చెన్నై, సాక్షి ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్‌ను రెండుగా విభజించే క్రమంలో తిరుపతి, శ్రీకాళహస్తి సహా 8 మండలాలను తమిళనాడులో కలపాలని పట్టాళి మక్కల్ కట్చీ (పీఎంకే) అధినేత రాందాస్ డిమాండ్ చేశారు. భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా 1956లో విభజన జరిగినప్పుడు తమిళులు అధికంగా నివసించే 32 వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోని 300 గ్రామాలు ఆంధ్రప్రదేశ్‌లో కలిసిపోయూయని తెలిపారు. ఆ రోజుల్లోనే తీవ్రంగా వ్యతిరేకించడంతో తిరుత్తణి, పళ్లిపట్టులోని కొంతభాగాన్ని తిరిగి తమిళనాడులో కలిపారని గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో నివసించడం వల్ల విద్య, ఉద్యోగాలు, రాజకీయపరమైన హక్కులను తమిళులు కోల్పోయారని చెప్పారు. తమను తమిళనాడులో కలపాలని కోరుతూ ఆంధ్ర సరిహద్దులోని 75 శాతం పంచాయతీలు తీర్మానాలు ఆమోదించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి పంపాయన్నారు. గతంలో తమిళనాడుకు ఏర్పడిన నష్టాన్ని సవరించేందుకు ఇదే సరైన సమయమని తెలిపారు. ఈ అంశాన్ని కేంద్రం వెంటనే పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు.
తిరుపతిని తమిళనాడులో కలపాలి: రాందాస్
Published Sun, Aug 11 2013 1:44 AM | Last Updated on Fri, Sep 1 2017 9:46 PM
Advertisement