ఆ ఆలయానికి మూడొందల ఏళ్లు
ముంబయి: శరవేగంగా మార్పు చెందుతున్న నగరాల్లో ముంబయి నగరం ఎప్పుడూ ముందుటుంది. అక్కడ ఎన్నో మారుతుంటాయి. నివాసాలు, కాలనీలు చూస్తుండగానే కొత్త రూపును సంతరించుకుంటుంటాయి. అలాంటిది ఒక నిర్మాణం మాత్రం 300 ఏళ్లుగా చెక్కుచెదరకుండా ఎప్పుడు చూసినా అదే కొత్తదనంతో తాజాగా కనిపిస్తోంది. అదే ప్రభాదేవీ మందిరం. ఈ ఆలయం అంతగా చెప్పుకోదగినంత పెద్దదికాకపోయినప్పటికీ.. ఎలాంటి మార్పులకు లోనుకాకుండా.. బుధవారం నాటికి 300 సంవత్సరాలకు చేరుకుంది.
ప్రభాదేవీ కాలనీ ప్రాంతంలో ఉన్న ఈ ఆలయం ఎదురుగా రిలయన్స్ డిజిటల్ ఎక్స్ ప్రెస్ భవనం కూడా ఉంది. ముంబయిలో ఎన్నో ప్రాంతాలు మారినట్లుగానే ప్రస్తుతం ప్రభాదేవీ మందిరం చుట్టుపక్కల నిర్మాణాలు కూడా వేగంగా మార్పు చెందుతున్నాయి. కానీ వీటన్నింటి మధ్య ఉన్న ఈ ఆలయం 300 ఏళ్లుగా అదే రూపంతో అలరారుతుండటం విశేషం. ఈ ఆలయ ట్రస్టీ మిలింద్ వాజ్కర్ ఈ విషయంపట్ల సంతోషం వ్యక్తం చేస్తూ బుధవారం ఆలయాన్ని ప్రత్యేక పూజలకోసం ఉదయం 8గంటల నుంచి 2 గంటలవరకు తెరిచి ఉంచుతామన్నారు.