ఢిల్లీకి ఇఖ్లాక్ కుటుంబం
దాద్రీ: ఉత్తరప్రదేశ్‌లోని దాద్రీ తాలూకా బిషాదా గ్రామంలో పశుమాంసం తిన్నాడన్న ఆరోపణలతో గ్రామస్తుల దాడిలో మరణించిన మహ్మద్ ఇఖ్లాక్ కుటుంబం గ్రామాన్ని వదిలి ఢిల్లీకి చేరుకుంది. కేవలం అనుమానంతో తన తండ్రిని చంపేశారని, ఇక గ్రామంలో ఉండలేమని ఇఖ్లాక్ కుమారుడు సర్తాజ్ బుధవారం తెలిపారు. ఇకపై ఢిల్లీలోనే ఉంటామన్నారు. ఇఖ్లాక్ హంతకులపై జాతీయ భద్రతాచట్టాన్ని ప్రయోగించాలని, ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారించాలని ఇఖ్లాక్ తమ్ముడు జాన్ డిమాండ్ చేశారు.
తుపాకులిస్తాం: యోగి ఆదిత్యనాథ్
బిషాదా గ్రామంలో ఉద్రిక్తతలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. జయప్రకాశ్ అనే బిషాదావాసి అనుమానాస్పద మృతి నేపథ్యంలో బీజేపీ ఎంపీ యోగి ఆదిత్యనాథ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పోలీసుల వేధింపులను ఎదుర్కొంటున్న మెజారిటీ వర్గీయులకు తుపాకులను ఇవ్వటంతో పాటు అన్ని రకాల సహాయాన్ని అందిస్తామని ఆదిత్యనాథ్ అన్నారు. వీహెచ్‌పీ నాయకురాలు సాధ్వి ప్రాచీ బుధవారం బిషాదాలోకి వెళ్లటానికి చేసిన ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు గ్రామంలో భద్రత కట్టుదిట్టం చేశారు. దాద్రీ ఘటనకు నిరసనగా కొట్టాయంలోని కాలేజ్ ఆఫ్ కేరళ క్యాంపస్‌లో బీఫ్ పండుగ నిర్వహించినందుకు.. 10 మంది విద్యార్థులపై క్రమశిక్షణాచర్యలు తీసుకోవాలని యాజమాన్యం నిర్ణయించింది.