభాగాల్లో చర్చ జరుగుతోంది. కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రంలో ఇవన్నీ అవాంఛనీయ పరిణామాలని, సీఎం సైతం అధికారులతో ఈ అంశాన్ని ప్రస్తావించినట్లు తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement