అధికార పదవే ముద్దు!
* పార్టీ పదవిపై టీఆర్‌ఎస్ వర్గాల్లో అనాసక్తి
* జిల్లా అధ్యక్ష పదవులకు పోటీ కరువు
* నామినేటెడ్ పోస్టులను కోరుకుంటున్న నేతలు
* రేపు, ఎల్లుండి టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుల ఎన్నిక
* అత్యధిక జిల్లాల్లో పాత వారికే పట్టంకట్టే అవకాశం
సాక్షి, హైదరాబాద్: అధికార టీఆర్‌ఎస్‌లో సంస్థాగత ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. మండల కమిటీల ఎన్నికల్లో పదవుల కోసం పార్టీ నేతలు వర్గాలుగా విడిపోయి పోటీ పడ్డారు. దీంతో కొన్ని చోట్ల ఎన్నికలు వాయిదా పడ్డాయి. మరోవైపు జిల్లా అధ్యక్ష పదవులకు మాత్రం పోటీ కనిపించడం లేదు. మెజారిటీ జిల్లాల్లో ఈ పదవుల కోసం ఎవరూ ముందుకు రావడం లేదు. పార్టీ అధికారంలో ఉండడంతో అందరి దృష్టి అధికారిక పదవులపైనే ఉంది. జిల్లా అధ్యక్ష పదవి తీసుకుంటే కార్పొరేషన్, ఇతర నామినేటెడ్ పదవులు తమకు రావన్న ఆందోళన జిల్లా నేతల్లో నెలకొంది. ఈ బుధ, గురువారాల్లో రోజుకు ఐదు జిల్లాల చొప్పున జిల్లా అధ్యక్ష పదవులకు ఎన్నికలు జరగాల్సి ఉంది. దీనికోసం ఒక్కో జిల్లాకు ఒక్కో మంత్రిని ఎన్నికల అధికారులుగా నియమించారు. అయితే గ్రామ, మండల శాఖల్లో కనిపించిన పోటీ జిల్లా శాఖల విషయంలో లేకపోవడం చర్చనీయాంశమైంది. మరోవైపు వివాదాల్లేకుండా జిల్లా శాఖలను నడిపిన వారికే తిరిగి అవకాశం ఇవ్వాలని పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ భావిస్తున్నారని, ఒకటీ రెండు మినహా పెద్దగా మార్పులు ఉండకపోవచ్చునని పార్టీ నాయకులు అంటున్నారు.
జిల్లాల్లో ఇదీ పరిస్థితి..
ఆదిలాబాద్ జిల్లాను పార్టీ సౌకర్యం కోసం తూర్పు, పశ్చిమ జిల్లాలుగా విభజించారు. ప్రస్తుతం తూర్పు జిల్లాకు పురాణం సతీష్, పశ్చిమ జిల్లాకు లోక భూమారెడ్డి అధ్యక్షులుగా ఉన్నారు. వీరికి ప్రత్యామ్నాయంగా కొత్త పేర్లేవీ ఇప్పటి దాకా తెరపైకి రాలేదు. దీంతో వీరికి పోటీ ఉండకపోవచ్చునని తెలుస్తోంది. నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న ఈగ గంగా రెడ్డికి కూడా ప్రత్యామ్నాయం కనిపించడం లేదు. అయితే గంగారెడ్డి నిజామాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ పోస్టును ఆశిస్తున్నారని, ప్రస్తుత పదవిపై ఆసక్తి చూపడం లేదని తెలిసింది. ఇక మెదక్‌లో పోటీ ఎక్కువగా లేకపోయినా, ఒకరిద్దరి పేర్లు తెరపైకి వస్తున్నాయి. ప్రస్తుతం మాజీ ఎమ్మెల్సీ ఆర్.సత్యనారాయణ అధ్యక్షుడిగా ఉండగా, ఆయననే కొనసాగిస్తారని అంటున్నారు. అయితే ఆయన మాత్రం నామినేటెడ్ పదవి ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. డిప్యూటీ స్పీకర్ పద్మ భర్త దేవేందర్‌రెడ్డి పేరుతో పాటు సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ పేర్లు తెరపైకి వచ్చాయి. మరోవైపు మహబూబ్‌నగర్ జిల్లాలో ప్రస్తుత అధ్యక్షుడు విఠల్‌రావు ఆర్యను కొనసాగించాలని ఓ వర్గం అంటోంది. మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్, కృష్ణమోహన్‌రెడ్డి వంటి నేతల పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. కాగా, విఠల్‌రావు మాత్రం నామినేటెడ్
పదవి కోరుకుంటున్నారని చెబుతున్నారు. కరీంనగర్ జిల్లాలో ప్రస్తుత అధ్యక్షుడు ఈద శంకర్‌రెడ్డినే తిరిగి కొనసాగించనున్నట్లు తెలుస్తోంది. అయితే ఆయన మాత్రం ఎమ్మెల్సీ పదవిని ఆశిస్తున్నారు. డాక్టర్ సంజయ్, పి.భూపతిరెడ్డి వంటి పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. వరంగల్ జిల్లాలోనూ పెద్దగా మార్పేమీ ఉండకపోవచ్చని తెలుస్తోంది. ఇక్కడ గ్రేటర్ అధ్యక్షునిగా నన్నపనేని నరేందర్, జిల్లా అధ్యక్షునిగా రవీందర్‌రావు ఉన్నారు. వీరిలో రవీందర్‌రావు ఎమ్మెల్సీ పదవిని ఆశిస్తున్నారు. ఈ జిల్లాలోనూ వీరినే కొనసాగించే అవకాశముంది. నల్లగొండలోనూ పాత అధ్యక్షుడు బండా నరేందర్‌రెడ్డిని మార్చకపోవచ్చునని తెలుస్తోంది. పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీ టికెట్ ఆశించి భంగపడిన ఆయన మరో నామినేటెడ్ పదవిపై ఆశపెట్టుకున్నారు. ఏవైనా కారణాల వల్ల మార్పు అనివార్యమైతే నల్లగొండ ఇన్‌చార్జి దుబ్బాక నర్సింహారెడ్డికి అవకాశం రావచ్చంటున్నారు. ఇక రంగారెడ్డి జిల్లాలో ప్రస్తుత అధ్యక్షుడు నాగేందర్‌గౌడ్‌కే అవకాశం ఎక్కువగా ఉందని, కాదంటే నక్క ప్రభాకర్ గౌడ్ పేరును పరిశీలించే అవకాశమున్నట్లు సమాచారం.
ఖమ్మంలో పోటాపోటీ
ఇతర జిల్లాలకు భిన్నంగా ఖమ్మం జిల్లాలో పార్టీ అధ్యక్ష ఎన్నికకు పోటీ తీవ్రంగా ఉంది. ప్రస్తుతం జిల్లాలో గ్రూపు రాజ కీయం జోరుగా సాగుతోంది. ప్రస్తుత అధ్యక్షుడు దుండిగాల రాజేందర్ తననే కొనాగించాలన్న కోరికతో ఉన్నారు. ఖమ్మం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఎం.ఎ.బేగ్ కూడా ఈసారి అధ్యక్ష పదవి రేసులో ఉన్నారు. టీడీపీ నుంచి పార్టీలోకి వచ్చిన నేతలే ఎక్కువగా పోటీ పడుతున్నారు. కొండబాల కోటేశ్వర్‌రావు, టి.వెంకటేశ్వర్‌రావు, మచ్చా శ్రీనివాస్‌రావు వంటి వారు పదవిని ఆశిస్తున్నారు. మంత్రి తుమ్మల, పార్లమెంటరీ కార్యదర్శి జలగం వెంకటరావు వర్గాలు కూడా పోటాపోటీగా ప్రయత్నాలు చేస్తున్నాయి.