
మీడియా కథనాలు చూసి షాక్ తిన్నాను!
న్యూఢిల్లీ: విద్వేష ప్రసంగాలు చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇస్లామిక్ మత ప్రబోధకుడు జకీర్ నాయక్ ఎట్టకేలకు స్పందించారు. హింస, ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా దానిని తాను సమర్థించబోనని ఆయన చెప్పారు. ఏ ఉగ్రవాద సంస్థకు తాను ఎన్నడూ మద్దతునివ్వలేదని చెప్పారు. తాను చేసిన ప్రకటనలను సందర్భానుసారం తీసుకోకుండా హింస కోసం ఎవరైనా ఉపయోగించుకుంటే దానిని తాను ఖండిస్తానని అన్నారు.
ఢాకా ఉగ్రవాద పేలుళ్ల విషయంలో తనపై విచారణల జరుపుతున్న మీడియా తీరును చూసి షాక్ తిన్నానని ఆయన చెప్పారు. ఈ విషయంలో భారతీయ దర్యాప్తు ఏజెన్సీలకు సహకరించేందుకు సిద్ధమని, ఎలాంటి సమాచారం కావాలన్నా ఇస్తానని తెలిపారు. ఇంతవరకు భారత అధికారులు తనను సంప్రదించలేదని చెప్పారు. వీలు చిక్కితే తనపై వచ్చిన ఆరోపణలన్నింటికీ సమాధానమిస్తూ ఓ వీడియో తీసి దానిని మీడియాకు ఇస్తానని తెలిపారు.
ప్రస్తుతం సౌదీ అరేబియాలో ఉన్న జకీర్ సోమవారం ముంబైకి రావాల్సి ఉండగా... ఆయన తన రాకను అర్ధంతరంగా వాయిదా వేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో ముంబైలో నిర్వహించాల్సిన ఆయన మీడియా సమావేశం రద్దయింది. గతవారం బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో 22మందిని పొట్టనబెట్టుకున్న ఉగ్రవాద దాడులకు జకీర్ నాయక్ విద్వేషపూరిత ప్రసంగాలు ప్రేరణనిచ్చాయని వెలుగుచూడటంతో ఆయనపై పోలీసులు నజర్ పెట్టిన సంగతి తెలిసిందే.