‘ప్రసవ’ వేదన! | Harassment of HIV-affected pregnant women | Sakshi
Sakshi News home page

‘ప్రసవ’ వేదన!

Published Wed, Jul 22 2015 2:17 AM | Last Updated on Sun, Sep 3 2017 5:54 AM

‘ప్రసవ’ వేదన!

‘ప్రసవ’ వేదన!

హెచ్‌ఐవీ బాధిత గర్భిణులకు కడగండ్లు
ప్రభుత్వ ఆస్పత్రుల్లో లేని సర్జికల్ కిట్లు
నిధుల్లేవని చేతులెత్తేసిన కలెక్టర్లు

 
హైదరాబాద్: ‘‘మా పరిస్థితి పగవారికి కూడా రాకూడదు. ప్రాణాంతక జబ్బు సోకి క్షణమొక యుగంలా బతుకుతున్నాం. జబ్బు ఉందని తెలిస్తే ప్రతి ఒక్కరూ వివక్ష చూపేవారే. అయినా సరే అమ్మ కావాలన్న ఆశ. మాతృత్వ మధురిమను ఆస్వాదించాలన్న ఆరాటం. పుట్టెడు కష్టాల్లో కాన్పు కోసమని ప్రభుత్వ ఆస్పత్రులకు వెళితే.. అక్కున చేర్చుకోవాల్సిన వారే కాదు పొమ్మంటున్నారు’’.... ఇదీ ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో హెచ్‌ఐవీ సోకిన గర్భిణుల దీనగాథ..

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని 23 జిల్లాల్లో హెచ్‌ఐవీ సర్జికల్ కిట్స్ 4 నెలలుగా అందుబాటులో ఉండడం లేదు. ఈ కిట్‌లు లేకుండా హెచ్‌ఐవీ బాధిత గర్భిణులకు కాన్పు చేయలేమని డాక్టర్లు చెబుతున్నారు.ప్రైవేటు ఆస్పత్రుల్లో కాన్పునకు రూ.30 వేలకు పైగానే ఖర్చవుతోంది. ఈ పరిస్థితుల్లో రెండు రాష్ట్రాల్లో సు మారు 3 వేల మంది గర్భిణులు తమ బాధ ఎవరికీ చెప్పుకోలేక కన్నీటి పర్యంతమవుతున్నారు.  
 నిధులు లేవట: హెచ్‌ఐవీ పాజిటివ్ గర్భిణులకు కాన్పు చేయాల్సి వస్తే ప్రత్యేక సర్జికల్ కిట్‌లు వాడాలి. లేదంటే వైద్యులతో పాటు పక్కవారికి కూడా ఈ వ్యాధి సోకే ప్రమాదం ఉంటుంది. ప్రసవం పూర్తయ్యాక ఈ కిట్‌లను ప్రత్యేక పరిస్థితుల్లో నిర్వీర్యం చేస్తారు. ఒక్కో కిట్ ఖరీదు రూ.వెయ్యికి పైగా ఉంటుంది. హైదరాబాద్‌లోని గాంధీ, నయాపూల్ మెటర్నిటీ, పేట్లబుర్జు మెటర్నిటీ, కర్నూలు ప్రభుత్వాసుపత్రి, విశాఖపట్నంలోని కింగ్‌జార్జి వంటి ప్రధాన ప్రభుత్వాసుపత్రుల్లో కిట్‌లు లేవు. దీంతో హెచ్‌ఐవీ పాజిటివ్ మహిళలు ప్రైవేటు ఆస్పత్రుల్లో చేరాల్సి వస్తోంది. కాన్పు కోసం వేలాది రూపాయలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి నెలకొంది.

జిల్లా కలెక్టర్లు అత్యవసర నిధి నుంచి హెచ్‌ఐవీ బాధితుల కోసం పరికరాలు కొనుగోలు చేసే అవకాశమున్నా నిధులు లేవనే సాకుతో చేతులెత్తేస్తున్నారు. ఈ పరికరాల కొనుగోలుకు ప్రతిఏటా కనీసం రూ.6 కోట్లు అవసరం. ఈ ఏడాది జాతీయ ఎయిడ్స్ నియంత్రణా మండలి నుంచి 2 రాష్ట్రాలకు కలిపి రూ.26 కోట్ల నిధులు మాత్రమే వచ్చాయి. గతేడాది రూ.114 కోట్ల వచ్చాయి. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు హెచ్‌ఐవీ బాధిత గర్భిణుల కోసం పైసా కూడా కేటాయించలేదు.
 
ప్రకాశం జిల్లాలో ప్రమాద ఘంటికలు
ప్రకాశం జిల్లాలో హెచ్‌ఐవీ ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. హెచ్‌ఐవీ పాజిటివ్ కేసుల విషయంలో ప్రకాశం జిల్లా మొదటి స్థానంలో నిలుస్తోంది. ఈ జిల్లాలో నెలకు 200 నుంచి 250 హెచ్‌ఐవీ పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఏటా 90 మంది హెచ్‌ఐవీ పాజిటివ్ గర్భిణులు కాన్పు కోసం వస్తున్నారు.  తెలంగాణ విషయానికొస్తే.. హైదరాబాద్, మహబూబ్‌నగర్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లో హెచ్‌ఐవీ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. హెచ్‌ఐవీ బాధితులకు సేవలందించాల్సిన జిల్లా ప్రాజెక్టు మేనేజర్లు ఎన్జీవోలతో కుమ్మక్కై జలగల్లా పీడిస్తున్నారు. ముఖ్యంగా ప్రకాశం, ఉభయ గోదావరి జిల్లాల ప్రాజెక్ట్ మేనేజర్లపై ఫిర్యాదులొచ్చినా కలెక్టర్లు చర్యలు తీసుకోవడం లేదు.
 
ఏపీ, తెలంగాణలో హెచ్‌ఐవీ పాజిటివ్ గర్భిణులు: 3 వేల మంది  
ఒక్కో సర్జికల్ కిట్ ఖరీదు: రూ.1000కి పైగా
పరికరాల కొనుగోలుకు ప్రతిఏటా
కావాల్సిన నిధులు: కనీసం రూ.6 కోట్లు
{పైవేటు ఆస్పత్రుల్లో కాన్పు ఖర్చు: రూ.30 వేలు
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement