organizational elections
-
చిచ్చు రేగింది..!
► సంస్థాగత ఎన్నికలతో టీడీపీలో విభేదాలు బహిర్గతం ► మంత్రి రావెల సమక్షంలోనే తమ్ముళ్ల బాహాబాహీ ► డివిజన్ అధ్యక్షులను ప్రకటించిన ఎమ్మెల్యే మోదుగుల ► మోదుగుల జాబితా చెల్లదంటున్న నగర అధ్యక్షుడు బోనబోయిన సాక్షి, గుంటూరు : జిల్లా టీడీపీలో సంస్థాగత ఎన్నికలు చిచ్చు రేపుతున్నాయి. టీడీపీ అధికారంలోకి వచ్చి మూడేళ్ళు కావస్తున్నా తమకు ఎటువంటి న్యాయం జరుగలేదని పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులతో పాటు, గ్రామాల్లోని కార్యకర్తలు నేతల తీరు పట్ల తీవ్ర స్థాయిలో రగిలిపోతున్నారు. ఈ సమయంలో గ్రామ, మండలాల్లో టీడీపీ సంస్థాగత ఎన్నికలు నిర్వహించాలని పార్టీ అధిష్టానం నిర్ణయించడం పార్టీ జిల్లా నేతలకు తలనొప్పిగా మారింది. ప్రతి నియోజకవర్గంలో టీడీపీ నేతలు గ్రూపులుగా విడిపోయి తమ వర్గానికే పదవి ఇవ్వాలంటూ పట్టుబడుతుండటంతో గ్రామ, మండల స్థాయి పార్టీ అధ్యక్షుల ఎంపిక అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలకు ఇబ్బందికరంగా మారింది. దీంతో జాబితా సిద్ధం చేసినా బయట పెట్టకుండా రహస్యంగా ఉంచుతున్నారు. ఇప్పటికే అనేక నియోజకవర్గాల్లో సంస్థాగత ఎన్నికల సందర్భంగా పార్టీ నాయకుల మధ్య విభేదాలు బహిర్గతం అవుతున్నాయి. జిల్లాలో టీడీపీ నేతల అంతర్గత పోరు సంస్థాగత ఎన్నికల నేపథ్యంలో బహిర్గతమవుతోంది. ఒకరిపై ఒకరు దూషణలకు దిగుతూ తన్నులాటకు సైతం సై అంటున్నారు. ఇటీవల గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని 26 డివిజన్లకు ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాలరెడ్డి పార్టీ డివిజన్ అధ్యక్షులను నియమిస్తూ జాబితాను ప్రకటించారు. ఇది జరిగిన కొద్దిసేపటికే పార్టీ నగర అధ్యక్షుడు బోనబోయిన శ్రీనివాసయాదవ్ పత్రికా విలేకరులకు ఫోన్ చేసి మోదుగుల ప్రకటించిన జాబితా చెల్లదని, జిల్లా పార్టీ అధ్యక్షుడు, పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. గతంలోనూ డివిజన్ అధ్యక్షుల ఎంపికలో ఎమ్మెల్యే మోదుగులకు వ్యతిరేకంగా బోనబోయిన ప్రతి డివిజన్లో తమ వర్గం వారిని అధ్యక్షుడుగా నియమించడం తెలిసిందే. మాచర్ల, మంగళగిరి, గుంటూరు తూర్పు, పశ్చిమ, తాడికొండ, ప్రత్తిపాడు వంటి నియోజకవర్గాల్లో సంస్థాగత ఎన్నికల చిచ్చు పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. పార్టీ నేతలు, కార్యకర్తలు, గ్రూపులుగా చీలి బాహాబాహీకి దిగుతున్నారు. వీరికి నచ్చజెప్పలేక ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్చార్జిలు సైతం పార్టీ గ్రామ, మండల అధ్యక్షుల ఎంపికను వాయిదా వేస్తున్నారు. మంత్రి ఎదుటే తమ్ముళ్ల తన్నులాట గుంటూరు రూరల్ మండలంలో పార్టీ గ్రామ అధ్యక్షుల ఎంపిక నేతల తన్నులాటకు దారి తీసింది. సాక్షాత్తూ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రత్తిపాడు నియోజకవర్గం గుంటూరు రూరల్ మండలంలో పార్టీ గ్రామ అధ్యక్షుల ఎంపిక కోసం ఇరువర్గాలు తన్నులాటకు దిగాయి. మంత్రి ఎదుటే ఒకరిని ఒకరు చొక్కాలు చించుకుని కొట్టుకున్నారు. మంత్రి సముదాయించినా గొడవ సద్దుమణగకపోవడంతో పోలీసు బలగాలు అక్కడకు చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చాయి. ముఖ్యంగా రూరల్ మండలంలోని పొత్తూరు, చౌడవరం, వెంగళాయపాలెం, తురకపాలెం, చినపలకలూరు గ్రామ పార్టీ అధ్యక్షుల ఎంపిక విషయంలో పార్టీ నేతలు హర్షవర్ధన్, వెంగళాయపాలెం ఎంపీటీసీ తనయుడు కల్లూరి శ్రీనుల మధ్య వాదులాట జరిగింది. మంత్రి రావెలతో మాట్లాడుతూనే ఒకరిపై ఒకరు దూషణలకు దిగుతూ తన్నుకున్నారు. దీంతో అర్బన్ పరిధిలోని పలు పోలీసు స్టేషన్ల సీఐలు, డీఎస్పీలు మంత్రి నివాసం వద్దకు చేరుకుని పార్టీ శ్రేణులను చెదరగొట్టి పరిస్థితిని చక్కదిద్దారు. మరుసటి రోజు కూడా ఇద్దరికి చెందిన వర్గాల కార్యకర్తలు ఒకరికొకరు వత్తాసుగా మంత్రి కార్యాలయం వద్దకు చేరుకుని నిరసనల నినాదాలు చేశారు. దీంతో మంత్రి కార్యాలయం వద్ద భారీ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేసి కార్యకర్తలను చెదరగొట్టారు. ఈ వ్యవహారం జిల్లా వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. టీడీపీ అధినేత చంద్రబాబు నివాసం ఉంటున్న గుంటూరు జిల్లాలో సాక్షాత్తూ మంత్రి సమక్షంలో టీడీపీ నాయకులు తన్నుకోవడం చూస్తుంటే జిల్లాలో టీడీపీ పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. పదవుల కోసం నేతలు తన్నులాటకు దిగుతున్న తీరును చూసి జిల్లా టీడీపీ శ్రేణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
మరో ఏడాది సోనియానే
సంస్థాగత ఎన్నికలు సంవత్సరం వాయిదా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ, మహిళా వర్గాలకు 50% పార్టీ పదవులు ఆఫీస్ బేరర్ల పదవీకాలం ఇక మూడేళ్లే; ప్రతీ మూడేళ్లకు సంస్థాగత ఎన్నికలు క్రీయాశీల సభ్యత్వ పునరుద్ధరణ; సీడబ్ల్యూసీ భేటీలో నిర్ణయాలు న్యూఢిల్లీ: సంస్థాగత ఎన్నికల నిర్వహణను మరో ఏడాది పాటు వాయిదా వేస్తూ కాంగ్రెస్ అత్యున్నత విధాన నిర్ణాయక బృందం ‘సీడబ్ల్యూసీ’ మంగళవారం ఒక తీర్మానాన్ని ఆమోదించింది. దాంతో సోనియా గాంధీ పార్టీ అధ్యక్షురాలిగా మరో ఏడాది కొనసాగుతారు. అలాగే, సోనియా స్థానంలో పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించబోతున్నారన్న ఊహాగానాలకూ తెరపడింది. సోనియా అధ్యక్షతన 3 గంటలకు పైగా భేటీ అయిన సీడబ్ల్యూసీ పలు కీలక తీర్మానాలను ఆమోదించింది. ఈ సందర్భంగా సోనియా మాట్లాడుతూ.. ప్రధాని మోదీపై నిప్పులు చెరిగారు. మోదీ పాలనలో మాటలే తప్ప చేతలు లేవని ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌ను బలోపేతం చేసేందుకు పార్టీకి మద్దతిచ్చేవారిని పెంచుకోవాలని, సమాజంలో నూతనంగా ఏర్పడుతున్న వర్గాలకు చేరువ కావాలని నేతలకు పిలుపునిచ్చారు. సంస్థాగత ఎన్నికలను ఏడాది వాయిదా వేయాలన్న నిర్ణయం నేపథ్యంలో పార్టీ అందుకు ఎన్నికల సంఘం అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. పార్టీ రాజ్యాంగంలో కొన్ని కీలక సవరణలను తీసుకురావాల్సి ఉన్నందున సంస్థాగత ఎన్నికల నిర్వహణకు మరింత సమయం అవసరమని ఈసీకి వివరించనుంది. 1998 నుంచి పార్టీ చీఫ్‌గా వ్యవహరిస్తున్న సోనియా సుదీర్ఘ కాలం ఆ బాధ్యతలు నిర్వహించిన వ్యక్తిగా రికార్డు సృష్టించారు. ఈ డిసెంబర్‌తో ఆమె పదవీకాలం ముగియనుండగా, సీడబ్ల్యూసీ తాజా నిర్ణయంతో అది మరో ఏడాది వాయిదా పడింది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ, మహిళా వర్గాలకు పార్టీలో 50% పదవులు కేటాయించాలన్న కీలక ప్రతిపాదనను సీడబ్ల్యూసీ ఆమోదించింది. ఇప్పటివరకు అది 20% మాత్రమే ఉండేది. ఈ మేరకు పార్టీ రాజ్యాంగాన్ని మార్చనున్నారు. పార్టీ సభ్యత్వ కాల పరిమితిని ఐదేళ్ల నుంచి మూడేళ్లకు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీనివల్ల పార్టీ అధ్యక్షుడు లేదా అధ్యక్షురాలు సహా అన్ని ఆఫీస్ బేరర్ పదవుల కాలపరిమితి మూడేళ్లే ఉంటుంది. సంస్థాగత ఎన్నికలను ప్రతీ ఐదేళ్లకు కాకుండా మూడేళ్లకు ఒకసారి నిర్వహించాల్సి ఉంటుంది. సంస్థాగత ఎన్నికల అనంతరం నిర్వహించే పార్టీ ప్లీనరీలో ఈ మార్పులకు ఒక తీర్మానాన్ని సీడబ్ల్యూసీ ఆమోదిస్తుంది. అనంతరం వీటిని పార్టీ రాజ్యాంగంలో చేరుస్తారు.కాంగ్రెస్‌లో, దాని యువజన(యూత్ కాంగ్రెస్), విద్యార్థి(ఎన్ఎస్యూఐ), సేవాదళ్, మహిళా కాంగ్రెస్‌లలో కానీ చేరేవారికి ఏక సభ్యత్వ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించారు.క్రీయాశీల సభ్యత్వ విధానాన్ని పునరుద్ధరించాలని నిర్ణయించారు. కనీసం 25 మంది సభ్యులను చేర్పించిన వారికి పార్టీ క్రియాశీల సభ్యత్వం లభిస్తుంది. క్రియాశీల సభ్యులు ఆటోమాటిక్‌గా బ్లాక్ కాంగ్రెస్ కమిటీలో సభ్యులవుతారు. డీసీసీ, పీసీసీ ప్రతినిధులుగా ఎన్నికవడానికి వారే అర్హులు. పీసీసీ జనరల్ బాడీ కనీసం ఆర్నెల్లలో ఒకసారి, లేదా వీలైనన్ని ఎక్కువ సార్లు భేటీ కావాలని నిర్ణయించారు. డీసీసీ కనీసం నాలుగు నెలలకు ఒకసారి, సబ్ కాంగ్రెస్ కమిటీలు కనీసం మూడు నెలలకు సమావేశం కావాల్సి ఉంటుంది. వీటి కార్యనిర్వాహక కమిటీలు నెలకు ఒకసారైనా భేటీ కావాలి.ఉల్లి సహా నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరగడానికి కారణమైన ద్రవ్యోల్బణం గురించి వివరించాలని సీడబ్ల్యూసీ భేటీలో రాహుల్ మాజీ ఆర్థిక మంత్రి చిదంబరాన్ని కోరారు. జీఎస్టీ కోసం ప్రత్యేక భేటీతో ఫలితం ఉండదు.. జీఎస్టీ బిల్లు ఆమోదం కోసం పార్లమెంటును ప్రత్యేకంగా సమావేశపర్చాలన్న ప్రభుత్వ ప్రయత్నాలపై కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. బీజేపీలోని కళంకిత నేతలైన విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్ సీఎంలపై చర్యలు తీసుకునేంతవరకు అలాంటి యత్నాల వల్ల ఎలాంటి ఫలితం ఉండబోదని తేల్చిచెప్పింది. అయితే, తాము ప్రతిపాదిస్తున్న సవరణలను బిల్లులో చేరిస్తే ప్రభుత్వానికి సహకరిస్తామని భేటీ అనంతరం పార్టీ నేత గులాం నబీ ఆజాద్ స్పష్టం చేశారు. రాహుల్‌కు అధ్యక్ష బాధ్యతలు అప్పగించకపోవడంపై స్పందిస్తూ.. సోనియా, రాహుల్‌ల మధ్య పని విభజన ద్వారా సమతౌల్యం సాధిస్తామని కాంగ్రెస్ పేర్కొంది. వారిద్దరి టీమ్ అనుభవం, యువ రక్తం నిండినదిగా ఉంటుందని ఆజాద్ వ్యాఖ్యానించారు. సంస్థాగత ఎన్నికలను ఏడాది పాటు వాయిదా వేయడమంటే.. రాహుల్‌కు అధ్యక్షుడిగా పదోన్నతి కల్పించడాన్ని వాయిదా వేసినట్లు కాదని పార్టీలోని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. సంస్థాగత ఎన్నికలు పూర్తయ్యేలోపు.. పార్టీ అధ్యక్షుడిగా రాహుల్ నియామకం ఎప్పుడైనా జరగొచ్చన్నారు. కరువురాష్ట్రాలకు ప్రత్యేక ప్యాకేజీ: సీడబ్ల్యూసీ డిమాండ్ దేశవ్యాప్తంగా రైతులు వర్షాభావ పరిస్థితులు, వరద పరిస్థితులతో అతలాకుతలం అవుతున్నారని, వ్యవసాయ రంగాన్ని ఆదుకునేందుకు వీలుగా కేంద్రం తక్షణం ఉపశమన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ సీడబ్ల్యూసీ రాజకీయ తీర్మానం చేసింది. తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర సహా పలు రాష్ట్రాల్లో కరువు పరిస్థితి నెలకొన్నందున తక్షణం సమగ్ర ఉపశమన ప్యాకేజీ ప్రకటించాలని డిమాండ్ చేసింది. ‘రైతులకు జరిగిన నష్టానికి తగురీతిలో పరిహారం చెల్లించాల్సిన అవసరం ఉంది. పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలి. తక్ష ణం పంటలకు నష్టపరిహారం, తాగునీటి పంపిణీ, ప్రత్యేక పనికి ఆహార పథకం, పశువులకు మేత అందించేందుకు చర్యలు తీసుకోవాలి’ అని డిమాండ్ చే సింది. ప్రభుత్వ పేదల వ్యతిరేక, కార్మిక వ్యతిరేక, రైతు వ్యతిరేక విధానాలపై నిరంతరం పోరాడాలని తీర్మానించింది. మోదీవి అన్నీ గాలిమాటలే: సోనియా న్యూఢిల్లీ: ఎన్నికల హామీలను నెరవేర్చడంలో మోదీ సర్కారు దారుణంగా విఫలమైందని సోనియాగాంధీ మండిపడ్డారు. సీడబ్ల్యూసీ భేటీలో ప్రసంగిస్తూ.. ప్రధాని మోదీ ఎన్నికల వాగ్దానాలన్నీ గాలి మాటలేనని ధ్వజమెత్తారు. ‘ఈ ప్రభుత్వ పాలనలో మాటలకు, చేతలకు.. మీడియా కార్యక్రమాలకు, వాస్తవ ఫలితాలకు పొంతన లేదు. హామీల అమల్లో మోదీ సర్కారు అత్యంత దారుణంగా విఫలమైంది’ అని విమర్శించారు. రాహుల్ క్రియాశీల నేతృత్వంలో కాంగ్రెస్ కార్యకర్తలు చేసిన అలుపెరగని పోరాటం వల్లే భూ సేకరణ ఆర్డినెన్స్‌పై ప్రభుత్వం వెనక్కు తగ్గిందన్నారు. కార్మిక సంస్కరణలు, ఉపాధి హామీ చట్టం మొదలైన వాటి విషయంలోనూ అదే తీరున పోరాడాలని పిలుపునిచ్చారు. భూ ఆర్డినెన్స్‌పై పోరులో మిగతా విపక్ష పార్టీలు, పౌర సమాజం కూడా కాంగ్రెస్‌తో కలసివచ్చిందన్నారు. సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. పాకిస్తాన్ విషయంలో స్పష్టమైన విధానం అవలంబించకుండా.. ఏం చేయాలో పాలుపోని స్థితిలో ప్రభుత్వం ఉందని విమర్శించారు. ‘ఎన్నికల సమయంలో మన్మోహన్ సింగ్‌ను, ఆయన ఆర్థిక విధానాలను ఎద్దేవా చేయడమే పనిగా పెట్టుకున్న మోదీ.. ఇప్పుడు తననుతాను సమర్థించుకోలేని స్థాయిలో మాటలు మారుస్తున్నారు. ఆయన తీరుపై ప్రజల్లో ఆనుమానాలు రేకెత్తుతున్నాయి. ఆర్థిక వృద్ధి అధోముఖంలో, ధరలు ఊర్ధ్వ ముఖంలో దూసుకుపోతున్నాయి. మేకిన్ ఇండియా అని, కోటి ఉద్యోగాలని మాటలకు, నినాదాలకే ఈ ప్రభుత్వం పరిమితమైంది. తమ విధానాలను వ్యతిరేకిస్తున్న మీడియాను నోటీసులతో బెదిరిస్తున్నారు. దేశ తొలి ప్రధాని, దార్శనిక నేత, ఆధునిక భారతదేశ నిర్మాత జవహర్లాల్ నెహ్రూ లక్ష్యంగా చరిత్రను తిరగరాయాలని ప్రయత్నిస్తున్నారు. దేశోన్నతికి దోహదపడే కీలక వ్యవస్థల స్వతంత్రతను, సమగ్రతను కుట్రపూరితంగా దెబ్బతీస్తున్నారు’ అని మండిపడ్డారు. గోవింద్ పన్సారే, కల్బుర్గిల హత్యలను పరోక్షంగా ప్రస్తావిస్తూ.. తమను విమర్శించే అభ్యుదయ రచయితలు, ప్రగతిశీల ఆలోచనాపరులను భౌతికంగా నిర్మూలిస్తున్నారని ఆరోపించారు. ‘మోదీ ప్రభుత్వం ఆరెస్సెస్ నియంత్రణలో, దాని ఆదేశాల మేరకు పనిచేస్తుందనడానికి గత వారం మనకు ఆధారాలు లభించాయి. ఆరెస్సెస్ ఎజెండా ఏంటో మనందరికీ బాగా తెలుసు’ అని అన్నారు. కేంద్ర మంత్రులు సంఘ్ పెద్దలను కలసి, ప్రభుత్వ విధానాలను వివరించడంపై ఇలా స్పందించారు. కాగా, పార్టీలో కృషికి, సామర్థ్యానికి గుర్తింపు లభిస్తుందన్న విశ్వాసాన్ని కొత్త సభ్యుల్లో కల్పించాలని, క్రియాశీల కార్యకర్తలను గుర్తించి, వారి సేవలను తగినట్లు ఉపయోగించుకోవడానికి పారదర్శక వ్యవస్థను రూపొందిం చాలని ఆమె సూచించారు. ‘సీడబ్ల్యూసీ ఆమోదించిన సవరణలు అమల్లోకి రావడానికి సమయం పడుతుంది. అవి అమల్లోకి వచ్చాక భవిష్యత్ సవాళ్లను ఎదుర్కొనేలా పార్టీ వ్యవస్థలు బలోపేతమవుతాయి’ అని విశ్వాసం వెలిబుచ్చారు. -
అర్ధరాత్రి అధ్యక్ష ఎన్నికలు!!
తెలుగు తమ్ముళ్ల తగువులాటలతో అర్ధరాత్రి తిరుపతి నగరం అట్టుడికింది! అరుపులు, కేకలు, తోపులాటలు.. గురువారం అర్ధరాత్రి జరిగిన టీడీపీ తిరుపతి నగర అధ్యక్షుడి ఎన్నిక ఆద్యంతం రణరంగాన్ని తలపించింది. వర్గాలుగా విడిపోయిన కార్యకర్తలు ఎన్నికల పరిశీలకుల సమక్షంలోనే బాహాబాహీకి దిగారు. ఈ గందరగోళం మధ్యే నగర అధ్యక్షుడిగా దంపూరి భాస్కర్ రావు ఎన్నికయ్యారు. ఎన్నికల ప్రాంగణానికి సమీప ప్రాంతంలోని జనం నిద్రకు దూరమై అసహనానికి గురయ్యారు. -
తెలుగు తమ్ముళ్ల ‘సంస్థాగత’ గోల
► సంస్థాగత ఎన్నికల్లో రచ్చకెక్కిన విభేదాలు ► దాదాపు 20 చోట్ల ఎన్నికలు వాయిదా ► నారా లోకేష్ చెంతకు పలమనేరు నియోజకవర్గ పంచాయితీ ► పీలేరులో సాగుతున్న కరపత్రాల యుద్ధం ► మదనపల్లె, పుంగనూరులో పార్టీ కార్యకర్తల ధర్నా ► రేణిగుంటలో తమ్ముళ్ల గొడవ ► వర్గపోరుతో కుప్పంలో పూర్తి కాని ఎన్నికలు ► తల పట్టుకుంటున్న చంద్రబాబు ► మేలో జరిగే జిల్లా కమిటీ ఎన్నికలు ప్రశ్నార్థకం సాక్షి, ప్రతినిధి తిరుపతి : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సొంత జిల్లాలో వర్గ విబేధాలు రచ్చకెక్కాయి. కొన్ని చోట్ల తెలుగు తమ్ముళ్లు రోడ్డెక్కి ధర్నాలు చేశారు. పీలేరులో కరపత్రాల యుద్ధం సాగింది. సాక్షాత్తూ సీఎం సొంత ఇలాకాలో రెండు చోట్ల కమిటీ ఎన్నికలు వాయిదా పడ్డాయి. పలుచోట్ల నుంచి అధిష్టానానికి ఫిర్యాదులు వెల్లువలా వెళ్లాయి. చంద్రగిరిలో సైతం గల్లా అరుణకుమారి, సీఎం వర్గాలు కత్తులు దూసుకుంటూనే ఉన్నాయి. మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్లు ఏకంగా ముష్టి ఘాతాలకు దిగారు. దీంతో జిల్లాలో 65 మండల కమిటీలు, 6 మున్సిపాలిటీలు, 2 కార్పొరేషన్లకు జరిగిన సంస్థాగత ఎన్నికల్లో దాదాపు 20 చోట్ల ఎన్నికలు వాయిదాపడ్డాయి. ఈ పరిణామాలు చంద్రబాబుకు తలకు మించిన భారంగా మారాయి. దీనికితోడు పార్టీలో పలువురు నేతలు నామినేటెడ్ పదవులపై ఆశలు పెట్టుకోవడంతో పదవుల భర్తీ సైతం కత్తిమీద సాములా మారింది. జిల్లాలో కొంత మంది పార్టీ నేతలు బహిరంగంగా విమర్శలకు దిగుతున్నారు. ► పలమనేరులో టీడీపీ సీనియర్ నాయకులు నక్కనపల్లి శ్రీనివాసులురెడ్డి, నియోజకవర్గ ఇన్చార్జి సుభాష్ చంద్రబోస్ మధ్య అంత ర్గతపోరు సాగుతోంది. బెరైడ్డిపల్లె మండల కమిటీ ఎన్నికల్లో ఇరువర్గాల మధ్య పొత్తు కుదరకపోవడంతో ఓ వర్గం ఎన్నిక బిహ ష్కరించి నారా లోకేష్‌కు ఫిర్యాదు చేసింది. న్యాయం జరగకపోతే తమదారి తాము చూసుకుంటామని హెచ్చరికలు జారీ చేసినట్టు సమాచారం. ► పీలేరులో నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ ఇక్బాల్ అహ్మద్, నియోజకవర్గ సమన్వయకర్త మల్లారపు రవిప్రకాష్‌నాయుడు వర్గాల మధ్య పోరు తీవ్రస్థాయికి చేరింది. ఇప్పటికే వీరు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ కరపత్రాలను సైతం వేయించారు. పైరవీలు, బెదిరింపులకు భయపడి మండల కమిటీ వేశారంటూ ఓ వర్గం నేతలు బహిరంగంగానే విమర్శించడం గమనార్హం. రెండు వర్గాలతోనే సతమతమవుతున్న పార్టీలోకి తాజాగా మాజీ ఎమ్మెల్యే జీవీ శ్రీనాథరెడ్డి చేరడంతో వర్గాల మధ్య పోరు మరింత పెరిగింది. ► మదనపల్లెలో మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్, పార్టీ సీనియర్ నేత రామదాస్ చౌదరి మధ్య విబేధాలు రచ్చకెక్కాయి. మదనపల్లె నియోజకవర్గానికి పార్టీ తరపున ఇన్చార్జిని సైతం నియమించ లేని దుస్థితిలో అధిష్టానం ఉంది. ► చంద్రగిరి నియోజకవర్గంలో మాజీ మంత్రి గల్లా అరుణకుమారి, ముఖ్యమంత్రి చంద్రబాబు వర్గాలకు పొసగడం లేదు. దీంతో అక్కడ పార్టీ కార్యకర్తలు ఇబ్బందులు పడుతున్నారు. ► పూతలపట్టు నియోజకవర్గంలో యాదమరి, పూతలపట్టు మండలాల్లో వర్గవిభేదాలు తారా స్థాయికి చేరడంతో అక్కడ ఎన్నికలు ఆగిపోయాయి.. ► జీడీ నెల్లూరులో కార్వేటినగరం, వెదురుకుప్పం, ఎస్ఆర్పురం మండల కమిటీ ఎన్నికలు వాయిదా పడ్డాయి. మొదటి నుంచి టీడీపీని నమ్ముకుని ఉన్న పార్టీ కార్యకర్తలకు, శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీనుంచి కొత్తగా చేరిన నాయకుల మధ్య అక్కడ ఆధిపత్య పోరు నడుస్తోంది. ► పుంగనూరు నియోజకవర్గంలో పుంగనూరు పట్ట ణం, సదుం మండలాల కమిటీ ఎన్నికలు ఆగిపోయాయి. అక్కడ తెలుగుయువత కార్యదర్శి మధుసూదన నాయుడు వర్గం, పుంగనూరు నియోజకవర్గ ఇన్చార్జి వెంకటరమణ రాజుల మధ్య ఆధిపత్య పోరు సాగుతోంది. దీంతో పుంగనూరులోని దేశం కార్యాలయం వద్ద ఓ వర్గం నాయకులు ఏకంగా ధర్నాకు దిగి, యువనేత లోకేష్‌కు ఫిర్యాదు చేశారు. ► ముఖ్యమంత్రి సొంత ఇలాకా కుప్పం నియోజకవర్గంలో సైతం నేతల మధ్య పోరుతో పూర్తిస్థాయిలో కమిటీలను వేయలేకపోయారు. నేతలు విద్యాసాగర్, గోపీనాథ్‌ల మధ్య విభేదాలతో ఏకంగా కుప్పం అర్బన్ కమిటీనే రద్దు చేశారు. శాంతిపురం మండలంలో సైతం అధ్యక్షపదవికి పలువురు పోటీపడడంతో ఎన్నికను వాయిదా వేయాల్సి వచ్చింది. ► మంత్రి బొజ్జల ప్రాతినిథ్యం వహిస్తున్న శ్రీకాళహస్తి నియోజకవర్గంలో సైతం మండల కమిటీ ఎన్నికలు సజావుగా సాగలేదు. శ్రీకాళహస్తిలో రెండువర్గాల మధ్య గందరగోళం నెలకొంది. రేణిగుంటలో ఏకంగా తెలుగుతమ్ముళ్లు ముష్టియుద్ధాలకు దిగారు. జిల్లా వ్యాప్తంగా పార్టీ సంస్థాగత ఎన్నికల్లో తీవ్ర విబేధాలు పొడచూపాయి. మేలో జరిగే జిల్లా కమిటీ ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం వుంది. మొత్తం మీద జిల్లా దేశం పార్టీలో నెలకొన్న విబేధాలు ముఖ్యమంత్రి చంద్రబాబు తలకు బొప్పి కట్టిస్తున్నట్టు పార్టీ వర్గాలే పేర్కొంటున్నాయి. ఈ ప్రభావం రాష్ట్రంలో పార్టీపై ప్రభావం చూపుతుందని చంద్రబాబు జిల్లాలోని దేశం నేతలపై అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. -
‘దేశం’లో లుకలుకలు
► ఎమ్మెల్యేల కనుసన్నల్లో సంస్థాగత ఎన్నికలు ► ఎన్నికలకు క్యాడర్ దూరం దూరం ► పలు నియోజకవర్గాల్లో విభేదాలు బహిర్గతం సాక్షి, విశాఖపట్నం : టీడీపీలో అంతర్గత కుమ్ములాటలకు సంస్థాగత ఎన్నికలు వేదికగా నిలిచాయి. కొన్ని నియోజకవర్గాల్లో ఆదిపత్య పోరుకోసం తెలుగు తమ్ముళ్లురోడ్డెక్కితే.. మరికొన్ని నియోజకవర్గాల్లో కార్యకర్తల మనోభావాలకు విరుద్ధంగా ఏకపక్షంగా సాగాయి. దాదాపు అన్ని నియోజకవర్గాల్లో ఈ ఎన్నికల పట్ల పార్టీ కార్యకర్తలు పెద్దగా ఆసక్తి చూపలేదు సరికదా..అంటీ ముట్టనట్టుగానే వ్యవహరించారు. అంతా అనుకున్నట్టుగానే మంత్రుల మధ్య నెలకొన్న విబేధాలు సంస్థాగత ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపాయి. జిల్లాలో ఈనెల 11న ప్రారంభమైన ఎన్నికలు 23తో ముగియాల్సిఉన్నప్పటికీ నెలాఖరు వరకు కొనసాగే అవకాశాలు కన్పిస్తు న్నాయి. సిటీలోనే కాదు.. గ్రామీణ జిల్లాలో కూడా పలు నియోజకవర్గాల్లో పార్టీలో నెలకొన్న గ్రూపు రాజకీయాలకు ఈ ఎన్నికలు వేదికయ్యాయి. ఏ ఒక్క నియోజకవర్గంలోనూ కార్యకర్తల అభిప్రాయాలకనుగుణంగా ఎన్నికలు జరిగిన పరిస్థితిలేదు. దాదాపు అన్ని నియోజకవర్గాల్లోనూ స్థానిక ఎమ్మెల్యేల కనుసన్నల్లోనే జరిగాయి. తాము చెప్పినట్టుగా అణగిమణగి ఉండే వారికే డివిజన్, వార్డు, మండల అధ్యక్ష పదవులు దక్కేలా చక్రం తిప్పా రు. ప్రజాస్వామ్యబద్ధంగా జరగని సంస్థాగత ఎన్నికల తీరు పట్ల సీనియర్ కార్యకర్తలు,నాయకులు తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. చాలా చోట్ల వీరు ఎన్నికలకు దూరంగానే ఉన్నారు. ఇక ఎన్నికల ముందు పచ్చచొక్కాలేసుకుని గద్దెనెక్కిన ప్రజాప్రతినిధులైతే సీనియర్ కార్తకర్తలను పక్కన పెట్టి తమ అనుచరులకు, ఎన్నికల తర్వాత తమ వెంటవచ్చిన వారికి పగ్గాలు అప్పగించడం పట్ల స్థానిక పార్టీ కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. సిటీ పరిధిలోని ఒకటి రెండు నియోజకవర్గాలతో పాటు అనకాపల్లి, యలమంచిలి, పెందుర్తి, పాయకరావుపేట నియోజకవర్గాల్లో సంస్థాగత ఎన్నికలు పార్టీలో గ్రూపు రాజకీయాలకు వేదికయ్యాయి. అనకాపల్లి, యలమంచిలిల్లో తెలుగు తమ్ముళ్ల విబేధాలు రచ్చకెక్కాయి. అనకాపల్లిలో ఎమ్మెల్యే పీలా గోవింద్‌కు క్యాడర్ నుంచి కోలుకోలేని ఎదురుదెబ్బే తగిలింది. జిల్లాలో మరెక్కడా లేని రీతిలో ఈ నియోజకవర్గంలో మండల పార్టీ అధ్యక్ష పదవి కోసం ఎన్నిక అనివార్యమైంది. ఎమ్మెల్యే తీరుపై తాజా మాజీ మండల పార్టీ అధ్యక్షుడు కొణతాల శ్రీనివాసరావు విరుచుకుపడ్డారు. ఇక్కడ పార్టీ రెండు గ్రూపులుగా విడిపోయింది. ఇక యలమంచిలి నియోజకవర్గంలో దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది. ఇక్కడ పార్టీలో అసమ్మతి జ్వాలలు ఎగసిపడ్డాయి. యలమంచిలి పట్టణాధ్యక్షుడిగా మంత్రి గంటా అనుచరుడైన విశాఖ డెయిరీ చైర్మన్ ఆడారి తులసీరావు కుమారుడు ఆనంద్‌కు అప్పగిం చడం పట్ల పార్టీ సీనియర్లు అసంతృప్తికి గురయ్యారు. ఒక కుటుంబానికి ఎన్ని పదవులు కట్టబెడతారంటూ ప్రశ్నిస్తున్నారు. యలమంచిలి మండల పార్టీ అధ్యక్ష పదవి నుంచి తన అనుచరుడ్ని తొలగించడంపై పార్టీ సీని యర్ నాయకుడు సుందరపు విజయ్‌కుమార్ అసంతృప్తికి గురైనట్టుగా చెబుతున్నారు. పాయకరావుపేట, పెందుర్తి నియోజకవర్గాల్లో లుకలుకలు స్థానిక ఎమ్మెల్యేలకు తలనొప్పిగా తయారయ్యాయి. ఒక దశలో రోడ్డెక్కే పరిస్థితి వచ్చినప్పటికీ గుట్టుచప్పుడు కాకుండా చక్కబెట్టుకునే ప్రయత్నం చేశారు. విశాఖ అర్బన్ జిల్లా అధ్యక్షుడు వాసుపల్లి గణేష్‌కుమార్, గణబాబు సొంత నియోజక వర్గంలో ఆధిపత్యం చెలాయించేందుకు తనదైన ముద్ర వేయగలిగారు. ఇక్కడ కొన్ని డివిజన్లలో ఒకటి రెండు గ్రూపులున్నప్పటికీ తమ చెప్పుచేతుల్లో ఉండే వారికే పగ్గాలప్పగించేలా చక్రం తిప్పగలిగారు. తూర్పు, గాజువాకలో ఎన్నికలు కొనసాగుతున్నాయి. మంత్రుల నియోజకవర్గాల్లో తమ ఆధిపత్యాన్ని నిలబెట్టుకునేందుకు అధ్యక్ష పదవులను ఏకగ్రీవమయ్యేలా చేసుకోగలిగారు. మొత్తమ్మీద గంటా అనుచరుల నియోజక వర్గాల్లోనే ఎక్కువగా లుకలుకలు బయటపడ్డాయి. అయ్యన్న మాత్రం సంస్థాగత ఎన్నికల్లో కొంత పైచేయి సాధించినట్టుగా టీడీపీ వర్గాలు విశ్లేషించుకుంటున్నాయి. -
అధికార పదవే ముద్దు!
* పార్టీ పదవిపై టీఆర్ఎస్ వర్గాల్లో అనాసక్తి * జిల్లా అధ్యక్ష పదవులకు పోటీ కరువు * నామినేటెడ్ పోస్టులను కోరుకుంటున్న నేతలు * రేపు, ఎల్లుండి టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుల ఎన్నిక * అత్యధిక జిల్లాల్లో పాత వారికే పట్టంకట్టే అవకాశం సాక్షి, హైదరాబాద్: అధికార టీఆర్ఎస్లో సంస్థాగత ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. మండల కమిటీల ఎన్నికల్లో పదవుల కోసం పార్టీ నేతలు వర్గాలుగా విడిపోయి పోటీ పడ్డారు. దీంతో కొన్ని చోట్ల ఎన్నికలు వాయిదా పడ్డాయి. మరోవైపు జిల్లా అధ్యక్ష పదవులకు మాత్రం పోటీ కనిపించడం లేదు. మెజారిటీ జిల్లాల్లో ఈ పదవుల కోసం ఎవరూ ముందుకు రావడం లేదు. పార్టీ అధికారంలో ఉండడంతో అందరి దృష్టి అధికారిక పదవులపైనే ఉంది. జిల్లా అధ్యక్ష పదవి తీసుకుంటే కార్పొరేషన్, ఇతర నామినేటెడ్ పదవులు తమకు రావన్న ఆందోళన జిల్లా నేతల్లో నెలకొంది. ఈ బుధ, గురువారాల్లో రోజుకు ఐదు జిల్లాల చొప్పున జిల్లా అధ్యక్ష పదవులకు ఎన్నికలు జరగాల్సి ఉంది. దీనికోసం ఒక్కో జిల్లాకు ఒక్కో మంత్రిని ఎన్నికల అధికారులుగా నియమించారు. అయితే గ్రామ, మండల శాఖల్లో కనిపించిన పోటీ జిల్లా శాఖల విషయంలో లేకపోవడం చర్చనీయాంశమైంది. మరోవైపు వివాదాల్లేకుండా జిల్లా శాఖలను నడిపిన వారికే తిరిగి అవకాశం ఇవ్వాలని పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ భావిస్తున్నారని, ఒకటీ రెండు మినహా పెద్దగా మార్పులు ఉండకపోవచ్చునని పార్టీ నాయకులు అంటున్నారు. జిల్లాల్లో ఇదీ పరిస్థితి.. ఆదిలాబాద్ జిల్లాను పార్టీ సౌకర్యం కోసం తూర్పు, పశ్చిమ జిల్లాలుగా విభజించారు. ప్రస్తుతం తూర్పు జిల్లాకు పురాణం సతీష్, పశ్చిమ జిల్లాకు లోక భూమారెడ్డి అధ్యక్షులుగా ఉన్నారు. వీరికి ప్రత్యామ్నాయంగా కొత్త పేర్లేవీ ఇప్పటి దాకా తెరపైకి రాలేదు. దీంతో వీరికి పోటీ ఉండకపోవచ్చునని తెలుస్తోంది. నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న ఈగ గంగా రెడ్డికి కూడా ప్రత్యామ్నాయం కనిపించడం లేదు. అయితే గంగారెడ్డి నిజామాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ పోస్టును ఆశిస్తున్నారని, ప్రస్తుత పదవిపై ఆసక్తి చూపడం లేదని తెలిసింది. ఇక మెదక్‌లో పోటీ ఎక్కువగా లేకపోయినా, ఒకరిద్దరి పేర్లు తెరపైకి వస్తున్నాయి. ప్రస్తుతం మాజీ ఎమ్మెల్సీ ఆర్.సత్యనారాయణ అధ్యక్షుడిగా ఉండగా, ఆయననే కొనసాగిస్తారని అంటున్నారు. అయితే ఆయన మాత్రం నామినేటెడ్ పదవి ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. డిప్యూటీ స్పీకర్ పద్మ భర్త దేవేందర్‌రెడ్డి పేరుతో పాటు సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ పేర్లు తెరపైకి వచ్చాయి. మరోవైపు మహబూబ్‌నగర్ జిల్లాలో ప్రస్తుత అధ్యక్షుడు విఠల్‌రావు ఆర్యను కొనసాగించాలని ఓ వర్గం అంటోంది. మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్, కృష్ణమోహన్‌రెడ్డి వంటి నేతల పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. కాగా, విఠల్‌రావు మాత్రం నామినేటెడ్ పదవి కోరుకుంటున్నారని చెబుతున్నారు. కరీంనగర్ జిల్లాలో ప్రస్తుత అధ్యక్షుడు ఈద శంకర్రెడ్డినే తిరిగి కొనసాగించనున్నట్లు తెలుస్తోంది. అయితే ఆయన మాత్రం ఎమ్మెల్సీ పదవిని ఆశిస్తున్నారు. డాక్టర్ సంజయ్, పి.భూపతిరెడ్డి వంటి పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. వరంగల్ జిల్లాలోనూ పెద్దగా మార్పేమీ ఉండకపోవచ్చని తెలుస్తోంది. ఇక్కడ గ్రేటర్ అధ్యక్షునిగా నన్నపనేని నరేందర్, జిల్లా అధ్యక్షునిగా రవీందర్రావు ఉన్నారు. వీరిలో రవీందర్రావు ఎమ్మెల్సీ పదవిని ఆశిస్తున్నారు. ఈ జిల్లాలోనూ వీరినే కొనసాగించే అవకాశముంది. నల్లగొండలోనూ పాత అధ్యక్షుడు బండా నరేందర్‌రెడ్డిని మార్చకపోవచ్చునని తెలుస్తోంది. పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీ టికెట్ ఆశించి భంగపడిన ఆయన మరో నామినేటెడ్ పదవిపై ఆశపెట్టుకున్నారు. ఏవైనా కారణాల వల్ల మార్పు అనివార్యమైతే నల్లగొండ ఇన్చార్జి దుబ్బాక నర్సింహారెడ్డికి అవకాశం రావచ్చంటున్నారు. ఇక రంగారెడ్డి జిల్లాలో ప్రస్తుత అధ్యక్షుడు నాగేందర్గౌడ్కే అవకాశం ఎక్కువగా ఉందని, కాదంటే నక్క ప్రభాకర్ గౌడ్ పేరును పరిశీలించే అవకాశమున్నట్లు సమాచారం. ఖమ్మంలో పోటాపోటీ ఇతర జిల్లాలకు భిన్నంగా ఖమ్మం జిల్లాలో పార్టీ అధ్యక్ష ఎన్నికకు పోటీ తీవ్రంగా ఉంది. ప్రస్తుతం జిల్లాలో గ్రూపు రాజ కీయం జోరుగా సాగుతోంది. ప్రస్తుత అధ్యక్షుడు దుండిగాల రాజేందర్ తననే కొనాగించాలన్న కోరికతో ఉన్నారు. ఖమ్మం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఎం.ఎ.బేగ్ కూడా ఈసారి అధ్యక్ష పదవి రేసులో ఉన్నారు. టీడీపీ నుంచి పార్టీలోకి వచ్చిన నేతలే ఎక్కువగా పోటీ పడుతున్నారు. కొండబాల కోటేశ్వర్రావు, టి.వెంకటేశ్వర్రావు, మచ్చా శ్రీనివాస్‌రావు వంటి వారు పదవిని ఆశిస్తున్నారు. మంత్రి తుమ్మల, పార్లమెంటరీ కార్యదర్శి జలగం వెంకటరావు వర్గాలు కూడా పోటాపోటీగా ప్రయత్నాలు చేస్తున్నాయి.