హైదరాబాద్‌లో బీఎండబ్ల్యూ ఎం స్టూడియో!
రెండు కొత్త కార్లు మార్కెట్లో
ఎక్స్5 ఎం@ రూ.1.5 కోట్లు
ఎక్స్6 ఎం@ రూ.1.6 కోట్లు
చెన్నై: జర్మనీ లగ్జరీ కార్ల కంపెనీ బీఎండబ్ల్యూ వచ్చే ఏడాది హైదరాబాద్‌లో ఎం స్టూడియోను ఏర్పాటు చేయనున్నది. బీఎండబ్ల్యూ కంపెనీ సూపర్ లగ్జరీ కార్లను ఎం స్టూడియో అవుట్‌లెట్ ద్వారా విక్రయిస్తోంది. ఇలాంటి అవుట్‌లెట్ దేశంలో ఒకటే, ముంబైలో ఉందని కంపెనీ తెలిపింది. వచ్చే ఏడాది హైదరాబాద్‌తో పాటు ఢిల్లీ, చెన్నై, బెంగళూరుల్లో ఏర్పాటు చేస్తామని వివరించారు. బీఎండబ్ల్యూ గ్రూప్ ఇండియా ప్రెసిడెంట్ ఫిలిప్ వాన్ సర్ చెప్పారు. ఇక ఈ కంపెనీ గురువారం రెండు పెర్ఫామెన్స్ స్పోర్ట్స్ కార్లను మార్కెట్లోకి తెచ్చింది. ఎక్స్‌డ్రైవ్ సెగ్మెంట్ నుంచి ఎక్స్5 ఎం(ధర రూ.1.5 కోట్లు), ఎక్స్6 ఎం(ధర రూ.1.6 కోట్లు) కార్లను కొత్తగా అందిస్తున్నామని, బుకింగ్స్ గురువారం నుంచే ప్రారంభించామని ఫిలిప్ వాన్ చెప్పారు.
ఈ కార్లలో 8-సిలిండర్ల పెట్రోల్ ఇంజిన్లను అమర్చామని, సున్నా నుంచి వంద కిలీమీటర్ల వేగాన్ని 4.2 సెకన్లలోనే అందుకుంటాయని, గరిష్ట వేగం గంటకు 250 కిమీ అని పేర్కొన్నారు. ఫోర్ వీల్ డ్రైవ్, బ్రేక్ ఎనర్జీ రీజనరేషన్, 8 ఎం స్టెప్‌ట్రానిక్ ట్రాన్స్‌మిషన్, తదితర ప్రత్యేకతలున్నాయని చెప్పారు. ఈ కార్లను మ్యూనిక్ ప్లాంట్(జర్మనీ) నుంచి దిగుమతి చేసుకొని విక్రయిస్తామని వివరించారు. ఇప్పటివరకూ ఈ ఏడాది 14 కొత్త మోడళ్లను అందుబాటులోకి తెచ్చామని, డిసెంబర్‌లో మరో కొత్త మోడల్‌ను తెస్తామని చెప్పారు.