► సంస్థాగత ఎన్నికలతో టీడీపీలో విభేదాలు బహిర్గతం
► మంత్రి రావెల సమక్షంలోనే తమ్ముళ్ల బాహాబాహీ
► డివిజన్ అధ్యక్షులను ప్రకటించిన ఎమ్మెల్యే మోదుగుల
► మోదుగుల జాబితా చెల్లదంటున్న నగర అధ్యక్షుడు బోనబోయిన
సాక్షి, గుంటూరు : జిల్లా టీడీపీలో సంస్థాగత ఎన్నికలు చిచ్చు రేపుతున్నాయి. టీడీపీ అధికారంలోకి వచ్చి మూడేళ్ళు కావస్తున్నా తమకు ఎటువంటి న్యాయం జరుగలేదని పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులతో పాటు, గ్రామాల్లోని కార్యకర్తలు నేతల తీరు పట్ల తీవ్ర స్థాయిలో రగిలిపోతున్నారు. ఈ సమయంలో గ్రామ, మండలాల్లో టీడీపీ సంస్థాగత ఎన్నికలు నిర్వహించాలని పార్టీ అధిష్టానం నిర్ణయించడం పార్టీ జిల్లా నేతలకు తలనొప్పిగా మారింది.
ప్రతి నియోజకవర్గంలో టీడీపీ నేతలు గ్రూపులుగా విడిపోయి తమ వర్గానికే పదవి ఇవ్వాలంటూ పట్టుబడుతుండటంతో గ్రామ, మండల స్థాయి పార్టీ అధ్యక్షుల ఎంపిక అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలకు ఇబ్బందికరంగా మారింది. దీంతో జాబితా సిద్ధం చేసినా బయట పెట్టకుండా రహస్యంగా ఉంచుతున్నారు. ఇప్పటికే అనేక నియోజకవర్గాల్లో సంస్థాగత ఎన్నికల సందర్భంగా పార్టీ నాయకుల మధ్య విభేదాలు బహిర్గతం అవుతున్నాయి.
జిల్లాలో టీడీపీ నేతల అంతర్గత పోరు సంస్థాగత ఎన్నికల నేపథ్యంలో బహిర్గతమవుతోంది. ఒకరిపై ఒకరు దూషణలకు దిగుతూ తన్నులాటకు సైతం సై అంటున్నారు. ఇటీవల గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని 26 డివిజన్‌లకు ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాలరెడ్డి పార్టీ డివిజన్ అధ్యక్షులను నియమిస్తూ జాబితాను ప్రకటించారు. ఇది జరిగిన కొద్దిసేపటికే పార్టీ నగర అధ్యక్షుడు బోనబోయిన శ్రీనివాసయాదవ్ పత్రికా విలేకరులకు ఫోన్ చేసి మోదుగుల ప్రకటించిన జాబితా చెల్లదని, జిల్లా పార్టీ అధ్యక్షుడు, పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
గతంలోనూ డివిజన్ అధ్యక్షుల ఎంపికలో ఎమ్మెల్యే మోదుగులకు వ్యతిరేకంగా బోనబోయిన ప్రతి డివిజన్‌లో తమ వర్గం వారిని అధ్యక్షుడుగా నియమించడం తెలిసిందే. మాచర్ల, మంగళగిరి, గుంటూరు తూర్పు, పశ్చిమ, తాడికొండ, ప్రత్తిపాడు వంటి నియోజకవర్గాల్లో సంస్థాగత ఎన్నికల చిచ్చు పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. పార్టీ నేతలు, కార్యకర్తలు, గ్రూపులుగా చీలి బాహాబాహీకి దిగుతున్నారు. వీరికి నచ్చజెప్పలేక ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్‌చార్జిలు సైతం పార్టీ గ్రామ, మండల అధ్యక్షుల ఎంపికను వాయిదా వేస్తున్నారు.
మంత్రి ఎదుటే తమ్ముళ్ల తన్నులాట
గుంటూరు రూరల్ మండలంలో పార్టీ గ్రామ అధ్యక్షుల ఎంపిక నేతల తన్నులాటకు దారి తీసింది. సాక్షాత్తూ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రత్తిపాడు నియోజకవర్గం గుంటూరు రూరల్ మండలంలో పార్టీ గ్రామ అధ్యక్షుల ఎంపిక కోసం ఇరువర్గాలు తన్నులాటకు దిగాయి. మంత్రి ఎదుటే ఒకరిని ఒకరు చొక్కాలు చించుకుని కొట్టుకున్నారు. మంత్రి సముదాయించినా గొడవ సద్దుమణగకపోవడంతో పోలీసు బలగాలు అక్కడకు చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చాయి.
ముఖ్యంగా రూరల్ మండలంలోని పొత్తూరు, చౌడవరం, వెంగళాయపాలెం, తురకపాలెం, చినపలకలూరు గ్రామ పార్టీ అధ్యక్షుల ఎంపిక విషయంలో పార్టీ నేతలు హర్షవర్ధన్, వెంగళాయపాలెం ఎంపీటీసీ తనయుడు కల్లూరి శ్రీనుల మధ్య వాదులాట జరిగింది. మంత్రి రావెలతో మాట్లాడుతూనే ఒకరిపై ఒకరు దూషణలకు దిగుతూ తన్నుకున్నారు. దీంతో అర్బన్ పరిధిలోని పలు పోలీసు స్టేషన్‌ల సీఐలు, డీఎస్పీలు మంత్రి నివాసం వద్దకు చేరుకుని పార్టీ శ్రేణులను చెదరగొట్టి పరిస్థితిని చక్కదిద్దారు. మరుసటి రోజు కూడా ఇద్దరికి చెందిన వర్గాల కార్యకర్తలు ఒకరికొకరు వత్తాసుగా మంత్రి కార్యాలయం వద్దకు చేరుకుని నిరసనల నినాదాలు చేశారు.
దీంతో మంత్రి కార్యాలయం వద్ద భారీ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేసి కార్యకర్తలను చెదరగొట్టారు. ఈ వ్యవహారం జిల్లా వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. టీడీపీ అధినేత చంద్రబాబు నివాసం ఉంటున్న గుంటూరు జిల్లాలో సాక్షాత్తూ మంత్రి సమక్షంలో టీడీపీ నాయకులు తన్నుకోవడం చూస్తుంటే జిల్లాలో టీడీపీ పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. పదవుల కోసం నేతలు తన్నులాటకు దిగుతున్న తీరును చూసి జిల్లా టీడీపీ శ్రేణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.