శనిగ్రహం ‘చందమామ’లో సముద్రం!
వాషింగ్టన్: శనిగ్రహానికి సహజ ఉపగ్రహాల్లో ఒకటైన ‘ఎన్‌సెలడస్’ గర్భంలో ఓ సముద్రం ఉందట! ఎన్‌సెలడస్‌పై 40 కి.మీ. మందంలో పేరుకుపోయిన మంచు ఉపరితలం కింద 10 కి.మీ. లోతైన జలాశయం ఉందని, అందులో నీరు ద్రవరూపంలోనే ఉందని నాసా శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఎన్‌సెలడస్ దక్షిణార్ధగోళంపై అక్కడక్కడా ఉన్న పొడవాటి నెర్రెల నుంచి తరచూ నీటి ఆవిరి, వాయువులు ఎగజిమ్ముతాయని, అందు వల్ల దాని గర్భంలో భారీ జలాశయం ఉండవచ్చని శాస్త్రవేత్తలు 2005లోనే అంచనా వేశారు.
తాజాగా క్యాసినీ ఉపగ్రహం ఎన్‌సెలడస్ చుట్టూ తిరుగుతున్నప్పుడు గురుత్వాకర్షణ ప్రభావం, సమాచార ప్రసార వ్యవస్థలో జరిగిన మార్పులను బట్టి.. అక్కడ సముద్రం ఉందని నిర్ధారించారు. ఆ సముద్రంలో సూక్ష్మజీవులు కూడా మనుగడ సాగించేందుకు అవకాశముందనీ, మన సౌరకుటుంబంలో భూమి తర్వాత జీవం ఉండేందుకు ఎక్కువ అవకాశాలున్న ఖగోళ వస్తువు ఇదేననీ శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అన్నట్టూ.. మన భూమికైతే ఒకే చందమామ ఉంది కానీ.. శనిగ్రహానికి మాత్రం.. చిన్నా, చితకా మొత్తం 62 చందమామలున్నాయి తెలుసా..!