‘దేశం’లో లుకలుకలు
► ఎమ్మెల్యేల కనుసన్నల్లో సంస్థాగత ఎన్నికలు
► ఎన్నికలకు క్యాడర్ దూరం దూరం
► పలు నియోజకవర్గాల్లో విభేదాలు బహిర్గతం
సాక్షి, విశాఖపట్నం : టీడీపీలో అంతర్గత కుమ్ములాటలకు సంస్థాగత ఎన్నికలు వేదికగా నిలిచాయి. కొన్ని నియోజకవర్గాల్లో ఆదిపత్య పోరుకోసం తెలుగు తమ్ముళ్లురోడ్డెక్కితే.. మరికొన్ని నియోజకవర్గాల్లో కార్యకర్తల మనోభావాలకు విరుద్ధంగా ఏకపక్షంగా సాగాయి. దాదాపు అన్ని నియోజకవర్గాల్లో ఈ ఎన్నికల పట్ల పార్టీ కార్యకర్తలు పెద్దగా ఆసక్తి చూపలేదు సరికదా..అంటీ ముట్టనట్టుగానే వ్యవహరించారు. అంతా అనుకున్నట్టుగానే మంత్రుల మధ్య నెలకొన్న విబేధాలు సంస్థాగత ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపాయి. జిల్లాలో ఈనెల 11న ప్రారంభమైన ఎన్నికలు 23తో ముగియాల్సిఉన్నప్పటికీ నెలాఖరు వరకు కొనసాగే అవకాశాలు కన్పిస్తు న్నాయి.
సిటీలోనే కాదు.. గ్రామీణ జిల్లాలో కూడా పలు నియోజకవర్గాల్లో పార్టీలో నెలకొన్న గ్రూపు రాజకీయాలకు ఈ ఎన్నికలు వేదికయ్యాయి. ఏ ఒక్క నియోజకవర్గంలోనూ కార్యకర్తల అభిప్రాయాలకనుగుణంగా ఎన్నికలు జరిగిన పరిస్థితిలేదు. దాదాపు అన్ని నియోజకవర్గాల్లోనూ స్థానిక ఎమ్మెల్యేల కనుసన్నల్లోనే జరిగాయి. తాము చెప్పినట్టుగా అణగిమణగి ఉండే వారికే డివిజన్, వార్డు, మండల అధ్యక్ష పదవులు దక్కేలా చక్రం తిప్పా రు.
ప్రజాస్వామ్యబద్ధంగా జరగని సంస్థాగత ఎన్నికల తీరు పట్ల సీనియర్ కార్యకర్తలు,నాయకులు తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. చాలా చోట్ల వీరు ఎన్నికలకు దూరంగానే ఉన్నారు. ఇక ఎన్నికల ముందు పచ్చచొక్కాలేసుకుని గద్దెనెక్కిన ప్రజాప్రతినిధులైతే సీనియర్ కార్తకర్తలను పక్కన పెట్టి తమ అనుచరులకు, ఎన్నికల తర్వాత తమ వెంటవచ్చిన వారికి పగ్గాలు అప్పగించడం పట్ల స్థానిక పార్టీ కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు.
సిటీ పరిధిలోని ఒకటి రెండు నియోజకవర్గాలతో పాటు అనకాపల్లి, యలమంచిలి, పెందుర్తి, పాయకరావుపేట నియోజకవర్గాల్లో సంస్థాగత ఎన్నికలు పార్టీలో గ్రూపు రాజకీయాలకు వేదికయ్యాయి. అనకాపల్లి, యలమంచిలిల్లో తెలుగు తమ్ముళ్ల విబేధాలు రచ్చకెక్కాయి. అనకాపల్లిలో ఎమ్మెల్యే పీలా గోవింద్‌కు క్యాడర్ నుంచి కోలుకోలేని ఎదురుదెబ్బే తగిలింది. జిల్లాలో మరెక్కడా లేని రీతిలో ఈ నియోజకవర్గంలో మండల పార్టీ అధ్యక్ష పదవి కోసం ఎన్నిక అనివార్యమైంది. ఎమ్మెల్యే తీరుపై తాజా మాజీ మండల పార్టీ అధ్యక్షుడు కొణతాల శ్రీనివాసరావు విరుచుకుపడ్డారు.
ఇక్కడ పార్టీ రెండు గ్రూపులుగా విడిపోయింది. ఇక యలమంచిలి నియోజకవర్గంలో దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది. ఇక్కడ పార్టీలో అసమ్మతి జ్వాలలు ఎగసిపడ్డాయి. యలమంచిలి పట్టణాధ్యక్షుడిగా మంత్రి గంటా అనుచరుడైన విశాఖ డెయిరీ చైర్మన్ ఆడారి తులసీరావు కుమారుడు ఆనంద్‌కు అప్పగిం చడం పట్ల పార్టీ సీనియర్లు అసంతృప్తికి గురయ్యారు. ఒక కుటుంబానికి ఎన్ని పదవులు కట్టబెడతారంటూ ప్రశ్నిస్తున్నారు. యలమంచిలి మండల పార్టీ అధ్యక్ష పదవి నుంచి తన అనుచరుడ్ని తొలగించడంపై పార్టీ సీని యర్ నాయకుడు సుందరపు విజయ్‌కుమార్ అసంతృప్తికి గురైనట్టుగా చెబుతున్నారు.
పాయకరావుపేట, పెందుర్తి నియోజకవర్గాల్లో లుకలుకలు స్థానిక ఎమ్మెల్యేలకు తలనొప్పిగా తయారయ్యాయి. ఒక దశలో రోడ్డెక్కే పరిస్థితి వచ్చినప్పటికీ గుట్టుచప్పుడు కాకుండా చక్కబెట్టుకునే ప్రయత్నం చేశారు. విశాఖ అర్బన్ జిల్లా అధ్యక్షుడు వాసుపల్లి గణేష్‌కుమార్, గణబాబు సొంత నియోజక వర్గంలో ఆధిపత్యం చెలాయించేందుకు తనదైన ముద్ర వేయగలిగారు. ఇక్కడ కొన్ని డివిజన్లలో ఒకటి రెండు గ్రూపులున్నప్పటికీ తమ చెప్పుచేతుల్లో ఉండే వారికే పగ్గాలప్పగించేలా చక్రం తిప్పగలిగారు.
తూర్పు, గాజువాకలో ఎన్నికలు కొనసాగుతున్నాయి. మంత్రుల నియోజకవర్గాల్లో తమ ఆధిపత్యాన్ని నిలబెట్టుకునేందుకు అధ్యక్ష పదవులను ఏకగ్రీవమయ్యేలా చేసుకోగలిగారు. మొత్తమ్మీద గంటా అనుచరుల నియోజక వర్గాల్లోనే ఎక్కువగా లుకలుకలు బయటపడ్డాయి. అయ్యన్న మాత్రం సంస్థాగత ఎన్నికల్లో కొంత పైచేయి సాధించినట్టుగా టీడీపీ వర్గాలు విశ్లేషించుకుంటున్నాయి.