ఇల్లు అమ్మితే పన్ను కట్టాలా? | Home holding periods inflation | Sakshi
Sakshi News home page

ఇల్లు అమ్మితే పన్ను కట్టాలా?

Published Mon, Oct 17 2016 1:14 AM | Last Updated on Mon, Sep 4 2017 5:25 PM

ఇల్లు అమ్మితే పన్ను కట్టాలా?

ఇల్లు అమ్మితే పన్ను కట్టాలా?

 లాభాలపై ‘టర్మ్’ ఆధారంగా పన్ను
 లాంగ్‌టర్మ్ అయితే 20 శాతానికే పరిమితం

 
 (సాక్షి, పర్సనల్ ఫైనాన్స్ విభాగం) :  ఆస్తిని అమ్మినప్పుడు పెద్ద ఎత్తున నగదు చేతులు మారుతుంటుంది. అమ్మే వారికి భారీగా నగదు చేతికొస్తుంది. మరి దీనిపై పన్ను కట్టాలా? దీన్నెలా లెక్కిస్తారు? ఇల్లో, ఫ్లాటో అమ్మినవారందరికీ ఇలాంటి సందేహాలే ఉంటాయి. అవన్నీ వివరిస్తూ... పన్ను నిపుణులిస్తున్న సలహా ఇదిగో...
 
 మీరు ఆస్తికొని మూడేళ్ల లోపే అయింది. దీనిని ఇప్పుడు అమ్మేశారు. కాబట్టి ఈ లావాదేవీపై వచ్చిన లాభం స్వల్పకాలిక షార్ట్-టర్మ్ క్యాపిటల్ గెయిన్ కిందకు వస్తుంది. యజమాని మొత్తం ఆదాయం, అతని శ్లాబ్ రేటుకు అనుగుణంగా ఇది అమలవుతుంది. అటువంటి ఆదాయం వార్షికంగా రూ.10 లక్షలకుపైన ఉంటే, సంబంధిత అమ్మకం నుంచి వచ్చే లాభంపై 30 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది.

కొనుగోలు చేసిన మూడు ఆర్థిక సంవత్సరాల తరవాత గనక ఇంటిని విక్రయిస్తే... దానిపై వచ్చే లాభాన్ని దీర్ఘకాలిక క్యాపిటల్ గెయిన్స్‌గా పరిగణిస్తారు. ఈ మేరకు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ప్రయోజనాలు లభిస్తాయి. ఇండెక్షేషన్ (ఇంటి హోల్డింగ్ పిరియడ్‌లో ద్రవ్యోల్బణం, తదనుగుణంగా కొనుగోలు ధరల పరిశీలన) పరిగణనలోకి తీసుకుని, దీనికి లోబడి 20 శాతం పన్ను భారమే పడుతుంది. 80సీ కింద ప్రిన్సిపల్ రీమేమెంట్ విషయంలో అలాగే స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ వంటి అంశాలపై ట్యాక్స్ డిడక్షన్ క్లెయిమ్ చేసుకోవచ్చు. లాంగ్‌టర్మ్ క్యాపిటల్ గెయిన్స్‌కు సంబంధించి కంప్యూటరీకరణ విషయంలో రిపేర్లు, ఆధునికీకరణ వంటి అంశాలను అన్నింటినీ జోడించుకోవచ్చు.
 
 పన్ను భారాలు తగ్గించుకునేదిలా..
 ఠ మీకు వచ్చిన మొత్తంతో మరో ఇంటిని రెండేళ్లలో కొనుగోలు చేసినా లేక మూడేళ్లలో మరో ఇంటిని కట్టించుకున్నా పన్ను భారం ఉండదు. మొదటి ఇంటిని అమ్మే ఏడాదికి ముందు మరో ఇంటిని కొన్నా కూడా పన్ను ప్రయోజనం లభిస్తుంది. అయితే ఇంటిని అమ్మిన వ్యక్తిపేరే కొత్త ఇల్లు కూడా ఉండాలి.
 
 మీరు ఒకవేళ ఇంటిని విక్రయించారు. తద్వారా మీకు వచ్చిన లాభాన్ని తిరిగి మరో ఆస్తి కొనుగోలుకు వెచ్చించడం మీకిష్టంలేదు. అలాంటపుడు కూడా మీకు ఒక అవకాశం ఉంటుంది. ఇల్లు అమ్మిన ఆరు నెలల లోపు ఎన్‌హెచ్‌ఏఐ, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ బాండ్లలో మూడేళ్ల కాలానికి లాంగ్‌టర్మ్ క్యాపిటల్ గెయిన్స్‌గా ఇన్వెస్ట్ చేయొచ్చు. దీనిపై సెక్షన్ 54 (ఈసీ) కింద పన్ను మినహాయింపు పొందవచ్చు. అయితే ఒక ఆర్థిక సంవత్సరంలో ఒకరు రూ.50 లక్షల విలువైన బాండ్లలోనే ఇన్వెస్ట్ చేయగలుగుతారు. అమ్మకందారు పూర్తి లాంగ్‌టర్మ్ క్యాపిటల్ గెయిన్‌ను టెక్నాలజీ ఆధారిత స్టార్టప్‌లో సైతం పెట్టుబడిగా పెట్టి, పన్ను  భారం తగ్గించుకునే వీలుంది.  
 
 టీడీఎస్ సంగతి...
 ఏ దశలోనూ పన్ను ఎగవేతలు జరక్కుండా ప్రభుత్వం  ఈ విషయంలో తగిన చర్యలు తీసుకుంది.  రూ.50 లక్షల పైన ఇంటిని కొనుగోలు చేసినప్పుడు కొనుగోలు దారు నుంచి సోర్స్ వద్ద పన్ను కోత (టీడీఎస్) వసూలును ప్రభుత్వం స్పష్టంగా నిర్దేశించింది. అమ్మకందారుకు పేమెంట్‌కు ముందే టీడీఎస్ అమలవుతుంది. ఈ పేమెంట్ అమ్మకందారు పేరుపై జరుగుతుంది. దీనితో ఇది సంబంధిత అమ్మకందారు పాన్‌కు కూడా అనుసంధానమై ఉండడం వల్ల, ఫామ్ 26ఏఎస్‌పై ఇది ప్రతిబింబిస్తుంటుంది. కొనుగోలుదారు నుంచి అమ్మకందారు తప్పనిసరిగా టీడీఎస్ సర్టిఫికెట్‌ను పొందాల్సి ఉంటుంది.  ఇంటి అమ్మకంపై నష్టం లేదా లాంగ్‌టర్మ్  గెయిన్స్ నుంచి మినహాయింపు సందర్భాల్లో అమ్మకందారు టీడీఎస్ రిఫండ్‌ను క్లెయిమ్ చేసే వీలుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement