
ఏపీకి ప్యాకేజీపై ఢిల్లీలో హైడ్రామా
న్యూఢిల్లీ: ప్రత్యేక హోదాకు ప్రత్యామ్నాయంగా కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కు ఇవ్వాలనుకుంటున్న ప్రత్యేక ప్యాకేజీ ప్రకటనపై ఢిల్లీలో హైడ్రామా కొనసాగుతోంది. కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ బుధవారం మధ్యాహ్నం ప్రత్యేక ప్రకటన వెలువరిస్తారనే సమాచారంతో ఉదయం నుంచి నార్త్ బ్లాక్ లోని ఆర్థిక మంత్రిత్వ కార్యాలయంలో హడావిడినెలకొంది. ఇది ఏపీ భవిష్యత్తును ప్రభావితం చేయబోయే కీలక నిర్ణయం కావడంతో తెలుగు వార్తాసంస్థలకేకాక జాతీయ మీడియా ప్రతినిధులు సైతం పెద్ద సంఖ్యలో అరుణ్ జైట్లీ కార్యాలయానికి చేరుకున్నారు. టీడీపీ కేంద్ర మంత్రి సుజనా కొందరు ఎంపీలతో కలిసి ఉదయం నుంచి ఆ కార్యాలయం చుట్టూతిరుగూ కనిపించారు. ఇటు విజయవాడలో సీఎం చంద్రబాబు అందుబాటులో ఉన్న మంత్రులతో వరుసభేటీలు నిర్వహించారు.
మరోవైపు ఏపీ బీజేపీ నేతలంతా ఢిల్లీకి రావాలని బీజేపీ అధిష్టానం ఆదేశించినట్లు తెలుస్తోంది. ఆ పార్టీ కీలకనేతలైన హరిబాబు, విష్ణు కుమార్ రాజు, పురందేశ్వరిలు ప్రస్తుతం విశాఖలోనే ఉన్నారు. వీరితోపాటు మరికొందరు ముఖ్యనేతలు రేపు ఉదయం ఢిల్లీ వెళతారని సమాచారం. ప్రకటన వెలువడుతోందని, జైట్లీ, ఇతర మంత్రులు ముసాయిదాను సిద్ధం చేస్తున్నారని, మరికొద్ది సేపట్లో మీడియా సమావేశం ఉంటుందని.. ఇలా నిమిషనిమిషానికి పరిస్థితులు ఒక్కోలా మారాయి ఆర్థిక శాఖ కార్యాలయం వద్ద. ప్యాకేజీ ముసాయిదాను ప్రధాని కార్యాలయానికి పంపారని, అక్కడి నుంచి ఆమోదం లభిస్తేనే ప్రకటన ఉంటుందని లీకులు ఇచ్చారు.