పగలు పూజారి.. రాత్రి పూట చోరీ
పగటి పూట ఆయన పక్కా ఆధ్యాత్మికంగా కనిపిస్తాడు. పెళ్లిళ్లు చేస్తాడు, పెళ్లి సంబంధాలు చూసే పేరయ్యగా వ్యవహరిస్తాడు, అందరికీ తలలో నాలుకలా ఉంటాడు. రాత్రిళ్లు మాత్రం ఒక్కసారిగా చేతులు దురద పుడతాయి. అంతే, ముసుగు ధరిస్తాడు.. చేతివాటం చూపిస్తాడు. ఇదేదో సినిమా కథలా ఉందనుకుంటున్నారా? కాదు.. మహారాష్ట్రలోని పుణె నగరానికి చెందిన అజయ్ మధుకర్ గైక్వాడ్ నిజజీవిత గాధ. ఇప్పటివరకు నగరంలోని వివిధ ప్రాంతాల్లో 25 దోపిడీలు చేసినందుకు అతడిని ఇటీవలే పోలీసులు అరెస్టు చేశారు.
గైక్వాడ్ బుద్ధవిహార్ ప్రాంతంలో కేర్‌టేకర్‌గా ఉంటూ మంచి జీవితం గడిపేవాడు. అయితే చెడు సావాసాలు అతడిని చెడగొట్టాయి. పెళ్లిళ్లు చేసేవాడని, చాలామందికి సంబంధాలు కుదిర్చి మంచి పెళ్లిళ్ల పేరయ్యగా కూడా ఉండేవాడని సీనియర్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ సుష్మా చవాన్ తెలిపారు. కొంత కాలానికి అతడికి మహ్మద్ ఇక్బాల్ షేక్, మదన్ విరాన్ స్వామి అనే ఇద్దరితో స్నేహం కుదిరింది. వాళ్లిద్దరి మీద ముంబై, థానె పోలీసు కమిషనరేట్లలో పలు కేసులున్నాయి. వాళ్లతో చేరిన గైక్వాడ్.. పగలు తన పని మామూలుగానే చేసుకుంటూ రాత్రిపూట మాత్రం వీళ్లిద్దరితో కలిసి దోపిడీలు చేసేవాడు. పూజారిగా ఉంటూ.. జనానికి పలు సామాజిక, ఆధ్యాత్మిక అంశాలలో సలహాలు కూడా ఇచ్చేవాడు. దాంతో ఎవరికీ అనుమానం రాలేదు. నాలుగైదేళ్ల పాటు ఈ రెండు వ్యవహారాలు ఎంచక్కా జరిగిపోయాయి.
సుమారు ఏడాది క్రితం గైక్వాడ్ ఈ దోపిడీలు మానేసి, రియల్ ఎస్టేట్ వ్యాపారి దగ్గర కమీషన్ పద్ధతి మీద ఏజెంటుగా పని చేయడం మొదలుపెట్టాడు. అప్పటినుంచి రైల్వే క్వార్టర్స్ దగ్గర కుటుంబంతో ఉండేవాడు. సుమారు నెలరోజుల క్రితంవేరే దొంగతనం కేసులో పట్టుబడిన షేక్.. ఇతడి పేరును కూడా చెప్పడంతో పోలీసులు పట్టుకున్నారు. అప్పుడు మొత్తం విషయం బయటపడింది.