నేను అఖండ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని!
ముంబై: విదర్భ ప్రత్యేక రాష్ట్రం అంశం మరోసారి మహారాష్ట్ర అసెంబ్లీని కుదిపేసింది. ఈ అంశంపై మిత్రపక్షం శివసేన ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌ను టార్గెట్‌గా చేసుకొని విమర్శల దాడి చేశారు. ప్రత్యేక విదర్భపై ఆయన వైఖరి ఏమిటో సభలో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.
దీంతో స్పందించిన సీఎం ఫడ్నవిస్.. తాను ఏ ఒక్క ప్రాంతానికో ముఖ్యమంత్రిని కాదని, అఖండ మహారాష్ట్రకు సీఎంనని తెలిపారు. ప్రత్యేక విదర్భ కోసం రాష్ట్ర ప్రభుత్వం ముందు ఇప్పటికిప్పుడు ఎలాంటి ప్రతిపాదన లేదని చెప్పారు. చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు బీజేపీ అనుకూలమని, అయితే, విదర్భ ఏర్పాటును శివసేన వ్యతిరేకిస్తున్నదన్నారు. ఈ రెండు పార్టీలూ ప్రభుత్వంలో ఉండటంతో ప్రభుత్వం ఈ విషయంలో ఎలాంటి వైఖరి తీసుకోలేదని చెప్పారు.
ప్రత్యేక రాష్ట్ర విషయంలో తాను రాజీనామా చేయాలన్న ప్రతిపక్ష ఎన్సీపీ డిమాండ్‌ను కూడా ఫడ్నవిస్ తోసిపుచ్చారు. ఎన్సీపీ కోరితే కాదు ప్రజలు కోరితే తాను రాజీనామా చేస్తానని చెప్పారు. మరోవైపు అసెంబ్లీలో ప్రత్యేక విదర్భ అనుకూల నినాదాలు చేసిన ఎమ్మెల్యేలపై దేశద్రోహం కేసు పెట్టాలంటూ శివసేన సభ్యులు ఆందోళనకు దిగారు. అయితే, చిన్న రాష్ట్రాల ఏర్పాటు కోసం సభ్యులు కోరవచ్చునని, అందుకు రాజ్యాంగం అనుమతి ఇచ్చిందని, కాబట్టి ఈ విషయంలో సభ్యులపై చర్యలు తీసుకోబోమని సీఎం స్పష్టం చేశారు.