ఇఖ్లాక్ కుటుంబానికి రాహుల్ పరామర్శ
న్యూఢిల్లీ : గ్రేటర్ నోయిడాలోని బిషాదా గ్రామంలో గోమాంసం తిన్నారన్న అనుమానంతో స్థానికుల చేతిలో హత్యకు గురైన మహమ్మద్ ఇఖ్లాక్ కుటుంబాన్ని శనివారం కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పరామర్శించారు. విద్వేష రాజకీయాలు తగవని, ప్రజలను విభజించే ఇలాంటి వాటికి దూరంగా ఉండాలని అనంతరం ట్విటర్‌లో పిలుపునిచ్చారు. ప్రజలంతా ఐక్యంగా ఉండి ఇలాంటివాటిని తిప్పికొట్టాలని కోరారు. రాహుల్, ఇఖ్లాక్ కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్న ఫొటోలను కాంగ్రెస్ ట్విటర్‌లో పోస్ట్ చేసింది. ఈ ఘటనపై ప్రధాని నరేంద్రమోదీ మౌనాన్ని వీడి జరిగిన దారుణాన్ని ఖండించాలని డిమాండ్ చేసింది. స్థానికుల దాడిలో ఇఖ్లాక్ చిన్నకుమారుడు దానిష్ తీవ్రంగా గాయపడ్డం తెలిసిందే. ఇఖ్లాక్ కుటుంబానికి ప్రకటించిన రూ. 20 లక్షలకు పెంచుతున్నట్లు యూపీ సీఎం అఖిలేశ్ యాదవ్ తెలిపారు. ఇఖ్లాక్ హత్యలో ప్రధాన నిందితులుగా భావిస్తున్న ఇద్దరు మైనర్లను పోలీసులు అరెస్టు చేశారు. ఇఖ్లాక్ కుటుంబాన్ని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కూడా పరామర్శించారు.
హిందువులూ బీఫ్ తింటారు:లాలూ
పట్నా: ఇఖ్లాక్ హత్య నేపథ్యంలో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హిందువులు కూడా గోమాంసం తింటున్నారని, బీజేపీ, ఆరెస్సెస్‌లు స్వలాభంకోసం దీనికి మతంరంగు పులమడానికి ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు.