ఆరోగ్య శిక్షణ కేంద్రాలకు తాళాలు! | Health training centers locks! | Sakshi
Sakshi News home page

ఆరోగ్య శిక్షణ కేంద్రాలకు తాళాలు!

Published Fri, Feb 5 2016 1:36 AM | Last Updated on Sun, Sep 3 2017 4:57 PM

ఆరోగ్య శిక్షణ కేంద్రాలకు తాళాలు!

ఆరోగ్య శిక్షణ కేంద్రాలకు తాళాలు!

* మూసివేసిన ఆంధ్ర మహిళా సభ యాజమాన్యం
* 1న మహబూబ్‌నగర్‌లో, 3న హైదరాబాద్‌లోని కేంద్రం మూసివేత
* ఆందోళనలో ఉద్యోగులు, విద్యార్థులు

సాక్షి, హైదరాబాద్: పేద విద్యార్థినిలకు ఉచితంగా నర్సింగ్ శిక్షణ ఇస్తున్న మల్టీపర్పస్ హెల్త్ సెంటర్లకు ఆంధ్ర మహిళాసభ యాజమాన్యం అకస్మాత్తుగా తాళం వేసింది! దీంతో ఉద్యోగులు, విద్యార్థులు ఆందోళనలో పడ్డారు. ఈ నెల 1న మహబూబ్ నగర్, 3న హైదరాబాద్‌లోని విద్యానగర్ సెంటర్‌కు తాళాలు వేశారు.

అదేంటని ఉద్యోగులు ప్రశ్నిస్తే రాష్ట్ర ప్రభుత్వం గ్రాంట్ ఇవ్వడం లేదని చెబుతోంది. ముందస్తు సమాచారం కూడా ఇవ్వకుండా సెంటర్లకు తాళాలు వేస్తున్న యాజమాన్యంపై చర్య తీసుకోవాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.
 
ఎన్నో ఆశలతో...
జాతీయ ఆరోగ్య మిషన్ గ్రాంట్‌తో నడుస్తోన్న ఈ శిక్షణ కేంద్రాలకు రాష్ట్ర విభజన సమయంలో గ్రాంట్ రిలీజ్‌లో కొన్ని ఇబ్బందులు తలెత్తాయి. దీంతో గత 18 నెలలుగా కేంద్రాల్లోని ఉద్యోగులకు జీతాలు అందడం లేదు. పదేళ్ల క్రితం వరకూ పదోతరగతి పూర్తిచేసుకున్న పేద, వితంతు మహిళలకు 18 నెలల పాటు ప్రాథమిక ఆరోగ్య శిక్షణ ఇస్తున్న ఈ కేంద్రాలు ప్రస్తుతం ఇంటర్ పూర్తిచేసిన విద్యార్థులకు రెండేళ్లపాటు శిక్షణ ఇస్తున్నాయి. సెంటర్‌కు 40 మంది చొప్పున విద్యార్థులను ఎంపిక చేస్తున్నారు.

ఈ ఏడాది మొదటి జాబితా కింద మూడు సెంటర్లలో దాదాపు 50 మంది విద్యార్థులు కేంద్రాల్లో చేరారు. ఇలా అకస్మాత్తుగా సెంటర్లకు తాళం వేయడంతో ఏం చేయాలో అర్థం కాక విద్యార్థులు ఆందోళనలో పడ్డారు. ‘‘పూట గడవని పేద కుటుంబానికి చెందిన అమ్మాయిని నేను. భవిష్యత్తుపై ఎన్నో ఆశలతో ఈ సెంటర్‌లో చేరాను. ఇప్పుడు ఇలా అకస్మాత్తుగా సెంటర్ నుంచి బయటికి పొమ్మంటే ఏం చేయాలో అర్థం కావడం లేదు’’ అని మహబూబ్‌నగర్‌కి చెందిన లక్ష్మి ఆవేదన వ్యక్తం చేసింది.
 
వాణిజ్య సంపద కోసమేనా...
ఈ సెంటర్ల మూసివేతలో కొత్త కోణం వెలుగు చూసింది. మహబూబ్‌నగర్‌లో ఉన్న సెంటర్‌పై ఒక వసతి గృహాన్ని, కమర్షల్ షాపులను నిర్మించారు. వీటిని ప్రైవేటు వ్యక్తులకు అప్పగించిన ఆంధ్ర మహిళా సభ యాజమాన్యం కమర్షియల్‌గా వచ్చిన ఆదాయాన్ని జీతాలకు, విద్యార్థులకిచ్చే స్టైఫండ్‌కి ఉపయోగిస్తామని చెప్పింది. అయితే ఏనాడు ఆ మాట నిలబెట్టుకోలేదని అక్కడి విద్యా సంస్థల అధికారి జ్యోతి చెప్పారు. ‘‘దశాబ్దాలుగా ఈ కేంద్రాలనే నమ్ముకుని బతుకుతున్న మాపై దౌర్జన్యం చేసి బయటికి పంపాల్సిన అవసరం ఆంధ్ర మహిళా సభకు ఎందుకు వచ్చిందో అర్థం కావడం లేదు.

ఈ ఏడాది రెండు జాబితాల్లో మూడు సెంటర్లలో 120 మంది పేద విద్యార్థులు శిక్షణ తీసుకోనున్నారు. వారి సర్టిఫికెట్లు అన్నీ మా దగ్గరే ఉన్నాయి. సంక్రాంతి సెలవులకు వెళ్లిన వారికి ఇక కేంద్రాలకు రావొద్దని చెప్పాలని యాజమాన్యం మాకు ఆర్డర్ పాస్ చేసింది’’ అని ఆమె వివరించారు. ‘‘విద్యార్థుల పట్ల ఇంత నిర్లక్ష్యంగా ప్రవర్తించడం అన్యాయం. ఉద్యోగులు, విద్యార్థుల ఇబ్బందులన్నింటినీ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాం. ఆయన వెంటనే స్పందించారు. త్వరలో మా విద్యార్థులకు సాంఘిక సంక్షేమ శాఖ సాయంతో శిక్షణ ఇప్పించే ఏర్పాటు చేస్తామన్నారు’’ అని మహబూబ్‌నగర్ కేంద్రం ప్రిన్సిపల్ విజయకుమారి చెప్పారు.
 
నేను తర్వాత మాట్లాతా: విమల
సెంటర్లను మూసివేయడంపై ప్రశ్నించగా ఆంధ్ర మహిళా సభ అధ్యక్షురాలు విమల మొక్కుబడి సమాధానమిచ్చారు. ‘‘నేను ప్రస్తుతం మద్రాసులో ఉన్నాను. దీనిపై తర్వాత మాట్లాడతా..’ అంటూ ఫోన్ పెట్టేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement