ఐసీఐసీఐ బ్యాంక్ లాభం 13% అప్
ముంబై: ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ నికరలాభం అక్టోబర్-డిసెంబర్(క్యూ3)లో 13% వృద్ధితో రూ. 2,532 కోట్లను తాకింది. ఇందుకు వడ్డీ ఆదాయం, ట్రెజరీ లాభాలు పుంజుకోవడం సహకరించింది. అయితే గత నాలుగేళ్ల కాలంలో లాభాల్లో ఇంత తక్కువ వృద్ధి నమోదుకావడం ఇదే తొలిసారి. ఈ కాలంలో నికర వడ్డీ ఆదాయం(ఎన్‌ఐఐ) 22% ఎగసి రూ. 4,255 కోట్లను తాకింది.
ఈ బాటలో వడ్డీయేతర ఆదాయం మరింత అధికంగా 26% ఎగసి రూ. 2,801 కోట్లను చేరింది. దీనిలో రూ. 1,397 కోట్ల ట్రెజరీ లాభాలు కలసి ఉన్నాయి. గతంలో ఇవి రూ. 934.5 కోట్లు మాత్రమే. బ్యాంక్ మొత్తం ఆదాయం రూ. 12,353 కోట్ల నుంచి రూ. 14,256 కోట్లకు పుంజుకుంది. ఇక క్యూ3లో కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన నికర లాభం 9% పెరిగి రూ. 2,872 కోట్లయ్యింది. బీమా అనుబంధ కంపెనీలు రెండూ మంచి పనితీరును ప్రదర్శించడం దీనికి దోహదపడింది.
3.32% మార్జిన్లు
ప్రస్తుత సమీక్షా కాలంలో నికర వడ్డీ మార్జిన్లు(ఎన్‌ఐఎం) 3.07% నుంచి 3.32%కు బలపడినట్లు బ్యాంక్ చైర్మన్ చందా కొచర్ తెలిపారు. ఇకపై కూడా ఇదే స్థాయిలో లాభదాయకతను నిలుపుకోగలమని భావిస్తున్నట్లు చెప్పారు. పన్ను బకాయిలకింద గడిచిన తొమ్మిది నెలలకుగాను రూ. 210 కోట్లను అదనంగా కేటాయించడంతో లాభాలు పరిమితమైనట్లు తెలిపారు. ఆర్‌బీఐ నిబంధనలకు అనుగుణంగా ప్రతీ క్వార్టర్‌లోనూ రూ.70 కోట్లు కేటాయించనున్నట్లు వెల్లడించారు.
మొండిబకాయిలకు రూ. 695 కోట్లను ప్రొవిజనింగ్ చేశామని, గతంలో ఈ పద్దుకింద రూ. 625 కోట్లు కేటాయించామన్నారు. 16% అధికంగా రుణ మంజూరీని చేయగా, డిపాజిట్లు 11% పెరిగాయని తెలిపారు. ఆర్‌బీఐ ప్రత్యేక విండో ద్వారా 200 కోట్ల డాలర్ల(సుమారు రూ. 12,400 కోట్లు) విదేశీ కరెన్సీ డిపాజిట్లను సమీకరించడంతో ఈ డిపాజిట్ల వృద్ధి సాధ్యపడిందన్నారు. బ్యాంకు స్థూల ఎన్‌పీఏలు అంతక్రితం క్వార్టర్‌తో పోలిస్తే 6 బేసిస్ పాయింట్లు తగ్గి 3.05%కి చేరగా, నికర ఎన్‌పీఏలు 9 బేసిస్ పాయింట్ల పెరుగుదలతో 0.94 శాతానికి ఎగిసాయి.
వడ్డీ రేట్లు పెంచం..
రిజర్వ్ బ్యాంక్ తాజాగా రెపో రేటును 0.25% పెంచినప్పటికీ వడ్డీ రేట్లను పెంచే ఆలోచన లేదు. స్వల్పకాలిక నిధులకు అంతగా ప్రాధాన్యత ఇవ్వం. ప్రస్తుతం డిపాజిట్ వ్యయాలు స్థిరంగా ఉన్నాయి. దీంతో రుణాలపై వడ్డీ రేట్లలో మార్పులు చేయబోం. ఇక ఏటీఎం లావాదేవీలపై చార్జీల విషయంపై రిజర్వ్ బ్యాంక్ మార్గదర్శకాలకు అనుగుణంగా స్పందిస్తాం. - చందా కొచర్, ఐసీఐసీఐ చీఫ్