ప్రముఖ్ స్వామికి హిల్లరీ క్లింటన్ ఘన నివాళి
వాషింగ్టన్: 'వైదిక విలువలే మూలాలుగా ప్రపంచ మానవాళిని ఒక్కటిచేసిన మహనీయుడు ప్రముఖ్ స్వామి' అని హిల్లరీ క్లింటన్ అన్నారు. అమెరికాలో, అమెరికన్లకు ఆయన చేసిన సేవలను ఆమె గుర్తుచేసుకున్నారు. ఇటీవలే గుజరాత్లో కన్నుమూసిన ప్రముఖ్ స్వామికి.. అమెరికా అధ్యక్ష స్థానానికి పోటీపడుతున్న హిల్లరీ క్లింటన్ ఘనంగా నివాళులు అర్పించారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదలచేశారు.
ప్రముఖ్ స్వామి.. విలువలను బోధించడమేకాక, తన దైనందిన జీవితంలో వాటిని ఆచరించేవారని, అందుకే కోట్ల మంది ఆయనను గురువుగా స్వీకరించారని హిల్లరీ పేర్కొన్నారు. న్యూజెర్సీలోని అక్షరథామ్ ఆలయం నుంచి ప్రారంభమైన స్వామీజీ వైదిక విలువల ప్రచారం అమెరికా అంతటా విస్తరించాయని తెలిపారు. తన భర్త (బిల్ క్లింటన్) అమెరికా అధ్యక్షుడిగా ఇండియాలో పర్యటించినప్పుడు గుజరాత్ లోని అక్షరథామ్ ఆశ్రమానికి వెళ్లి ప్రముఖ్ స్వామిని దర్శించుకున్న సంగతిని హిల్లరీ గుర్తుచేసుకున్నారు. ఆయన కర్మ సిద్ధాంత ప్రవచనంతో భారత్, అమెరికా సహా ప్రపంచమంతటా శాంతి సమాధానాలు నెలకొల్పేందుకు కృషిచేశారని కీర్తించారు. ఇదికాక, అమెరికాలోని పలు నగరాల్లోనూ ప్రముఖ్ స్వామి సంస్మరణ సభలు జరిగాయి.
గుజరాత్ లోని గాంధీ నగర్, ఢిల్లీ నగరాల్లోనే కాక ప్రపంచంలోని ప్రముఖ నగరాల్లో అక్షరథామ్ ఆలయాలను నిర్మించి, ఆధ్యాత్మిక ప్రచారం కొనసాగించిన గురువు ప్రముఖ్ స్వామి (95) ఆగస్టు 12న కన్నుమూసిన సంగతి తెలిసిందే. స్వయంగా 18 ఏళ్లు దీక్ష చేసిన ఆయన.. తన జీవితకాలంలో 800 మంది యువతకు సన్యాసదీక్ష ప్రసాదించారు. ఇక ప్రముఖ్ స్వామి తనకు గురువేకాదు, తండ్రిలాంటివారన్న ప్రధాని మోదీ.. స్వామీజీ అంత్యక్రియలకు హాజరైనప్పుడు కంటతడిపెట్టారు.