మరో ఏడాది సోనియానే
సంస్థాగత ఎన్నికలు సంవత్సరం వాయిదా
ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ, మహిళా వర్గాలకు 50% పార్టీ పదవులు
ఆఫీస్ బేరర్ల పదవీకాలం ఇక మూడేళ్లే; ప్రతీ మూడేళ్లకు సంస్థాగత ఎన్నికలు
క్రీయాశీల సభ్యత్వ పునరుద్ధరణ; సీడబ్ల్యూసీ భేటీలో నిర్ణయాలు
న్యూఢిల్లీ: సంస్థాగత ఎన్నికల నిర్వహణను మరో ఏడాది పాటు వాయిదా వేస్తూ కాంగ్రెస్ అత్యున్నత విధాన నిర్ణాయక బృందం ‘సీడబ్ల్యూసీ’ మంగళవారం ఒక తీర్మానాన్ని ఆమోదించింది. దాంతో సోనియా గాంధీ పార్టీ అధ్యక్షురాలిగా మరో ఏడాది కొనసాగుతారు. అలాగే, సోనియా స్థానంలో పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించబోతున్నారన్న ఊహాగానాలకూ తెరపడింది. సోనియా అధ్యక్షతన 3 గంటలకు పైగా భేటీ అయిన సీడబ్ల్యూసీ పలు కీలక తీర్మానాలను ఆమోదించింది. ఈ సందర్భంగా సోనియా మాట్లాడుతూ.. ప్రధాని మోదీపై నిప్పులు చెరిగారు. మోదీ పాలనలో మాటలే తప్ప చేతలు లేవని ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌ను బలోపేతం చేసేందుకు పార్టీకి మద్దతిచ్చేవారిని పెంచుకోవాలని, సమాజంలో నూతనంగా ఏర్పడుతున్న వర్గాలకు చేరువ కావాలని నేతలకు పిలుపునిచ్చారు. సంస్థాగత ఎన్నికలను ఏడాది వాయిదా వేయాలన్న నిర్ణయం నేపథ్యంలో పార్టీ అందుకు ఎన్నికల సంఘం అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. పార్టీ రాజ్యాంగంలో కొన్ని కీలక సవరణలను తీసుకురావాల్సి ఉన్నందున సంస్థాగత ఎన్నికల నిర్వహణకు మరింత సమయం అవసరమని ఈసీకి వివరించనుంది. 1998 నుంచి పార్టీ చీఫ్‌గా వ్యవహరిస్తున్న సోనియా సుదీర్ఘ కాలం ఆ బాధ్యతలు నిర్వహించిన వ్యక్తిగా రికార్డు సృష్టించారు. ఈ డిసెంబర్‌తో ఆమె పదవీకాలం ముగియనుండగా, సీడబ్ల్యూసీ తాజా నిర్ణయంతో అది మరో ఏడాది వాయిదా పడింది.
ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ, మహిళా వర్గాలకు పార్టీలో 50% పదవులు కేటాయించాలన్న కీలక ప్రతిపాదనను సీడబ్ల్యూసీ ఆమోదించింది. ఇప్పటివరకు అది 20% మాత్రమే ఉండేది. ఈ మేరకు పార్టీ రాజ్యాంగాన్ని మార్చనున్నారు. పార్టీ సభ్యత్వ కాల పరిమితిని ఐదేళ్ల నుంచి మూడేళ్లకు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీనివల్ల పార్టీ అధ్యక్షుడు లేదా అధ్యక్షురాలు సహా అన్ని ఆఫీస్ బేరర్ పదవుల కాలపరిమితి మూడేళ్లే ఉంటుంది. సంస్థాగత ఎన్నికలను ప్రతీ ఐదేళ్లకు కాకుండా మూడేళ్లకు ఒకసారి నిర్వహించాల్సి ఉంటుంది.
సంస్థాగత ఎన్నికల అనంతరం నిర్వహించే పార్టీ ప్లీనరీలో ఈ మార్పులకు ఒక తీర్మానాన్ని సీడబ్ల్యూసీ ఆమోదిస్తుంది. అనంతరం వీటిని పార్టీ రాజ్యాంగంలో చేరుస్తారు.కాంగ్రెస్‌లో, దాని యువజన(యూత్ కాంగ్రెస్), విద్యార్థి(ఎన్‌ఎస్‌యూఐ), సేవాదళ్, మహిళా కాంగ్రెస్‌లలో కానీ చేరేవారికి ఏక సభ్యత్వ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించారు.క్రీయాశీల సభ్యత్వ విధానాన్ని పునరుద్ధరించాలని నిర్ణయించారు. కనీసం 25 మంది సభ్యులను చేర్పించిన వారికి పార్టీ క్రియాశీల సభ్యత్వం లభిస్తుంది. క్రియాశీల సభ్యులు ఆటోమాటిక్‌గా బ్లాక్ కాంగ్రెస్ కమిటీలో సభ్యులవుతారు. డీసీసీ, పీసీసీ ప్రతినిధులుగా ఎన్నికవడానికి వారే అర్హులు.
పీసీసీ జనరల్ బాడీ కనీసం ఆర్నెల్లలో ఒకసారి, లేదా వీలైనన్ని ఎక్కువ సార్లు భేటీ కావాలని నిర్ణయించారు. డీసీసీ కనీసం నాలుగు నెలలకు ఒకసారి, సబ్ కాంగ్రెస్ కమిటీలు కనీసం మూడు నెలలకు సమావేశం కావాల్సి ఉంటుంది. వీటి కార్యనిర్వాహక కమిటీలు నెలకు ఒకసారైనా భేటీ కావాలి.ఉల్లి సహా నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరగడానికి కారణమైన ద్రవ్యోల్బణం గురించి వివరించాలని సీడబ్ల్యూసీ భేటీలో రాహుల్ మాజీ ఆర్థిక మంత్రి చిదంబరాన్ని కోరారు.
జీఎస్టీ కోసం ప్రత్యేక భేటీతో ఫలితం ఉండదు..
జీఎస్టీ బిల్లు ఆమోదం కోసం పార్లమెంటును ప్రత్యేకంగా సమావేశపర్చాలన్న ప్రభుత్వ ప్రయత్నాలపై కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. బీజేపీలోని కళంకిత నేతలైన విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్ సీఎంలపై చర్యలు తీసుకునేంతవరకు అలాంటి యత్నాల వల్ల ఎలాంటి ఫలితం ఉండబోదని తేల్చిచెప్పింది. అయితే, తాము ప్రతిపాదిస్తున్న సవరణలను బిల్లులో చేరిస్తే ప్రభుత్వానికి సహకరిస్తామని భేటీ అనంతరం పార్టీ నేత గులాం నబీ ఆజాద్ స్పష్టం చేశారు. రాహుల్‌కు అధ్యక్ష బాధ్యతలు అప్పగించకపోవడంపై స్పందిస్తూ.. సోనియా, రాహుల్‌ల మధ్య పని విభజన ద్వారా సమతౌల్యం సాధిస్తామని కాంగ్రెస్ పేర్కొంది. వారిద్దరి టీమ్ అనుభవం, యువ రక్తం నిండినదిగా ఉంటుందని ఆజాద్ వ్యాఖ్యానించారు. సంస్థాగత ఎన్నికలను ఏడాది పాటు వాయిదా వేయడమంటే.. రాహుల్‌కు అధ్యక్షుడిగా పదోన్నతి కల్పించడాన్ని వాయిదా వేసినట్లు కాదని పార్టీలోని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. సంస్థాగత ఎన్నికలు పూర్తయ్యేలోపు.. పార్టీ అధ్యక్షుడిగా రాహుల్ నియామకం ఎప్పుడైనా జరగొచ్చన్నారు.
కరువురాష్ట్రాలకు ప్రత్యేక ప్యాకేజీ: సీడబ్ల్యూసీ డిమాండ్
దేశవ్యాప్తంగా రైతులు వర్షాభావ పరిస్థితులు, వరద పరిస్థితులతో అతలాకుతలం అవుతున్నారని, వ్యవసాయ రంగాన్ని ఆదుకునేందుకు వీలుగా కేంద్రం తక్షణం ఉపశమన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ సీడబ్ల్యూసీ రాజకీయ తీర్మానం చేసింది. తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర సహా పలు రాష్ట్రాల్లో కరువు పరిస్థితి నెలకొన్నందున తక్షణం సమగ్ర ఉపశమన ప్యాకేజీ ప్రకటించాలని డిమాండ్ చేసింది. ‘రైతులకు జరిగిన నష్టానికి తగురీతిలో పరిహారం చెల్లించాల్సిన అవసరం ఉంది. పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలి. తక్ష ణం పంటలకు నష్టపరిహారం, తాగునీటి పంపిణీ, ప్రత్యేక పనికి ఆహార పథకం, పశువులకు మేత అందించేందుకు చర్యలు తీసుకోవాలి’ అని డిమాండ్ చే సింది. ప్రభుత్వ పేదల వ్యతిరేక, కార్మిక వ్యతిరేక, రైతు వ్యతిరేక విధానాలపై నిరంతరం పోరాడాలని తీర్మానించింది.
మోదీవి అన్నీ గాలిమాటలే: సోనియా
న్యూఢిల్లీ: ఎన్నికల హామీలను నెరవేర్చడంలో మోదీ సర్కారు దారుణంగా విఫలమైందని సోనియాగాంధీ మండిపడ్డారు. సీడబ్ల్యూసీ భేటీలో ప్రసంగిస్తూ.. ప్రధాని మోదీ ఎన్నికల వాగ్దానాలన్నీ గాలి మాటలేనని ధ్వజమెత్తారు. ‘ఈ ప్రభుత్వ పాలనలో మాటలకు, చేతలకు.. మీడియా కార్యక్రమాలకు, వాస్తవ ఫలితాలకు పొంతన లేదు. హామీల అమల్లో మోదీ సర్కారు అత్యంత దారుణంగా విఫలమైంది’ అని విమర్శించారు. రాహుల్ క్రియాశీల నేతృత్వంలో కాంగ్రెస్ కార్యకర్తలు చేసిన అలుపెరగని పోరాటం వల్లే భూ సేకరణ ఆర్డినెన్స్‌పై ప్రభుత్వం వెనక్కు తగ్గిందన్నారు. కార్మిక సంస్కరణలు, ఉపాధి హామీ చట్టం మొదలైన వాటి విషయంలోనూ అదే తీరున పోరాడాలని పిలుపునిచ్చారు. భూ ఆర్డినెన్స్‌పై పోరులో మిగతా విపక్ష పార్టీలు, పౌర సమాజం కూడా కాంగ్రెస్‌తో కలసివచ్చిందన్నారు. సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. పాకిస్తాన్ విషయంలో స్పష్టమైన విధానం అవలంబించకుండా.. ఏం చేయాలో పాలుపోని స్థితిలో ప్రభుత్వం ఉందని విమర్శించారు.
‘ఎన్నికల సమయంలో మన్మోహన్ సింగ్‌ను, ఆయన ఆర్థిక విధానాలను ఎద్దేవా చేయడమే పనిగా పెట్టుకున్న మోదీ.. ఇప్పుడు తననుతాను సమర్థించుకోలేని స్థాయిలో మాటలు మారుస్తున్నారు. ఆయన తీరుపై ప్రజల్లో ఆనుమానాలు రేకెత్తుతున్నాయి. ఆర్థిక వృద్ధి అధోముఖంలో, ధరలు ఊర్ధ్వ ముఖంలో దూసుకుపోతున్నాయి. మేకిన్ ఇండియా అని, కోటి ఉద్యోగాలని మాటలకు, నినాదాలకే ఈ ప్రభుత్వం పరిమితమైంది. తమ విధానాలను వ్యతిరేకిస్తున్న మీడియాను నోటీసులతో బెదిరిస్తున్నారు. దేశ తొలి ప్రధాని, దార్శనిక నేత, ఆధునిక భారతదేశ నిర్మాత జవహర్‌లాల్ నెహ్రూ లక్ష్యంగా చరిత్రను తిరగరాయాలని ప్రయత్నిస్తున్నారు. దేశోన్నతికి దోహదపడే కీలక వ్యవస్థల స్వతంత్రతను, సమగ్రతను కుట్రపూరితంగా దెబ్బతీస్తున్నారు’ అని మండిపడ్డారు. గోవింద్ పన్సారే, కల్బుర్గిల హత్యలను పరోక్షంగా ప్రస్తావిస్తూ.. తమను విమర్శించే అభ్యుదయ రచయితలు, ప్రగతిశీల ఆలోచనాపరులను భౌతికంగా నిర్మూలిస్తున్నారని ఆరోపించారు. ‘మోదీ ప్రభుత్వం ఆరెస్సెస్ నియంత్రణలో, దాని ఆదేశాల మేరకు పనిచేస్తుందనడానికి గత వారం మనకు ఆధారాలు లభించాయి. ఆరెస్సెస్ ఎజెండా ఏంటో మనందరికీ బాగా తెలుసు’ అని అన్నారు.
కేంద్ర మంత్రులు సంఘ్ పెద్దలను కలసి, ప్రభుత్వ విధానాలను వివరించడంపై ఇలా స్పందించారు. కాగా, పార్టీలో కృషికి, సామర్థ్యానికి గుర్తింపు లభిస్తుందన్న విశ్వాసాన్ని కొత్త సభ్యుల్లో కల్పించాలని, క్రియాశీల కార్యకర్తలను గుర్తించి, వారి సేవలను తగినట్లు ఉపయోగించుకోవడానికి పారదర్శక వ్యవస్థను రూపొందిం చాలని ఆమె సూచించారు. ‘సీడబ్ల్యూసీ ఆమోదించిన సవరణలు అమల్లోకి రావడానికి సమయం పడుతుంది. అవి అమల్లోకి వచ్చాక భవిష్యత్ సవాళ్లను ఎదుర్కొనేలా పార్టీ వ్యవస్థలు బలోపేతమవుతాయి’ అని విశ్వాసం వెలిబుచ్చారు.