ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా
న్యూఢిల్లీ: విపరీతమైన ఒళ్లు నొప్పులు, హైబీపీతో బాధపడుతున్న తనకు జైల్లో కనీసం మందులు సైతం ఇవ్వకుండా పోలీసులు తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారంటూ ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా కుటుంబ సభ్యులకు ఓ లేఖ రాశారు. సాయిబాబా నుంచి అందిన ఉత్తరంలోని వివరాలను ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ కరెన్ గ్రేబ్రియల్ మీడియాకు వెళ్లడించారు. 90 శాతం వికలాంగుడైన ఫ్రొఫెసర్ సాయిబాబాను పోలీసులు అక్రమంగా నిర్భంధించారని ఆరోపించారు. వీల్‌చైర్‌లోంచి కదలలేని తనను జైలులో ఉన్న తోటి ఖైదీలే మలమూత్ర విసర్జనకు తీసుకెళుతున్నారని లేఖలో పేర్కొన్నట్టు తెలిపారు.
జైలు ఎస్పీ గతంలో హామీ ఇచ్చిన ప్రకారం జైలులో వెస్ట్రన్ స్టైల్ టాయిలెట్ ఏర్పాటు చేయలేదని, జైలులో తనకు సంబంధంలేని ఏవో నొప్పుల మాత్రలు ఇస్తున్నారే తప్ప, ఎలాంటి వైద్య పరీక్షలు చేయించడంలేదని సాయిబాబా ఉత్తరంలో పేర్కొన్నట్లు వివరించారు. సాయిబాబాను విడిపించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఇందుకోసం ఓ కమిటీని ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. కమిటీ సభ్యుల వివరాలను తర్వలోనే వెల్లడిస్తామన్నారు. మావోయిస్టులతో సంబంధాలున్నాయన్న ఆరోపణలపై మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేసిన సాయిబాబాకు బెయిల్ ఇవ్వడానికి గడ్చిరోలి సెషన్స్ కోర్టు నిరాకరించిన విషయం తెలిసిందే.