Mohammed ikhlak
-
ప్రభుత్వాన్నైనా త్యాగం చేస్తాం
దాద్రీ బాధ్యులపై కఠిన చర్యలు: ములాయం ఓ పార్టీకి చెందిన ముగ్గురుఈ కుట్ర చేశారు ముజఫర్‌నగర్ అల్లర్లకూ వారే కారణం మతతత్వ శక్తుల ఆటలు సాగనీయబోమని వ్యాఖ్య లక్నో: గోమాంసం తిన్నారనే ఆరోపణతో మహమ్మద్ ఇఖ్లాక్ అనే వ్యక్తిని హత్యచేసిన ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని.. అవసరమైతే యూపీలో తమ ప్రభుత్వాన్ని సైతం త్యాగం చేస్తామని సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ ములాయంసింగ్ యాదవ్ పేర్కొన్నారు. గురువారం లక్నోలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘దాద్రీ ఘటన ముందస్తు ప్రణాళిక ప్రకారం చేసిన కుట్ర. బాధ్యుల పేర్లు త్వరలోనే బయటకు వస్తాయి. నాకున్న సమాచారం మేరకు ఒక పార్టీకి చెందిన ముగ్గురు వ్యక్తులు ఈ దారుణ హత్య వెనుక ఉన్నారు. పార్టీ బృందాన్ని దాద్రీకి పంపుతాం. అప్పుడు ఆ ముగ్గురు ఎవరనేది వెల్లడవుతుంది. బాధ్యులను గుర్తించగానే కఠిన చర్యలు చేపడతాం. ప్రభుత్వం నుంచి ఏ త్యాగమైనా చేస్తాం. అవసరమైతే మా ప్రభుత్వాన్నే త్యాగంచేస్తాం.’ అని ములాయం పేర్కొన్నారు. కాగా బిషదా గ్రామంలో ఐదు తరాలుగా నివసిస్తున్నామని, అక్కడి నుంచి తాము శాశ్వతంగా వలస వెళ్లిపోయే ఆలోచనేమీ లేదని ఇఖ్లాక్ సోదరుడు జమీల్ చెప్పారు. ఇక దాద్రీ ఘటనకు సంబంధించి సోషల్ మీడియాలో పుకార్లను వ్యాపింపజేస్తున్న ఇద్దరు యువకులను పోలీసులు గురువారం అరెస్టు చేశారు. -
ఢిల్లీకి ఇఖ్లాక్ కుటుంబం
దాద్రీ: ఉత్తరప్రదేశ్‌లోని దాద్రీ తాలూకా బిషాదా గ్రామంలో పశుమాంసం తిన్నాడన్న ఆరోపణలతో గ్రామస్తుల దాడిలో మరణించిన మహ్మద్ ఇఖ్లాక్ కుటుంబం గ్రామాన్ని వదిలి ఢిల్లీకి చేరుకుంది. కేవలం అనుమానంతో తన తండ్రిని చంపేశారని, ఇక గ్రామంలో ఉండలేమని ఇఖ్లాక్ కుమారుడు సర్తాజ్ బుధవారం తెలిపారు. ఇకపై ఢిల్లీలోనే ఉంటామన్నారు. ఇఖ్లాక్ హంతకులపై జాతీయ భద్రతాచట్టాన్ని ప్రయోగించాలని, ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారించాలని ఇఖ్లాక్ తమ్ముడు జాన్ డిమాండ్ చేశారు. తుపాకులిస్తాం: యోగి ఆదిత్యనాథ్ బిషాదా గ్రామంలో ఉద్రిక్తతలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. జయప్రకాశ్ అనే బిషాదావాసి అనుమానాస్పద మృతి నేపథ్యంలో బీజేపీ ఎంపీ యోగి ఆదిత్యనాథ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పోలీసుల వేధింపులను ఎదుర్కొంటున్న మెజారిటీ వర్గీయులకు తుపాకులను ఇవ్వటంతో పాటు అన్ని రకాల సహాయాన్ని అందిస్తామని ఆదిత్యనాథ్ అన్నారు. వీహెచ్‌పీ నాయకురాలు సాధ్వి ప్రాచీ బుధవారం బిషాదాలోకి వెళ్లటానికి చేసిన ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు గ్రామంలో భద్రత కట్టుదిట్టం చేశారు. దాద్రీ ఘటనకు నిరసనగా కొట్టాయంలోని కాలేజ్ ఆఫ్ కేరళ క్యాంపస్‌లో బీఫ్ పండుగ నిర్వహించినందుకు.. 10 మంది విద్యార్థులపై క్రమశిక్షణాచర్యలు తీసుకోవాలని యాజమాన్యం నిర్ణయించింది. -
ఇఖ్లాక్ కుటుంబానికి రాహుల్ పరామర్శ
న్యూఢిల్లీ : గ్రేటర్ నోయిడాలోని బిషాదా గ్రామంలో గోమాంసం తిన్నారన్న అనుమానంతో స్థానికుల చేతిలో హత్యకు గురైన మహమ్మద్ ఇఖ్లాక్ కుటుంబాన్ని శనివారం కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పరామర్శించారు. విద్వేష రాజకీయాలు తగవని, ప్రజలను విభజించే ఇలాంటి వాటికి దూరంగా ఉండాలని అనంతరం ట్విటర్లో పిలుపునిచ్చారు. ప్రజలంతా ఐక్యంగా ఉండి ఇలాంటివాటిని తిప్పికొట్టాలని కోరారు. రాహుల్, ఇఖ్లాక్ కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్న ఫొటోలను కాంగ్రెస్ ట్విటర్లో పోస్ట్ చేసింది. ఈ ఘటనపై ప్రధాని నరేంద్రమోదీ మౌనాన్ని వీడి జరిగిన దారుణాన్ని ఖండించాలని డిమాండ్ చేసింది. స్థానికుల దాడిలో ఇఖ్లాక్ చిన్నకుమారుడు దానిష్ తీవ్రంగా గాయపడ్డం తెలిసిందే. ఇఖ్లాక్ కుటుంబానికి ప్రకటించిన రూ. 20 లక్షలకు పెంచుతున్నట్లు యూపీ సీఎం అఖిలేశ్ యాదవ్ తెలిపారు. ఇఖ్లాక్ హత్యలో ప్రధాన నిందితులుగా భావిస్తున్న ఇద్దరు మైనర్లను పోలీసులు అరెస్టు చేశారు. ఇఖ్లాక్ కుటుంబాన్ని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కూడా పరామర్శించారు. హిందువులూ బీఫ్ తింటారు:లాలూ పట్నా: ఇఖ్లాక్ హత్య నేపథ్యంలో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హిందువులు కూడా గోమాంసం తింటున్నారని, బీజేపీ, ఆరెస్సెస్‌లు స్వలాభంకోసం దీనికి మతంరంగు పులమడానికి ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు.