క్రికెట్ వరల్డ్ కప్: టీమిండియా శుభారంభం
- తొలి మ్యాచ్‌లో ఆతిథ్య ఇంగ్లండ్‌ను చిత్తుచేసిన మిథాలీ సేన
డెర్బీ: మహిళల క్రికెట్ వన్డే ప్రపంచ కప్ టోర్నీలో టీమిండియా శుభారంభం చేసింది. శుక్రవారం డెర్బీలో జరిగిన మ్యాచ్‌లో ఆతిథ్య ఇంగ్లండ్‌పై 35 పరుగుల తేడాతో సూపర్ విక్టరీ సాధించింది. టీమిండియా విసిరిన 281 పరుగుల భారీ లక్ష్యాన్ని సాధించాల్సిఉండగా బ్రిటిష్ జట్టు 47.3 ఓవర్లలో 246 పరుగులకే ఆలౌట్ అయింది.
ఓపెనర్లు బీమౌంట్(14), టేలర్(22) ఆశించినమేర రాణించలేదు. అయితే వన్‌డౌన్ బ్యాట్స్‌ఉమన్ నైట్(46), ఐదో స్థానంలో బ్యటింగ్‌కు దిగిన విల్సన్(81)లు భారత బౌలర్లను ధాటిగా ఎదుర్కొన్నారు. 32వ ఓవర్లో నైట్ అనూహ్యంగా రనౌట్ అయింది. ఆ తర్వాత నుంచి క్రమం తప్పకుండా వికెట్లు పడిపోయాయి. 44వ ఏడో వికెట్‌గా విల్సన్ రనౌట్ కావడంతో భారత్ విజయం దాదాపు ఖరారైంది. మిగిలిన మూడు వికెట్లు కూడా టపటపా రాలిపోవడంతో లాంఛనం పూర్తయింది. భారత బౌలర్లలో శర్మకు 3 వికెట్లు దక్కగా, పాండే 2, పూనమ్ యాదవ్ ఒక వికెట్ నేలకూల్చారు.
అంతకుముందు టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన భారత మహిళలు నిర్ణీత ఓవర్లలో 50 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 281 పరుగులు సాధించింది. ఓపెనర్లు రౌత్(86), మంధన(90) చెలరేగి ఆడారు. కెప్టెన్ మిథాలీ రాజ్(71) మెరుపు వేగంతోనూ, కౌర్ 24 పరుగులతోనూ రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో నైట్‌కు రెండు వికెట్లు దక్కగా, హజెల్ ఒక్క వికెట్ పడగొట్టారు.
మరో మ్యాచ్‌లో న్యూజిలాండ్ జయభేరి
వరల్డ్ కప్‌లో భాగంగానే జరిగిన మరో మ్యాచ్‌లో శ్రీలంకపై న్యూజిలాండ్ తొమ్మిది వికెట్ల తేడాతో విజయం సాధించింది. బ్రిస్టల్‌లో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 188 పరుగులు సాధించింది. 7.4 ఓవర్లలో ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయిన కివీస్ 189 పరుగులు చేసి విజయం సాధించింది.