హృతిక్ రోషన్‌కు ఈ మధ్య ఏదీ కలిసిరావడం లేదు. ఈ ఏడాది ప్రారంభంలో ఆయనకు భార్య విడాకులు ఇచ్చేసింది. ఆ వెంటనే కంగనా రనౌత్-హృతిక్ గొడవ మీడియాలో రచ్చరచ్చ చేసింది. ఈ ఇద్దరి మధ్య జరిగిన అనేక ఆంతరంగిక విషయాలు వెలుగుచూశాయి. ఇది ఇలా ఉండగానే హృతిక్ రోషన్ ఎన్నో ఆశలు పెట్టుకున్న 'మొహెంజోదారో' సినిమా వచ్చింది. అశుతోష్ గోవరికర్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ చారిత్రక సినిమా బాక్సాఫీస్‌కు నిప్పు పెట్టింది. సినిమా ప్లాప్ అవ్వడం హృతిక్‌ను నిరాశ పరిచింది.
ఈ క్రమంలోనే ఓ పిల్ల హ్యాకర్ హృతిక్ ఫేస్‌బుక్ పేజీతో ఆటలు ఆడుకున్నాడు. హృతిక్ అధికారిక పేజీని హ్యాక్ చేయడమే కాదు.. ప్రొఫైల్ ఫొటోలో తన ఫొటో పెట్టుకొని మురిసిపోయాడు. ఫేస్‌బుక్ లైవ్ వీడియో ఆన్‌చేసి.. కాసేపు హృతిక్ అభిమానుల్ని పలుకరించాడు. ఒకింత వింతగా, విచిత్రంగా ప్రవర్తిస్తూ కొన్ని నిమిషాలపాటు లైవ్ వీడియోలో కనిపించిన అతను.. ఎట్టకేలకు దానిని క్లోజ్ చేశాడు. ఈ హ్యాకర్ వింత ప్రవర్తన నెటిజన్లను ఒకరకంగా గిలిగింతలు పెట్టింది.
తన ఫేస్‌బుక్ పేజీ హ్యాకింగ్‌కు గురైన విషయాన్ని గుర్తించిన హృతిక్ వెంటనే దానిని డియాక్టివేట్ చేశాడు. ఎవరో ఓ వ్యక్తి తన ఫేస్‌బుక్ పేజీని హ్యాక్ చేశాడని, దీంతో దానిని సరిచేసేందుకు చర్యలు తీసుకున్నామని హృతిక్ ట్విట్టర్‌లో తెలిపాడు.