![టీడీపీ నేత వద్ద భారీగా పట్టుబడిన నగదు! - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/3/51424554562_625x300.jpg.webp?itok=IAbPaCvg)
టీడీపీ నేత వద్ద భారీగా పట్టుబడిన నగదు!
చాగలమర్రి: కర్నూలు జిల్లా చాగలమర్రి మండలం పెద్దమకాను గ్రామానికి చెందిన ఓ వ్యక్తి నుంచి పోలీసులు మంగళవారం అర్ధరాత్రి భారీగా నగదు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. పోలీసులు అర్ధరాత్రి సమయంలో తనిఖీలు నిర్వహిస్తుండగా ఓ వ్యక్తి బ్యాగుతో ఎదురు రాగా ఆపి తనిఖీలు చేశారు. బ్యాగులో పెద్ద ఎత్తున నగదు ఉండడంతో అతడ్ని అదుపులోకి తీసుకుని వెంటనే ఆళ్లగడ్డ ఏఎస్పీ రవికృష్ణ వద్దకు తరలించినట్టు తెలుస్తోంది. పోలీసులు మాత్రం దీన్ని ధ్రువీకరించడం లేదు.
కాగా ఆ వ్యక్తి నుంచి రూ.40 వేలే పట్టుబడినట్టు చెబుతుండగా... స్థానికులు మాత్రం రూ.20 లక్షల నుంచి రూ.30 లక్షల వరకూ ఉంటుందంటున్నారు. పోలీసులు వాదన ప్రకారం చూస్తే రూ.40వేలకే ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని ఏఎస్పీ వద్ద ప్రవేశపెడతారా? అన్న దానికి సమాధానం లభించాల్సి ఉంది. కాగా, పట్టుబడిన ఆ వ్యక్తి టీడీపీ నేతగా స్థానికులు చెబుతున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.