
ఇండియన్ ఐడల్‌లో రో‘హిట్’
- టాప్–8 వరకు చేరిన పి.రోహిత్
- అత్తమ్మ రమణి స్ఫూర్తితో సింగర్‌గా..
- వివిధ తెలుగు చానళ్ల పాటల పోటీల్లో విజేత
- ఓటుతో తనకు అండగా ఉండాలని సిటీవాసులకు పిలుపు
సాక్షి, హైదరాబాద్: ఇండియన్ ఐడల్‌లో నగర యువ గాయకుడు పి.రోహిత్ గానామృతంతో హైదరాబాద్ పేరును మార్మోగిస్తున్నాడు. అత్తమ్మ ద్రోణం రాజు రమణి రేడియోలో పాటలు విన్నప్పటి నుంచే ఆమె స్ఫూర్తిగా చిన్నతనం నుంచే గొంతు సవరించుకున్న ఈ 24 ఏళ్ల కుర్రాడు... పాడుతా తీయగా, సూపర్ సింగర్ 9, స్టార్ సింగర్ వంటి తెలుగు సంగీత షోల్లో విజేతగా నిలిచాడు. ప్రస్తుతం సోనీ టీవీలో ప్రసారమయ్యే ఇండియన్ ఐడల్‌లో చాలా మందిని వెనక్కి నెట్టి టాప్–8 స్థాయి వరకు చేరుకున్నాడు. ఆదివారం రాత్రి 8 నుంచి 9 గంటల వరకు జరిగే ఈ షోలో తన పాటలతో మైమరిపించేందుకు సిద్ధమవుతున్న ఈ యువకుడిని ‘సాక్షి’ పలకరించింది.
ఇష్టంతో పాటల వైపు...
మా పెద్ద అత్తమ్మ ద్రోణం రాజు రమణి రేడియోలో పాటలు పాడుతుంటే వినేవాణ్ని. ఆ పాటలకు ఎంతో మైమరిచిపోయా. అప్పటి నుంచే ఓ ప్రొఫెషనల్ సింగర్ అవ్వాలని నిర్ణయించుకున్నా. నేషనల్ శాంపుల్ సర్వే ఆఫీసు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసే నాన్న కృష్ణ, గృహిణి అయిన అమ్మ సుధా కూడా నా ఇష్టాన్ని గుర్తించి ప్రోత్సహించారు. మా ఫ్యామిలీ విద్యానగర్‌లో ఉంటుంది. హిమాయత్‌నగర్‌లోని హోవర్డ్ పబ్లిక్ స్కూల్‌లో పదో తరగతి వరకు చదివా. పర్వతాపూర్ అరోరా ఇంజినీరింగ్ కాలేజ్‌లో బీటెక్ చదివా. క్లాసికల్ గురువు అయినా భాస్కర్ వైజర్స్ బాలసుబ్రహ్మణ్యం వద్ద సంగీతం బాగా సాధన చేశా. ఆ తర్వాత తెలుగు చానళ్లలోని వివిధ పాటల కార్యక్రమాల్లో పాల్గొని విజేతగా నిలిచా. ఇటీవల విడుదలైన శతమానం భవతి మూవీలో నేను పాడిన ‘భగభగ భోగీ మంటలే’ పాటకు ప్రేక్షకుల నుంచి ఆదరణ రావడం లైఫ్‌లో మరచిపోలేను. ఒక్కడున్నాడు, బహుబలిలో కోరస్, బ్యాక్‌వోరల్ పాడా. బాహుబలి తమిళ వెర్షన్ సినిమాలోనూ పాటలు పాడా.
మీ వాడిని...ఓటేయండి
ప్రముఖ సోనీ టీవీ ఇండియన్ ఐడల్‌లో టాప్–8లోకి చేరుకున్నా. సెప్టెంబర్ నుంచి ప్రారంభమైన ఈ షోకు ముందు వేలాది మందికి పాటల పోటీ పెట్టి చివరగా 24 మందిని ఎంపిక చేశారు. అలా సెప్టెంబర్ నుంచి ఇప్పటి వరకు వివిధ రౌండ్లలో నెగ్గుతూ టాప్–8కి చేరుకున్నా. నాలో ఉన్న గానామృత ప్రతిభ ప్రదర్శనకు మీరు వేసే ఓటు నన్ను మరింత సుదూరాలకు తీసుకెళ్తుంది. టాప్–8 రౌండ్ ఆదివారం రాత్రి 8 నుంచి 9 గంటల వరకు షో ఉంటుంది. ఆ తర్వాత రాత్రి 9 నుంచి సోమవారం ఉదయం 9 గంటల వరకు ఓటింగ్ లైన్స్ తెరవబడి ఉంటాయి. http://www.sonyliv.comకి వెళ్లవచ్చు. లేదంటే sonyliv యాప్‌ను మొబైల్‌లోని గూగుల్ ప్లే స్టోర్, యాప్ స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఆ తరవాత షోస్, ఇండియన్ ఐడల్, పబ్లిక్ ఓటింగ్‌లోకి కెళ్లి క్యాట్‌లాగ్ నుంచి రోహిత్ పేరును సెలక్ట్ చేసి ఓటు వేయాలి. ఇప్పటికే మన హైదరాబాద్ నుంచి కారుణ్య రన్నర్‌గా, శ్రీరామ్ చంద్ర గతంలో ఇండియన్ ఐడిల్‌లో విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే.